akkiraju Rama Krishna
-
పృథ్వీ ఐదో వర్ధంతి సభ అనుకున్నాం.. కానీ, అంతలోనే ఆర్కేని కూడా...
టంగుటూరు/ఒంగోలు సబర్బన్: ‘భర్తను, కుమారుడిని ఒకేసారి స్మరించుకోవాల్సి వస్తుందనుకోలేదు..’ అంటూ ఆర్కే సతీమణి అక్కిరాజు శిరీష తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘తొలుత పృథ్వీ ఐదో వర్ధంతి సభ పెట్టాలనుకున్నాం.. కానీ అంతలోనే ఆర్కేని కూడా స్మరించుకోవాల్సి వచ్చింది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆదివారం అక్కిరాజు పృథ్వీ అలియాస్ మున్నా ఐదో వర్ధంతి సభ, ఆర్కే సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి శిరీష అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. తన బిడ్డ 2016 అక్టోబర్ 24న అమరుడయ్యాడంటూ గుర్తు చేసుకున్నారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని ఆమె నినందించారు. విప్లవ రచయితల సంఘం నేత పాణి మాట్లాడుతూ 54 ఏళ్ల భారత విప్లవోద్యమ చరిత్రలో ఆర్కే 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎంతో గొప్పదంటూ కొనియాడారు. 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్కే చొరవ మరువలేనిదన్నారు. ఆర్కే తమ్ముడు అక్కిరాజు సుబ్బారావు మాట్లాడుతూ పల్నాడులోని తుమ్మురుకోట గ్రామం నుంచి 1982లో ప్రజల కోసం తన అన్న ఉద్యమంలోకి వెళ్లాడని, అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చల సమయంలోనే తాను అన్నను చూసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన పృథ్వీ అమర స్థూపం వద్ద ఆర్కేకి, గ్రామానికి చెందిన మరో మావోయిస్టు జయకుమార్‌కు కూడా నివాళులర్పించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు, పౌర హక్కుల సంఘం నేత చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి
సాక్షి, అమరావతి/టంగుటూరు/చర్ల (ఖమ్మం)/కొరాపుట్ (ఒడిశా): సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ (63) అలియాస్ రామకృష్ణ, ఆర్కే, సాకేత్, మధు, శ్రీనివాస్‌కు వైద్యం అందించినప్పటికీ రక్షించుకోలేకపోయామని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ స్పష్టం చేశారు. ఆర్కే మరణాన్ని ధృవీకరిస్తూ శుక్రవారం ఓ ప్రకటన, అంత్యక్రియలకు సంబంధించిన ఫొటోలను శనివారం విడుదల చేశారు. ఆర్కేకు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలుకాగా, వెంటనే డయాలసిస్ ప్రారంభించినప్పటికీ.. కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయని, పర్యవసానంగా ఈ నెల 14న ఉదయం 6 గంటలకు అమరుడయ్యారని అభయ్ పేర్కొన్నారు. ఆర్కేకు విప్లవ శ్రేణుల మధ్య అంత్యక్రియలు నిర్వహించామని, ఆయన మృతి పార్టీకి తీరనిలోటని చెప్పారు. సాధారణ జీవితం, అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల ప్రేమ, కామ్రెడ్స్‌తో ఆప్యాయతలు, విప్లవ గమనంపై స్పష్టతతో విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందించారని కొనియాడారు. ఆర్కే ఆశయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంత్యక్రియలకు భారీగా హాజరైన ఆదివాసీలు ► ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడు – కొండపల్లి మధ్య అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు నిర్వహించారు. ► ఈ సందర్బంగా ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండాను ఉంచి మావోయిస్టులు నివాళులు అర్పించారు. ఆర్కే అంత్యక్రియల్లో బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని పాలగూడ, గుండ్రాయి, కంచాల, మీనగట్ట, దామారం, జబ్బగట్ట తదితర గ్రామాల నుంచి సుమారు 2 వేల మందికిపైగా ఆదివాసీలతో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. భారీ ర్యాలీ నిర్వహించినట్లు సమాచారం. ఆలకూరపాడులో ఆర్కే చిత్రపటానికి నివాళులర్పిస్తున్న భార్య శిరీష, కుటుంబ సభ్యులు లొంగిపోయుంటే బతికుండేవారు ఆర్కే మృతి విషయాన్ని ఒడిశాలోని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పిళ్లై ఓ వీడియో ద్వారా వెల్లడించారు. పోలీసులకు లొంగిపోయుంటే ఆర్కేకు నాణ్యమైన వైద్యం అందేదని, బతికేవాడన్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, హరి భూషణలతో పాటు దండకారణ్యం జోనల్ స్పెషల్ కమిటీ సభ్యులు శోభరాజ్, గంగా, వినోద్‌లు సైతం ప్రాణాలు విడిచారని ఐజీ గుర్తు చేశారు. ఆర్కేకు ఘన నివాళి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆర్కే భార్య శిరీష, కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆర్కే చిత్రపటానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ‘ఆర్కే అమర్ రహే.. అమరవీరులకు జోహార్లు’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యమ గీతాలు ఆలపించారు. ‘నా భర్తతో పాటు కుమారుడు వీరత్వం పొందాడని గర్వంగా భావిస్తున్నాను. ఆర్కే మృతితో ఉద్యమం ఆగిపోదు. ఆయనలాంటి గెరిల్లా యుద్ధ వీరులు ఇంకా పుట్టుకొస్తారు’ అని శిరీష అన్నారు. ‘ప్రజల కోసం జీవిస్తాం.. ప్రజల కోసమే మరణిస్తాం’ అన్న మాటను ఆర్కే నిలబెట్టుకున్నాడని అమరవీరుల బంధుమిత్రుల సంఘం స్టేట్ సెక్రటరీ భవాని పేర్కొన్నారు. ‘ఆర్కే ప్రజల మనిషి. ప్రజల హృదయాల్లో ఉంటాడు. ఆయన ప్రజల కోసమే అమరుడయ్యారు’ అని విరసం నేత కళ్యాణరావు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆర్కే మరణ వార్తను ధ్రువీకరించుకుని శిరీష, బంధుమిత్రులు విలపించారు. శిరీషను విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పినాకపాణి, సహాయ కార్యదర్శి రివేరా, అమరుల బంధు మిత్రుల సంఘం సభ్యురాలు శోభా తదితరులు పరామర్శించారు. -
నల్లమలలో ఆర్కే కీ రోల్..!
ఒంగోలు: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఉరఫ్ ఆర్కే మృతి వార్తల ప్రచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ఆర్కే సతీమణి నివాసం ఉండే టంగుటూరు మండలం ఆలకూరపాడులో కూడా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. దట్టమైన నల్లమల అడవులు మావోయిస్టులకు కేంద్రంగా నిలిచాయి. నల్లమలలో దాదాపు 47 దళాలు పనిచేసేవి. రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తూ రామకృష్ణ ఈ దళాలకు మార్గదర్శకంగా వ్యవహరించేవారు. (చదవండి: భర్త చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టిన భార్య!) ఈ క్రమంలోనే మావోయిస్టులపై (అప్పట్లో నక్సలైట్లు) పోలీసులు ఉక్కుపాదం మోపడంతో రామకృష్ణ అండర్గ్రౌండుకు చేరుకున్నారు. ఇలా ఆయన అండర్‌గ్రౌండులో ఉన్న సమయంలోనే టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన కందుల శిరీష అలియాస్ పద్మను 1988లో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారికి మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ జన్మించాడు. బిడ్డ పుట్టిన కొద్ది నెలల తరువాత రామకృష్ణ తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వ చర్చలకు జిల్లా నుంచే బయటకు: జిల్లాలోని పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల మండలాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువగా జరిగేవి. 2004 అక్టోబరు 15న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మావోయిస్టులతో చర్చలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో వారు దోర్నాల మండలం చినారుట్ల వద్ద నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా గుత్తికొండ బిళం వద్ద మావోయిస్టులంతా కలుసుకుని చర్చలు జరిపి అనంతరం కారుల్లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం జిల్లా నుంచి తిరిగి దళాలు చినారుట్ల వద్ద నుంచే అడవుల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో 2005లో ఒంగోలులో అప్పటి ఎస్పీ మహేష్‌చంద్ర లడ్హాపై జరిగిన దాడి ఘటనను రాష్ట్ర పోలీసుశాఖ సీరియస్‌గా తీసుకుంది. కొద్ది నెలలకే యర్రగొండపాలెం మండలం పాలుట్ల అటవీ ప్రాంతంలో అప్పటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాధవ్‌తోపాటు పలువురు ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఘటనలో అగ్రనేత ఆర్కే తప్పించుకున్నాడు. చదవండి: Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..? తండ్రి బాటలోనే తనయుడు: ఇంటర్ వరకు విద్యనభ్యసించిన మున్నా అలియాస్ పృథ్వీ అలియాస్ శివాజీ కూడా తండ్రి అడుగు జాడల్లోనే ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 2009లో తండ్రి చెంతకు చేరిన మున్నా అతి కొద్దికాలంలోనే టెక్నికల్ డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. తరువాత కొన్నాళ్లకు రామకృష్ణను కలిసేందుకు వెళ్తుండగా పోలీసులు ఒక మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె రామకృష్ణ భార్యగా వెల్లడైంది. ఆమె పేరు శిరీష అని, పద్మగా పిలుస్తుంటారనేది తెలిసింది. అంతే కాకుండా విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు కళ్యాణరావుకు శిరీష మరదలు కూడా కావడంతో మరింత నిఘా పెంచారు. ఏఓబీ ఇన్చార్జిగా: అయితే నల్లమలలో పోలీసుల పట్టు పెరగడం, అనేక మంది మావోయిస్టులు దోర్నాల, యర్రగొండపాలెం, పుల్లల చెరువు మండలాల్లో ఎన్కౌంటర్లకు గురికావడంతో మావోయిస్టులు నల్లమలను వదిలి దండకారణ్య ప్రాంతమైన ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌పై పట్టు పెంచారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలతో కలిసి కార్యకలాపాలు ఉధృతం అయ్యాయి. 2008లో బలిమెల ఘటనలో కృష్ణానదిలో ప్రయాణిస్తున్న భద్రతా దళాలపై జరిగిన దాడిలో జిల్లాకు చెందిన ఇద్దరు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం నాలుగు రాష్ట్రాలతో ప్రత్యేకమైన యాక్షన్ టీమును రంగంలోకి దించిన సందర్భంలో 2016లో పృథ్వీ మరణించగా ఆర్కే తప్పించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు. అయితే అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని, తద్వారా ఆయన కన్నుమూసినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బంధువులు మాత్రం ఆయన మరణవార్తను నిర్థారించడం లేదు. మావోయిస్టు పార్టీ నుంచి తమకు ఎటువంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు. -
ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. చికిత్స అందించినా ఆర్కేను కాపాడలేకపోయామని తెలిపారు. గురువారం ఆర్కే మృతి చెందారని మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ వెల్లడించారు. డయాలసిస్ కొనసాగుతుండగా కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించారని తెలిపారు. చదవండి: ఆర్కే కన్నుమూత ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు Akkiraju Rama Krishna: నాన్న బాటలోనే మున్నా -
‘ఆర్కే మృతిపై మావోయస్టుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదు’
సాక్షి, ప్రకాశం: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతి చెందిన విషయం పార్టీ ప్రకటించిన తర్వాతే నిజమని భావిస్తామని ఆయన భార్య శిరీష తెలిపారు. ఆర్కే మృతిపై ఆయన భార్య శిరీష శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్కే మృతి చెందినట్టుగా మీడియాలో వచ్చే వార్తలే చూస్తున్నామని అన్నారు. ఆయన మృతి చెందారని ఛత్తీస్‌గఢ్ డీజీపీ ప్రకటించారని, కానీ ఆయనకు ఎవరు సమాచారం ఇచ్చారో చెప్పలేదని తెలిపారు. ఆర్కే 40 ఏళ్లు జీవితాన్ని ప్రజలకోసం ధారపోశారని తెలిపారు. ప్రజా ఉద్యమంలో ఆర్కే ఒక యోధుడు, నిస్వార్థ విప్లవకారుడు అని తెలిపారు. ఉద్యమంలో బిడ్డను కూడా పోగొట్టుకున్నారని, ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహం తాము తెచ్చుకునేలా అక్కడి ప్రభుత్వం, గ్రామ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కే భార్య శిరీష ప్రస్తుతం అలకూరపాడులో నివాసం ఉంటున్నారు. -
నాన్న బాటలోనే మున్నా
సాక్షి, అమరావతి: తండ్రి ఆశయాలకు ఆకర్షితుడైన ఆర్కే కుమారుడు పృథ్వీ (మున్నా) కూడా 16వ ఏటనే (2004 చర్చల అనంతరం) దళంలో చేరాడు. ఏవోబీలో సెక్షన్ కమాండర్‌గా ఎదిగాడు. అయితే 2016 అక్టోబర్ 24న ఏవోబీ రామ్‌గూడాలో పోలీసులు జరిపిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ ఎన్కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. అందులో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మావోయిస్టు కీలక నేత కావడంతో మున్నా బాల్యం అత్యంత నిర్బంధంలో గడిచింది. ఆర్కే ఆచూకీ చెప్పమంటూ ఇంటిపై పోలీసుల దాడులు భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ క్రమంలో అతడిని ఒంగోలులో రహస్యంగా చదివించారు. నాన్న కోసం తల్లితో పాటు మున్నా అడవికి వెళ్లినప్పుడల్లా కాంటాక్ట్ దొరకక ఒకోసారి రెండు మూడు నెలలు గిరిజనులతోపాటే అడవిలోనే గడపాల్సి వచ్చేది. అక్కడ తన లాంటి పిల్లలు పడుతున్న కష్టాన్ని చూసిన మున్నా బాధపడేవాడు. ఒకానోక రోజు మున్నా తన నాన్న ఆర్కేను తల్లితో పాటు అడవిలో కలుసుకున్నాడు. అమ్మతో కొద్ది రోజులు అక్కడే ఉంటానన్నాడు. ఆ కొద్ది రోజులూ చాలా రోజులు అయిపోయాయి. ఒక రకంగా చెప్పాలంటే మున్నాని ఉద్యమంలోనికి ఆహ్వనించింది ఆర్కేనే అంటారు. తన కొడుకు అందరిలా ఏ డాక్టరో, ఇంజనీరో కావాలని ఆయన కోరుకోలేదు. తన కొడుకుకు తనలా ప్రపంచ ప్రజలను ప్రేమించడం నేర్పాలని కలలు కన్నాడు. అదే విషయాన్ని భార్యకు ఉత్తరాల్లోనూ రాసేవాడు. మున్నాను మావోయిస్ట్ సైన్యానికే యుద్ధతంత్రాలు నేర్పేంతగా తీర్చిదిద్దాడు. -
ఆర్కే తండ్రి, ఎన్టీఆర్ మంచి స్నేహితులు
చర్ల: ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి మిత్రులు. గుంటూరు ఏసీ కళాశాలలో చదివే రోజుల్లో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. 1983లో ఎన్టీ.రామా రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో సచ్చిదానందరావును స్వయంగా పిలిచారట. ప్రమాణ స్వీకారానికి వెళ్లిన సచ్చిదానందరావు కుటుంబ వివరాలను తెలుసుకున్న ఎన్టీరామారావు ఆయన కుమారుడు ఆర్కేకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని చెప్పగా అందుకు నిరాకరించిన ఆర్కే తాను ప్రజల కోసం పీపుల్స్‌వార్‌లో పని చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు విస్తుపో యారట. అంతకు ముందు నుంచే ఆర్కే పీపుల్స్‌వార్ దళంలో పని చేస్తున్నప్పటికీ ఆయన చెప్పే వరకు తల్లిదండ్రులకు తెలియ దు. తర్వాత కొన్ని రోజులకే ఇంటి నుంచి వెళ్లిపోయి హరగోపాల్ నుంచి రామకృష్ణగా, ఆర్కేగా పేరు మార్చుకున్నాడు. అనంతరం పీపుల్స్‌వార్‌లో ఉన్నత స్థాయికి చేరాడు. తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్షలు 1990లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్కే పీపుల్స్‌వార్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, పల్నాడు ప్రాంతాల్లో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వడ్డీ వ్యాపారుల అరాచకాలను ఎదిరించాడు. ఈ క్రమంలో ఆర్కే కొందరిని హతమార్చాడు. దీంతో తప్పుడు పనులు చేయడానికి అప్పుడు జనం భయపడ్డారు. అప్పట్లో మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి నేరుగా శిక్షలు కూడా విధించారు. దీంతో జనం పీపుల్స్ వార్‌పై ఆసక్తి చూపారు. ఈ క్రమంలో చాలా మంది ప్రజలు వారి బాధలను నేరుగా పీపుల్స్‌వార్ సభ్యులకే చెప్పుకునేవారు. ఉద్యమం ఆ స్థాయికి చేరుకునేలా చేయడంలో ఆర్కే విజయం సాధించాడు. ఆ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీలో విలీనం కావడంతో ఆర్కే జాతీయ నాయకుడ య్యాడు. ఉద్యమంలో ఉండగానే విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావుకు దగ్గరి బంధువునే ఆర్కే వివాహం చేసుకున్నాడు. -
ఆర్కే కన్నుమూత
సాక్షి, అమరావతి: మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ సాకేత్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే (66) మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దక్షిణ బస్తర్ అటవీప్రాంతంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆయన బుధవారం మృతిచెందినట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు గురువారం తెలిసింది. ఆర్కే మృతిచెందినట్టు తమకు సమాచారం అందిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ఆర్కే మృతిపై తమకు సమాచారం లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. దేశంలోనే మావోయిస్టు కీలక అగ్రనేతల్లో ఒకరుగా ఉన్న గుర్తింపు పొందిన ఆర్కే దీర్ఘకాలంగా మధుమేహం, కీళ్ల నొప్పులు, స్పాండిలైటిస్, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అయినప్పటికీ బీజాపూర్ జిల్లా అటవీప్రాంతంలో ఉంటూ స్థానికంగా వైద్యం చేయించుకున్నారుగానీ బయటకు వచ్చేందుకు సుముఖత చూపలేదు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించిన ఆయన మూత్రం కూడా బంద్ అవడంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. బీజాపూర్ అటవీప్రాంతంలోనే గురువారం అంత్యక్రియలు కూడా నిర్వహించినట్టు పోలీసువర్గాలు తెలిపాయి. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని తుమృకోట. ఆయనకు భార్య కందుల నిర్మల అలియాస్ శిరీష అలియాస్ పద్మ ఉన్నారు. ఆయన కుమారుడు శివాజి అలియాస్ పృథ్వి అలియాస్ మున్నా 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందాడు. మావోయిస్టు ఉద్యమంలో నాలుగు దశాబ్దాల పాటు కీలకనేతగా ఉన్న ఆర్కేపై దేశవ్యాప్తంగా 200కిపైగా కేసులున్నాయి. 2003లో అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమోర్‌మైన్స్‌తో దాడి కేసు కూడా ఆయనపై ఉంది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహించారు. గతంలో ఎన్నోసార్లు పోలీసు కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. కొన్నేళ్లుగా బలహీనపడిన మావోయిస్టు పార్టీకి ఆర్కే మృతి తీవ్రనష్టమని పరిశీలకులు చెబుతున్నారు. నల్లమల, ఏవోబీ కార్యక్షేత్రాలు గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటకు చెందిన ఆర్కే 1975లో అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమంవైపు ఆకర్షితులయ్యారు. 1977 నుంచి పీపుల్స్‌వార్ పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. నాలుగు దశాబ్దాల ఉద్యమ జీవితంలో ఆర్కే ప్రధానంగా నల్లమల, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లను కేంద్రస్థానాలుగా చేసుకుని పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆర్కే 1977లో పీపుల్స్‌వార్ పార్టీలో నల్లమల దళం ఏర్పాటు చేసి 1982 వరకు ఉద్యమాన్ని బలోపేతం చేశారు. గుంటూరు జిల్లాలోని వెల్దుర్తి నుంచి నాగార్జునసాగర్ వరకు నల్లమల దళాన్ని విస్తరించారు. స్థానికుల మద్దతు కూడగట్టి నాగార్జున బ్యాక్‌వాటర్ గుండా రాకపోకలు సాగిస్తూ చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేశారు. 1984 నుంచి కొన్నేళ్లు నల్లమల దళం కార్యకలాపాలు తగ్గి, నక్సలైట్ ఉద్యమం నెమ్మదించింది. మళ్లీ 1990 నుంచి నల్లమలలో నక్సలైట్ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 1999–2000లో ఆర్కేను పీపుల్స్‌వార్ పార్టీ దండకారణ్యం పంపించింది. ఏవోబీ కార్యదర్శిగా ఆర్కే భారీగా రిక్రూట్మెంట్లు చేసి 2003 నాటికి దాదాపు 500 మందితో ఏవోబీ దళాన్ని పటిష్టం చేశారు. పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) పార్టీలు విలీనమై 2004లో మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించడంలో ఆర్కే కీలకపాత్ర పోషించారు. అనంతరం కూడా ఆయన ఆంధ్ర–ఒడిశా–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఏవోబీ కార్యదర్శిగా, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీని కూడా శాసించేస్థాయికి ఎదిగారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా గణపతి ఉన్నప్పటికీ ఆర్కేదే పైచేయిగా ఉండేదని చెబుతారు. ఒకానొక సమయంలో ఆర్కేను మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అవుతారని భావించారు. అనారోగ్య కారణాలతో ఆయన అందుకు సుముఖత చూపలేదని చెబుతారు. 2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ బాగా బలహీనపడటంతో ఆర్కే ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు పార్టీ వ్యవహారాల నుంచి 2020లో పూర్తిగా దూరం జరిగిన ఆయన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకే పరిమితమయ్యారు. రూ.కోటిన్నరకుపైగా రివార్డు పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రిక్రూట్మెంట్లు, మిలటరీ ఆపరేషన్లలో ఆర్కే ఆరితేరారు. చుండూరు మారణహోమానికి ప్రతీకారంగా దగ్గుబాటి చెంచురామయ్యను పీపుల్స్‌వార్ నక్సలైట్లు హత్యచేసిన దాడికి నేతృత్వం వహించారు. 2003లో తిరుపతిలోని అలిపిరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్లెమెర్మైన్స్తో దాడి వెనుక మాస్టర్ బ్రెయిన్ ఆర్కేనే. ఆ కేసులో ప్రధాన నిందితుల్లో ఆయన ఒకరు. 2003 ఏప్రిల్ 2న జరిగిన అప్పటి పెద్దారవీడు ఎస్ఐ, ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల కిడ్నాప్‌లో ఆర్కే ప్రమేయం ఉందని చెబుతారు. 2005లో ప్రకాశం జిల్లా ఎస్పీ మహేశ్‌చంద్ర లడ్హాపై హత్యాయత్నం, 2008లో ఒడిశాలోని బలిమెల రిజర్వాయర్‌లో గ్రేహౌండ్స్ దళాలపై కొండలపై నుంచి కాల్పులు జరిపి 37 మందిని బలిగొన్న కేసులో నిందితుడు. 2011లో ఒడిశాలోని మల్కనగిరి కలెక్టర్ వినీల్‌కృష్ణ కిడ్నాప్ వెనుక ఉన్నదీ ఆర్కేనే. ఇలా దాదాపు 200కిపైగా కేసుల్లో నిందితుడైన ఆర్కేపై పలు రాష్ట్రాల్లో రివార్డులున్నాయి. మహారాష్ట్రలో రూ.50 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.25 లక్షలు, ఒడిశాలో రూ.20 లక్షలు, జార్ఖండ్‌లో రూ.12 లక్షల వంతున.. ఇతరత్రా మొత్తంగా రూ.1.52 కోట్ల రివార్డు ఉంది. నల్లమల నుంచి బయటకు వచ్చి ప్రభుత్వంతో చర్చలు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని నిర్ణయించింది. అప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టుల ప్రతినిధి బృందానికి ఆర్కే నేతృత్వం వహించారు. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గుర్తింపు పొందారు. పీపుల్స్‌వార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నల్లమల ప్రాంతం నుంచే ఆర్కే నేతృత్వంలో మావోయిస్టులు బయటకు వచ్చారు. 2004 సెప్టెంబర్ 14న దోర్నాల మండలం చిన్నారుట్ల నుంచి బయటకు వచ్చారు. అనంతరం గురజాల నియోజకవర్గంలోని గుత్తికొండ బిలం వద్ద బహిరంగసభ నిర్వహించారు. తరువాత హైదరాబాద్ వెళ్లి ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎన్నోసార్లు.. ప్రాణాలతో బయటపడిన ఆర్కే నాలుగు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో ఆర్కే ఎన్నోసార్లు ఎన్కౌంటర్ల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆర్కే చుట్టూ బలమైన అంగరక్షక వ్యవస్థ ఉండేది. 1991లో నల్లమలలో ఎన్కౌంటర్ నుంచి 2016లో రామగూడ ఎన్కౌంటర్ వరకు ఆయన దాదాపు 20 ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. నల్లమల, లందుల, దొరగూడ, దల్దాలి, టక్కరపడ, బెజ్జంగి, బడ్జేడు, రామగూడ తదితర ఎన్కౌంటర్ల నుంచి ఆయన బయటపడ్డారు. 2006 జూలై 23న యర్రగొండపాలెం మండలం చుక్కలకొండ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి మాధవ్, మరో ఏడుగురు చనిపోగా ఆర్కే తప్పించుకున్నారు. ప్రకాశం జిల్లాలో పాలుట్ల అటవీ ప్రాంతం దగ్గర, పెద్దదోర్నాల మండలంలోని చిన్నారుట్ల అటవీ ప్రాంతం దగ్గర జరిగిన ఎదురు కాల్పుల్లో కూడా తప్పించుకున్నారు. 2008లో నల్లమలలో పోలీసు బలగాలు ఆయన్ని దాదాపు చుట్టుముట్టాయి. కనుచూపుమేరలో ఉన్న ఆర్కే ఇక దొరికిపోవడమో.. ఎన్కౌంటరో.. అనే సమాచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా గుప్పుమంది. కానీ చివరి నిమిషంలో ఆశ్చర్యకరంగా ఆయన తప్పించుకున్నారు. అప్పటినుంచి కొన్ని పదులసార్లు ఎన్కౌంటర్లో ఆర్కే చనిపోయారని వార్తలు గుప్పుమనడం, తరువాత అది అవాస్తవమని తేలడం పరిపాటిగా మారిపోయింది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం నరాజముల తండా వద్ద 2010 మార్చి 12న జరిగిన ఎన్కౌంటర్ నుంచి ఆర్కే తప్పించుకోగా రాష్ట్ర కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావు ప్రాణాలు కోల్పోయాడు. 2016లో రామగూడ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయాలైన ఆర్కేని అంగరక్షకులు సురక్షితంగా తప్పించారు. ఆర్కే ఏకైక లక్ష్యంగా ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు లెక్కకుమించి ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. కానీ అవేవీ ఫలించలేదు. పలుమార్లు ఎన్కౌంటర్లలో ఆయన అంగరక్షకులు మృతిచెందారు. ఆయన మాత్రం దొరకలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆర్కేతో సంప్రదింపులు జరిపి ఆయన లొంగిపోయేలా చేసేందుకు నాలుగు రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించారు. ప్రధానంగా గత ఏడాది కరోనా వ్యాప్తి తదనంతర పరిస్థితుల్లో ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆయన లొంగిపోతే మెరుగైన వైద్యం అందిస్తామని కూడా చెప్పారు. కానీ లొంగిపోయేందుకు ఆర్కే సమ్మతించ లేదు. ఎన్కౌంటర్లో కుమారుడు మృతి ఆర్కే ఒకే ఒక కుమారుడు పృథ్వి అలియాస్ మున్నా పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందారు. 2004లో ప్రభుత్వంతో చర్చల తరువాత ఆర్కే కుమారుడు పృథ్వి అలియాస్ మున్నా కూడా మావోయిస్టు ఉద్యమంలో చేరారు. ఆయన 2016లో రామగూడ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఆ ఎన్కౌంటర్ సమయంలో ఆయన తన తండ్రి ఆర్కే అంగరక్షక దళ సభ్యుడిగా ఉన్నారు. ఆ ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయమైన ఆర్కే తప్పించుకోగా.. మున్నా ప్రాణాలు కోల్పోయారు. -
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కాల్పుల మోత
-
తృటిలో తప్పిన భారీ ఎన్కౌంటర్
సాక్షి, విజయనగరం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ) మరోసారి తుపాకుల మోతమోగింది. ముంచంగిపుట్టు, పెదబయలు అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తప్పించుకోగా, ఏవోబీ కార్యదర్శి చలపతి, ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు అనంతరం పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా.. సంఘటనా స్థలంలో రక్తపు మరకలను బట్టి ఈ నిర్ధారణకు వచ్చారు. మరోవైపు భారీ వర్షాలతో పోలీసుల కూంబింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా నెలాఖరున అమరవీరుల వారోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నద్ధం అయ్యారు. ఇందుకోసం కార్యక్రమాల రూపకల్పనకు వారంతా కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారంతో పోలీసులు కూంబింగ్ జరిపారు. అయితే గాయపడిన మావోయిస్టులు లొంగిపోతే చికిత్స చేయిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
ఉలిక్కిపడిన రాజేంద్రనగర్
ఆర్కే సోదరుల ఇళ్లలో విషాద ఛాయలు రాజేంద్రనగర్: ఎన్కౌంటర్లో అక్కిరాజు రామకృష్ణ (ఆర్కే) కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందాడన్న వార్తతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆర్కే సోదరుల ఇళ్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తొలుత మృతుల్లో ఆర్కే కూడా ఉన్నాడని తెలియడంతో రాజేంద్రనగర్‌లో అలజడి నెలకొంది. 1979-80 మధ్యలో రాజేంద్రనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేసిన ఆర్కే.. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేవారు. ఆర్కే తండ్రి సచితానందరావు రాజేంద్రనగర్ వాసులకు హెడ్మాస్టర్గా పరిచయం. ఉద్యమంలోకి వెళ్లిన తరువాత ఆర్కే రాజేంద్రనగర్‌కు రాలేదు. ఆర్కేకు నలుగురు సోదరులు, అక్క ఉన్నారు. ఇద్దరు సోదరులు అక్కిరాజు రాధేశ్యాం, సుబ్బారావు, అక్క.. కుటుంబ సభ్యులతో ఇక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు విదేశాల్లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు మృతిచెందారు. ఎప్పుడూ కలవలేదు.. పృథ్వీ అలియాస్ మున్నా విద్యాభ్యాసం ఒంగోలు, వైజాగ్, హైదరాబాద్, బెంగళూర్‌లో జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను ఎప్పుడూ కలవలేదని, ప్రభుత్వంతో చర్చల సమయంలో హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిశామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన పృథ్వీ ఉన్నత విద్య కోసం బెంగళూర్‌కు వెళ్లినట్లు తెలిసిందన్నారు. గతంలో ఆర్కే భార్య శిరీష, కుమారుడు పృథ్వీ ఉప్పల్ ప్రాంతంలో ఉండేవారని, ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నట్టు తెలిసిందన్నారు. పృథ్వీ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు వార్తల ద్వారా తెలిసిందేగాని తమకు సమాచారం లేదన్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. రాజేంద్రనగర్ సర్కిల్ సహా మండల పరిధిలో ఎక్కడ చూసిన ఎన్‌కౌంటర్‌పై చర్చ జరుగుతోంది. ఆర్కేకు రాజేంద్రనగర్‌తో సంబంధాలు ఉండడం, అతని కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండడంతో ఈ విషయమై చర్చించుకుంటున్నారు.