ఆర్‌కే సోదరుల ఇళ్లలో విషాద ఛాయలు
రాజేంద్రనగర్: ఎన్‌కౌంటర్‌లో అక్కిరాజు రామకృష్ణ (ఆర్‌కే) కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతి చెందాడన్న వార్తతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆర్‌కే సోదరుల ఇళ్లలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తొలుత మృతుల్లో ఆర్‌కే కూడా ఉన్నాడని తెలియడంతో రాజేంద్రనగర్‌లో అలజడి నెలకొంది. 1979-80 మధ్యలో రాజేంద్రనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేసిన ఆర్‌కే.. సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ట్యూషన్‌లు చెప్పేవారు. ఆర్‌కే తండ్రి సచితానందరావు రాజేంద్రనగర్ వాసులకు హెడ్‌మాస్టర్‌గా పరిచయం. ఉద్యమంలోకి వెళ్లిన తరువాత ఆర్‌కే రాజేంద్రనగర్‌కు రాలేదు. ఆర్‌కేకు నలుగురు సోదరులు, అక్క ఉన్నారు. ఇద్దరు సోదరులు అక్కిరాజు రాధేశ్యాం, సుబ్బారావు, అక్క.. కుటుంబ సభ్యులతో ఇక్కడే ఉంటున్నారు. మరో ఇద్దరు విదేశాల్లో నివసిస్తున్నారు. తల్లిదండ్రులు మృతిచెందారు.
ఎప్పుడూ కలవలేదు..
పృథ్వీ అలియాస్ మున్నా విద్యాభ్యాసం ఒంగోలు, వైజాగ్, హైదరాబాద్, బెంగళూర్‌లో జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను ఎప్పుడూ కలవలేదని, ప్రభుత్వంతో చర్చల సమయంలో హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిశామని పేర్కొన్నారు. బీటెక్ చదివిన పృథ్వీ ఉన్నత విద్య కోసం బెంగళూర్‌కు వెళ్లినట్లు తెలిసిందన్నారు. గతంలో ఆర్‌కే భార్య శిరీష, కుమారుడు పృథ్వీ ఉప్పల్ ప్రాంతంలో ఉండేవారని, ప్రస్తుతం ఒంగోలులో ఉంటున్నట్టు తెలిసిందన్నారు. పృథ్వీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వార్తల ద్వారా తెలిసిందేగాని తమకు సమాచారం లేదన్నారు.
ఎక్కడ చూసినా ఇదే చర్చ..
రాజేంద్రనగర్ సర్కిల్ సహా మండల పరిధిలో ఎక్కడ చూసిన ఎన్‌కౌంటర్‌పై చర్చ జరుగుతోంది. ఆర్‌కేకు రాజేంద్రనగర్‌తో సంబంధాలు ఉండడం, అతని కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండడంతో ఈ విషయమై చర్చించుకుంటున్నారు.
ఉలిక్కిపడిన రాజేంద్రనగర్
Published Tue, Oct 25 2016 3:24 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement