బ్యాగు మోతకు కోత! | Reduce to the School Students Bag weight | Sakshi
Sakshi News home page

బ్యాగు మోతకు కోత!

Published Fri, Jun 14 2019 3:16 AM | Last Updated on Fri, Jun 14 2019 5:16 AM

Reduce to the School Students Bag weight - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగు బరువు తగ్గింపుపై విద్యా శాఖ ఆలోచనలు మొదలు పెట్టింది. గతంలోనే బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. గతంలోనే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థుల బ్యాగు బరువుపై అధ్యయనం చేసిన విద్యా శాఖ బ్యాగు బరువు కారణంగా విద్యార్థులు అనారోగ్యం పాలు అవుతున్నారని గుర్తించింది. వారు మోస్తున్న బ్యాగు బరువు అంచనా వేసి, తరగతులవారీగా ఎన్ని పాఠ్య పుస్తకాలు ఉండాలి.. ఎన్నినోటు పుస్తకాలు ఉండాలి.. బ్యాగు బరువెంత ఉండాలన్న అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీంతో ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వాటి అమలు పక్కాగా జరగలేదు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మళ్లీ బ్యాగు బరువు తగ్గించే అంశం తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో బ్యాగు బరువు తగ్గింపుపై పాఠశాల విద్య కమిషనర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. పాఠశాలల యాజమాన్యాలకు నచ్చజెప్పే ధోరణితో ముందుకు సాగాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందులో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం కావాలని భావిస్తున్నారు. వీలైతే అంతకంటే ముందే విద్యా శాఖ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేసి పలు స్కూళ్లలో ఉన్న ఏర్పాట్లు, బ్యాగు బరువుపై మరోసారి పరిశీలన జరపాలని యోచిస్తున్నారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ఒక్కొక్కటిగా నిబంధనలు అమల్లోకి తేనున్నారు. విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని సూచించనున్నారు. తద్వారా విద్యార్థులపై బ్యాగు బరువు సగం వరకు తగ్గించొచ్చని విద్యా శాఖ భావిస్తోంది. 

స్టేట్‌ సిలబస్‌ అమలుపైనా దృష్టి 
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో స్టేట్‌ సిలబస్‌ పుస్తకాలే వినియోగించేలా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖ సిద్ధం అవుతోంది. విద్యా శాఖ నిర్దేశిత సిలబస్‌ ఉన్న సేల్‌ పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండట్లేదని, అందుకే తాము ప్రైవేటు సిలబస్‌ పుస్తకాలను వినియోగిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖకు తెలియజేశాయి. దీంతో ముందుగా మార్కెట్‌లో విక్రయించే పాఠ్య పుస్తకాల ముద్రణను పక్కాగా చేపట్టేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ప్రైవేటు పబ్లిషర్లు నిర్ణీత పాఠ్య పుస్తకాల ముద్రణ కోసం అనుమతి తీసుకొని, వాటికి విద్యా శాఖకు రాయల్టీ చెల్లిస్తున్నా, నిర్ణీత పుస్తకాలు ముద్రించడం లేదన్న ఫిర్యాదులు అందాయి.

ఈ నేపథ్యంలో ప్రైవేటు సేల్‌ పుస్తకాల ముద్రణను పక్కాగా చేసేలా, ఆయా పుస్తకాలకు సీరియల్‌ నంబర్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని భావిస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్కెట్‌లో అందుబాటులో ఉంచి పాఠశాలలు వాటిని అమలు చేసేలా చూసేందుకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పాఠశాల విద్య కమిషనర్‌ విజయ్‌కుమార్‌ గుర్తింపు పొందిన ప్రైవేటు యాజమాన్య సంఘంతో (ట్రస్మా) చర్చించారు. వారు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5వ తరగతి వరకు కచ్చితంగా పాఠశాల విద్యా శాఖ నిర్దేశిత పుస్తకాలనే వినియోగిస్తామని రాత పూర్వకంగా హామీ ఇచ్చారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో అదే విధానం కొనసాగించడం ద్వారా ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను వినియోగం తగ్గించి, విద్యా ర్థుల బ్యాగు బరువును నియంత్రించొచ్చని భావిస్తోంది.  

ఆర్థిక భారం లేని చర్యలపై దృష్టి
బ్యాగు బరువు తగ్గింపులో భాగంగా ముం దుగా ఆర్థిక భారం లేని అంశాలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది పాఠశాలల్లో ఏ రోజు ఏ పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు తీసుకురావాలో ముందే చెప్పడం, బ్యాగు బరువును సమానంగా పంచేలా వెడల్పాటి పట్టీలు కలిగిన బ్యాగులను ఎంపిక చేసుకునేలా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించడం వంటి చర్యలు చేపట్టే ఆలోచనలు చేస్తోంది. పుస్తకాలను పాఠశాలల్లోనే ఉంచేలా ర్యాక్‌లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై పాఠశాలల యాజమాన్యాలను ఒప్పించాలని భావిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement