(ఫైల్ ఫోటో)
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు.
ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు
► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు.
► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం.
ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు
లొంగిపోయుంటే బతికుండేవారు
ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు.
ఆర్కేకు ఘన నివాళి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు.
ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment