పుస్తకాలను తీసుకెళ్తున్న పోలీసులు
అంబర్‌పేట (హైదరాబాద్): మావోయిస్టు దివంగత అగ్ర నేత రామకృష్ణ (ఆర్కే) పేరుతో పుస్తకం ముద్రిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సదరు ప్రింటింగ్ ప్రెస్‌పై దాడి చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా ప్రాంతంలో రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నవ్య ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రింటింగ్ ప్రెస్‌లో రామకృష్ణ జీవితంపై పుస్తకం ముద్రిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేసి పుస్తకాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఈ పుస్తకాల్లో మావోయిస్టు భావజాలం ఉందని డీసీపీ వెల్లడించారు. పుస్తకాలు, ప్రింటింగ్ ప్లేట్లు, పెన్‌డ్రైవ్‌లను తీసుకెళ్లారు. ప్రింటింగ్ ప్రెస్ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి పీవోడబ్ల్యూ నేత సంధ్య భర్త కావడం గమనార్హం.
భర్త జ్ఞాపకాలతో పుస్తకం వేసుకుంటే తప్పా?
‘నా భర్త, కొడుకు ఇద్దరు చనిపోయారు. వారి జ్ఞాపకాలను ఒక పుస్తకం రూపంలో తెద్దాం అనుకున్నా. ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకొచ్చా. ఈనెల 14న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రామకృష్ణ సంస్మరణ సభ ఉంది. భర్త, కొడుకు జ్ఞాపకాలను పుస్తక రూపంలో తీసుకొస్తే తప్పేముంది. వీరి జ్ఞాపకాలు చాలా పత్రికల్లో వచ్చాయి కూడా. వాటినే పుస్తక రూపంలో తీసుకొస్తే దాన్ని తప్పుబట్టి పోలీసులు సీజ్ చేయడం దారుణం’అని ఆర్కే భార్య శిరీష వాపోయారు.
Comments
Please login to add a commentAdd a comment