ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలివ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి దేహాలను భద్రపరిచే విషయంలో తీసుకుంటున్న చర్యలు, ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
మృతదేహాలను అన్ని సౌకర్యాలున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించి, నిపుణుల చేత రీపోస్టుమార్టం నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీన్ని అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు న్యాయవాది వి.రఘునాథ్ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అందుకు అంగీకరించి విచారణ చేపట్టింది. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 8 మంది మృతదేహాలను ప్రస్తుతం ఖమ్మం జిల్లా, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉంచారని రఘునాథ్ తెలిపారు. వాటిని అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రిలో భద్రపరిచి, రీపోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావును ఆదేశించింది.