బాల్యానికి సంకెళ్లు
పొద్దు పోయే వేళకు సీతాకోక చిలుకల్లా రివ్వున వీధిలో దూసుకుపోతూ వెళ్లే చిన్నారులు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? రాత్రి పూట చందమామను, నక్షత్రాలను అంతులేని ఆశ్చర్యంతో చూసే బాలలు ఎక్కడున్నారు? ఇంటిలోని పూజలు, పండుగల సమయంలో అమ్మానాన్నల వెంటే ఉంటూ వారికి సాయం చేసే కుర్రాళ్లు అరుదైపోయారు కదా..! హోం వర్కులు, క్లాస్‌వర్కులు, ట్యూషన్లు, కోచింగ్‌లు, క్రికెట్, టీవీ, సినిమాలు, మొబైల్ ఫోన్ల మధ్య అందమైన బాల్యం కనుమరుగైపోతోంది.
రాయలేనంత హోం వర్కులు చేయమంటూ, మోయలేనన్ని పుస్తకాలను మోయండంటూ బాల్యాన్ని ఇంటివారే చిదిమేస్తున్నారని చాలా మంది నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం అంతమైపోతున్నా పట్టించుకోకుండా ఫోన్‌లో గేములాడే యువత.. అలా మారడానికి కారణం తల్లిదండ్రులు, విద్యా సంస్థలేనని వారి నిశ్చిత అభిప్రాయం. అందమైన బాల్యాన్ని ప్రైవేటు విద్యాసంస్థకు తాకట్టు పెట్టి, చదువు పేరుతో మెదడు నిండా ఒత్తిడి నింపుతున్న వైనంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- పాలకొండ
పాలకొండకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని పదో తరగతి పరీక్షలు పూర్తి కాగానే విశాఖలోని ఫలితాలు కూడా రాకుండా ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించడానికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లిన నెల రోజుల్లో ఆ కుర్రాడు రెండు సార్లు చనిపోవడానికి ప్రయత్నించాడు. అప్పటికి ఇంకా పది ఫలితాలు విడుదల కాకపోవడం విశేషం. నేటి తరం విద్యార్థులు ఎంతగా ఒత్తిడికి గురవుతున్నారో చె ప్పడానికి ఈ ఉదాహరణ చాలదా.
తల్లిదండ్రుల కోణంలో వారు చేస్తున్నది మంచిగానే తోస్తున్నా... విద్యార్థుల కోణంలో మాత్రం అది భరించలేనంత బాధ. ఏటా జిల్లాలో పెరుగుతున్న యువకుల ఆత్మహత్యలే ఈ బాధకు ఉదాహరణలు. రెండేళ్లుగా అయితే ఈ సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశం. ఓ అధికారిక నమోదు వివరాల ప్రకారం గత విద్యా సంవత్సరంలో 53 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే అందరూ కార్పొరేట్ కాలేజీ వారే కావడం విశేషం.
సర్కారు బడైతే అవమానమా..?
‘పిల్లాడిని పెద్ద స్కూలులో చదివించాలి. ఫీజు ఎంతైనా ప ర్లేదు. అందరూ గొప్పగా మాట్లాడాలి...’ చాలా మంది తల్లిదండ్రుల తీరు ఇలాగే ఉంది. బడాయికి పోయి పిల్లాడిని ఏదో ఒక ప్రైవేటు స్కూలు యాజమాన్యానికి అప్పగిస్తున్నారు. ఆ బడి బాధలు తట్టుకోలేక పిల్లలు నరకం చూస్తున్నారు. స్కూలు చదువుతున్న పిల్లల నోటి వెంట కూడా ఆత్మహత్య వంటి పదాలు వినిపిస్తున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాబి రామ్ మాటల్లో చెప్పాలంటే... తల్లిదండ్రులు తాము పనిలో ఉండి పిల్లల్ని ఆశ్రద్ధ చేస్తున్నామేమో అనుకుంటూ చదువు చదువు ఉంటూ అధిక ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలకు టెన్షన్ కలిగిస్తున్నారు. కొంచెం చదువుకున్న తల్లిదండ్రులైతే అది మరీ ఎక్కువగా ఉంటోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన సర్వేలు పరిశీలిస్తే మంచి ర్యాంకులు సాధించిన పిల్లల తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడం గమనార్హం.
కూలీలు నయం కదా..
ఒకప్పుడు బాల్యం అంటే అదో మధుర జ్ఞాపకం. ఇప్పుడు బాల్యం ఒత్తిడితో సతమతమవుతోంది. ఉదయం 7 గం టలకు మోయలేనంత బ్యాగ్‌ను వీపు మీద వేసుకుని రాత్రి 8 గంటలకు ఇంటికి చేరడం నిత్యకృత్యమైంది. పిల్లలకు రెండేళ్లు దాటిన మరుక్షణమే బల వంతంగానైనా పాఠశాలలో చేర్పించటం అలవాటుగా మారింది.
ఇది మొదలు జీవితంలో స్థిరపడినంత వరకు తీవ్రమైన ఒత్తిడిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ధోరణే విపత్కర పరిణామాలకు దారి తీస్తోంది. నాలుగైదేళ్ల కిందటి వరకు మార్కుల పేరుతో ఒత్తిడికి గురి చేసే వారు. ఇప్పుడు గ్రేడింగ్‌లు వచ్చినా తల్లిదండ్రుల తీరు మాత్రం మారడం లేదు.
డిప్రెషన్‌లో కనిపిస్తున్నారు...
ప్రస్తుతం పిల్లలు అనారోగ్యంతో వస్తున్నారు. వీరిని పరి శీలిస్తే డిప్రెషన్‌లో ఉన్నట్టు ఇ ట్టే అర్థమవుతుంది. దీనికి కార ణం ఒత్తిడే. చదువులో ముం దంజలో ఉండడం కోసం విపరీతమైన ఒత్తిడిని పిల్లలపై తీసుకొస్తున్నారు. వంద మంది పిల్లలను పరిశీలిస్తే 80 శాతం పిల్లలు డిప్రెషన్‌లో కనిపిస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే అనర్థాలకు దారితీస్తుంది. చదువును మార్కులతో జత చేయకుండా విజ్ఞానం కోసం ఉపయోగించేలా మార్చాల్సి ఉంది.
- జె.రవీంద్ర కుమార్, చిన్న పిల్లల వైద్య నిపుణులు
తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఒత్తిడి..
విద్యా సంస్థల్లో పిల్లలను చే ర్పించిన తల్లిదండ్రులు మా ర్కులు కోసం తీవ్రంగా ఒత్తి డి తీసుకొస్తున్నారు. పిల్లల కంటే ముందు వారి మా ర్కులను తెలుసుకొనేది తల్లిదండ్రులే. తమ పిల్లాడికి పక్క అబ్బాయి కంటే ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయని నిల దీస్తున్నారు. మార్కులు ఎప్పటికప్పుడు తెలియజేయకపోతే ఇతర పాఠశాలలకు మార్చేస్తున్నారు. దీంతో పిల్లలపై సహజంగా ఒత్తిడి పెంచాల్సి వస్తుంది.
- టి.జగన్నాధంనాయుడు, కరస్పాండెంట్, నవోదయ ప్రైవేట్ పాఠశాల
అధిక సిలబస్‌తోనే...
సాధారణంగా విద్యాసంవత్సరానికి విద్యార్థులు స్థాయికి సరిపోయిన స్థాయిలో ప్రభుత్వం సిలబస్‌ను త యారు చేస్తుంది. ఇది చాలదని విద్యా సంస్థల్లో అదనపు సిలబస్‌ను రుద్దుతున్నారు. అలా అదనపు సిలబస్ ఉన్న పాఠశాలలకే తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లాడి జ్ఞాపిక శక్తి కంటే అదనపు సమాచారాన్ని వారికిస్తున్నారు. దీంతో పిల్లలు తీ వ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అదనపు సిలబస్ బోధనను నిరోధించాలి.
- ఐ.వెంకటరావు, ఉపవిద్యాశాఖాధికారి.