అగ్రనేతలు అక్కడికి ఎందుకు వచ్చినట్టో? | Massive Encounter in Chhattisgarh update | Sakshi
Sakshi News home page

అగ్రనేతలు అక్కడికి ఎందుకు వచ్చినట్టో?

Published Wed, Mar 2 2016 8:29 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

అగ్రనేతలు అక్కడికి ఎందుకు వచ్చినట్టో? - Sakshi

అగ్రనేతలు అక్కడికి ఎందుకు వచ్చినట్టో?

మావోయిస్టు అగ్రనేతలు పాల్గొన్న ప్లీనరీ దేనికోసమనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్‌టాఫిక్‌గా మారింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్‌తో పాటు మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు అగ్రనేతలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారన్న పక్కా సమాచారం పోలీసులకు ఉంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్లీనరీ మంగళవారంనాటితో ముగియూల్సి ఉండగా, ఆఖరి రోజున గ్రేహౌండ్స్ బలగాలు మెరుపుదాడి చేశాయి.


దీంతో ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తప్పించుకున్న అగ్రనేతల కోసం మూడు రాష్ట్రాల పోలీసు బలగాలుముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే చాలాకాలం తర్వాత మావోయిస్టు పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసుకోవటం వెనుక గల బలమైన కారణాలమేటన్న దానిపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అక్కడి ప్రభుత్వం దూకుడుగా వెళ్తుండటం, త్వరలో మూడు రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగే తునికాకు సేకరణలో రేటు నిర్ణయం, ఖమ్మం-వరంగల్ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ల వ్యవహారం, ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస ఎన్‌కౌంటర్‌లతో పార్టీకి జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనే దానిపై ప్లీనరీ వేదికగా అగ్రనేతలు చర్చించినట్లుగా సమాచారం.


వారోత్సవాల రోజుల్లో మినహా ఈ స్థాయిలో మావోయిస్టుల ప్లీనరీ గత కొన్నేళ్లుగా జరుగలేదని, కానీ, అనుకోని రీతిలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో... పరిణామాలు ఎలా ఉంటాయోననే దానిపై మూడు రాష్ట్రాల పరిధిలో చర్చ సాగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌ల కాంట్రాక్టర్లకు ఇటీవలనే మావోయిస్టు నేత దామోదర్ పేరుతో కూడిన హెచ్చరిక లేఖ విడుదల కావడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.


కోవర్టు ఆపరేషన్‌తో మెరుపుదాడి
పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొట్టెంతోగు సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆదివారం నుంచి మావోయిస్టుఅగ్రనేతలతో ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు ఆదివారం సాయంత్రం చర్ల నుంచి బయలుదేరి మంగళవారం ఉదయానికి మావోయిస్టుల శిబిరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

అయితే మావోయిస్టుల సమావేశంపై పోలీసులకు సమాచారమెలా అందిందనే దానిపై తీవ్ర చర్చ సాగుతోంది. ఆదివారం చర్లలో జరిగిన వారపు సంతకు సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ జిల్లాలకు చెందిన పలువురు ఆదివాసీలు రాగా, అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఈ సమాచారాన్ని సేకరించారని తెలుస్తోంది. మంగ ళవారంతో ప్లీనరీ ముగుస్తున్న తరుణంలో పక్కా వ్యూహంతో పోలీసు బలగాలు మెరుపుదాడి చేశారుు.


అగ్రనేతలు ఎక్కడ ..?
మూడంచెల భద్రతతో ఉన్న మావోయిస్టు అగ్రనేతలు ఎన్‌కౌంటర్ నుంచి సునాయాసంగా తప్పించుకున్నప్పటికీ, వారు ఎక్కడ షెల్టర్ తీసుకున్నారనే దానిపై మూడు రాష్ట్రాల పోలీసులు ఆరా తీస్తున్నారు. జరిగిన నష్టానికి మావోరుుస్టులు ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో మూడు రాష్ట్రాల సరిహద్దులోని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన రోజున పోలీసు బలగాలు వెనుదిరిగి వచ్చిన కొన్ని గంటలకు... అదే ప్రదేశానికి మావోయిస్టులు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్‌కౌంటర్ ప్రదేశంలో కొన్ని తూటాలను సేకరించికి వెళ్లారని, కోవర్టు ఆపరేషన్ జరిగిందా..? అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపే క్రమంలోనే అగ్రనేతల సూచనల మేరకే వారు మళ్లీ అక్కడికి వచ్చారనే ప్రచారం సాగుతోంది. దీంతో మావోయిస్టుల నుంచి త్వరలోనే ప్రతీకార చర్యలు ఉంటాయని, గతంలో భారీ ఎన్‌కౌంటర్‌లు జరిగిన తరువాత జరిగిన మావోల దాడులను ఈ ప్రాంతవాసులు గుర్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement