అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ఆర్కే సతీమణి శిరీష, విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు తదితరులు
టంగుటూరు/ఒంగోలు సబర్బన్: ‘భర్తను, కుమారుడిని ఒకేసారి స్మరించుకోవాల్సి వస్తుందనుకోలేదు..’ అంటూ ఆర్కే సతీమణి అక్కిరాజు శిరీష తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘తొలుత పృథ్వీ ఐదో వర్ధంతి సభ పెట్టాలనుకున్నాం.. కానీ అంతలోనే ఆర్కేని కూడా స్మరించుకోవాల్సి వచ్చింది’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆదివారం అక్కిరాజు పృథ్వీ అలియాస్ మున్నా ఐదో వర్ధంతి సభ, ఆర్కే సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి శిరీష అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు.
తన బిడ్డ 2016 అక్టోబర్ 24న అమరుడయ్యాడంటూ గుర్తు చేసుకున్నారు. అమరుల ఆశయాలను కొనసాగిస్తామని ఆమె నినందించారు. విప్లవ రచయితల సంఘం నేత పాణి మాట్లాడుతూ 54 ఏళ్ల భారత విప్లవోద్యమ చరిత్రలో ఆర్కే 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఎంతో గొప్పదంటూ కొనియాడారు. 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఆర్కే చొరవ మరువలేనిదన్నారు.
ఆర్కే తమ్ముడు అక్కిరాజు సుబ్బారావు మాట్లాడుతూ పల్నాడులోని తుమ్మురుకోట గ్రామం నుంచి 1982లో ప్రజల కోసం తన అన్న ఉద్యమంలోకి వెళ్లాడని, అనంతరం ప్రభుత్వంతో జరిపిన చర్చల సమయంలోనే తాను అన్నను చూసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో ఏర్పాటు చేసిన పృథ్వీ అమర స్థూపం వద్ద ఆర్కేకి, గ్రామానికి చెందిన మరో మావోయిస్టు జయకుమార్‌కు కూడా నివాళులర్పించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో విప్లవ రచయితల సంఘం నేత కళ్యాణరావు, పౌర హక్కుల సంఘం నేత చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment