మెరిసిన మాణిక్యాలు | CM Jagan Jagananna Animuthyalu Awards Ceremony At Vijayawada | Sakshi
Sakshi News home page

మెరిసిన మాణిక్యాలు

Published Wed, Jun 21 2023 4:14 AM | Last Updated on Wed, Jun 21 2023 4:14 AM

CM Jagan Jagananna Animuthyalu Awards Ceremony At Vijayawada - Sakshi

పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన శిరీషకు అవార్డు ప్రదానం చేస్తున్న సీఎం జగన్‌ 

ఈరోజు నా కళ్ల ముందు మెరిసే నక్షత్రాలు, రాష్ట్ర భవిష్యత్తు కనిపిస్తున్నాయి. ప్రతి విద్యార్థి ముఖంలో కాంతి, ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. పాఠశాల స్థాయిలో విజయం వైపు పడిన ఈ అడుగులు అత్యున్నత శిఖరాన్ని చేరుకోవాలి. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు మహా వృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలను అందించాలి.    
– సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: మట్టిలోనే మాణిక్యాలు వికసిస్తాయని, మన పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి గడించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. కార్పొరేట్‌ స్కూళ్లు సైతం ఈర్ష్య పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన మార్కులను చూస్తుంటే ముచ్చటేస్తోందని, ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక  పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్‌ కూడా తెస్తామని, అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలను కూడా మారుస్తామని తెలిపారు.

ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యా సంస్థల్లో చదువుతూ ఆయా విద్యాసంస్థల్లో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచిన 42 మంది టెన్త్‌ విద్యార్థులు, ఇంటర్‌లో గ్రూపుల వారీగా టాపర్లు 26 మందిని ‘జగనన్న ఆణిముత్యాలు– స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డ్స్‌–2023’తో ఘనంగా సత్కరించారు. మంగళవారం విజయవాడలో జరి­గిన ఈ వేడుకకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను సత్కరించారు. ఉన్నత విద్యలో ఐదు కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 20 మంది విద్యార్థు­లను కూడా ‘స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు’తో సత్కరించారు. అనంతరం సీఎం జగన్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 

నాలుగేళ్లలోనే సదుపాయాలన్నీ..
సర్కారు బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రం మొత్తమ్మీద నాలుగు స్థాయిల్లో టెన్త్, ఇంటర్‌లో టాప్‌ ర్యాంకుల్లో నిలిచిన 22,768 మంది విద్యార్థులను సత్కరిస్తున్నాం. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. టాప్‌ ర్యాంకులు సాధించిన మీరే కాకుండా ఇతర విద్యార్థులకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. మిమ్మల్నందరినీ చూస్తుంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలనే కోరిక పెరుగుతోంది. సంకల్పం గట్టిదైతే ఫలితం అదే వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలు మారిపోయాయి.

రుచికరమైన మెనూ, పౌష్టికాహారంతో జగనన్న గోరుముద్ద అందిస్తున్నాం. పాఠశాలలు తెరవగానే జగనన్న విద్యా కానుక అందిస్తున్నాం. గవర్నమెంట్‌ స్కూళ్లు నాలుగేళ్లలోనే ఇంగ్లీష్‌ మీడియంకు మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చింది. పాఠ్య పుస్తకాల సిలబస్‌ మారింది. బైలింగ్యువల్‌ టెక్ట్స్‌బుక్స్‌ సమకూర్చాం.

బైజూస్‌ కంటెంట్‌ అందుబాటులోకి తెచ్చాం. ఆరో తరగతి నుంచి ఐపీఎఫ్‌ ప్యానెళ్ల ద్వారా డిజిటల్‌ బోధన అందిస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు కంటెంట్‌ లోడెడ్‌ ట్యాబ్‌లను ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. గతంలో క్లాస్‌ టీచర్లే సరిగా లేని దుస్థితి నుంచి సబ్జెక్ట్‌ టీచర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలన్నీ సమకూరాయి. 
అవార్డు గ్రహీతలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేరుగు నాగార్జున 

సాధ్యమేనా? అనే పరిస్థితి నుంచి..
మన పేదింటి పిల్లలందరూ అంతర్జాతీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మూడో తరగతి నుంచి విద్యార్థులను టోఫెల్‌ పరీక్షకు సిద్ధం చేసి అంతర్జాతీయ సర్టిఫికెట్‌ అందచేసే గొప్ప అడుగు ఈ సంవత్సరం పడుతోంది. ప్రభుత్వ స్కూళ్ల పిల్లలను ఇంగ్లీష్‌ వినడం, మాట్లాడటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నాం. ఇలాంటి మార్పులు గవర్నమెంట్‌ బడుల్లో రాగలవా? సాధ్యమయ్యే పనేనా..? అనే పరిస్థితి నుంచి ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడక తప్పదనే పరిస్థితి తీసుకొచ్చాం. ప్రతి అక్కచెల్లెమ్మకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా పిల్లలందరికీ మంచి చదువులు అందాలని మనసారా కోరుకుంటున్నా.

ఫీజు ఎంతైనా ప్రభుత్వమే భరిస్తుంది
ప్రతి విద్యార్థీ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఏ పిల్లాడి తల్లిదండ్రీ అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ లాంటి కోర్సులన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో కూడా టాప్‌ 50 యూనివర్సిటీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో సీటు తెచ్చుకోండి. మీకు మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఫీజు రూ.1.25 కోట్లైనా మీరు భయపడాల్సిన పనిలేదు. 

పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి
మన పిల్లలందరూ ప్రతి రంగంలోనూ ఎదగాలి, మన కీర్తి ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఆవిష్కరణలు, వినూత్న విధానాలను మన పిల్లలు అనుసరిస్తూ ప్రతి రంగంలోనూ ప్రపంచ లీడర్లుగా ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే నాణ్యమైన విద్య అందించాలి. ఈ నాలుగేళ్లల్లో విద్యపై మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ తీసుకుని ఉండరు.

రానున్న రోజుల్లో మన ప్రభుత్వ స్కూళ్లలో ఐబీ (ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌) సిలబస్‌ కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా మన పరీక్ష పత్రాలు కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్‌ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి త్వరలోనే వస్తుంది. అది మనమంతా చూస్తాం. నాయకత్వ లక్షణా­లను పెంచే విధంగా మన చదువులున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషీన్‌ లెర్నింగ్, చాట్‌ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ ఎదగాలి. ఆ స్థాయిలో మన విద్యారంగం మారబోతోంది. ఆ మేరకు మార్పులు చేస్తాం.  

విద్యార్థులతో కలసి ఉత్సాహంగా
విద్యార్థుల సత్కార వేడుకలో ముఖ్యమంత్రి జగన్‌ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పురస్కారాల ప్రదానం సందర్భంగా ప్రతి విద్యార్థి, టీచర్‌ను పేరు అడిగి మరీ అభినందించారు. పురస్కార గ్రహీతల్లో బాలికలు ఎక్కువ మంది ఉండడంపై సీఎం ఆనందం వ్యక్తం చేశారు. బాలికా విద్యను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. 

కష్టాలు చెప్పుకున్న విద్యార్థులకు అభయం
అవార్డుల ప్రదానం సందర్భంగా కొందరు విద్యార్థులు తమ కష్టాలను తెలియచేయడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్‌ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. 

► తిరుపతికి చెందిన కందాటి కుసుమ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బయోటెక్‌లో పీహెచ్‌డీ చేస్తున్నారు. ‘బెస్ట్‌ స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్న ఆమె తల్లి లంగ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సీఎం జగన్‌ దృష్టికి తేవడంతో వైద్యం తీసుకుంటున్నారా? అని ఆరా తీశారు. వివరాలు సేకరించి అవసరమైన సాయం అందించాలని అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్యను సీఎం ఆదేశించారు. 

► అనకాపల్లి జిల్లా నాతవరం గ్రామానికి చెందిన చిన్ని పావని నక్కపల్లి కేజీబీవీలో బైపీసీ చదివి 976 మార్కులు సాధించింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె బాగోగులను విశాఖలోని ఓ ట్రస్ట్‌ చేపట్టింది. తనకు డాక్టర్‌ కావాలని ఉందని, స్తోమత లేదని పావని పేర్కొనడంతో వెంటనే స్పందించిన సీఎం జగన్‌ నీట్‌ శిక్షణకు అవసరమైన సాయం అందించాలని విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ను ఆదేశించారు. మరికొందరు విద్యార్థులు కూడా తమ సమస్యలను సీఎం దృష్టికి తేవడంతో వారందరికీ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.  

టాపర్లకు నగదు బహుమతులు
మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు
రెండో బహుమతిగా రూ.75 వేలు, మూడో బహుమతి రూ.50 వేలు

ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య విద్యాసంస్థల్లో టెన్త్, ఇంటర్‌ చదివి రాష్ట్ర స్థాయిలో ఆయా విద్యాసంస్థల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సీఎం జగన్‌ చేతుల మీదుగా నగదు పుర స్కారాలను ప్రదానం చేశారు. పదో తరగతిలో మొదటి మూడు స్థానాల్లో 42 మంది విద్యార్థులు టాపర్లుగా నిలవగా 11 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం, 15 మంది తృతీయ స్థానం సాధించారు. ఇంటర్‌లో గ్రూప్‌నకు ఒక్క రు చొప్పున 26 మంది విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. తొలి స్థానంలో నిలిచినవారికి రూ.లక్ష నగదు, రెండో స్థానం సాధించినవారికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.50 వేల నగదు చొప్పున బహుమతి అందజేశారు. 

ఉన్నత విద్యలో 20 మందికి పురస్కారం 
ఉన్నత విద్యలో వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన 20 మంది విద్యార్థులకు స్టేట్‌ ఎక్స్‌లెన్స్‌ అ వార్డులను ప్రదానం చేశారు. కమ్యూనిటీ స ర్వీసెస్, ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన వి ద్యార్థి, స్టూడెంట్‌ ఇన్నొవేషన్‌ విభాగాలతో పాటు క్విజ్‌ చాంపియన్‌షిప్‌లో గెలుపొందిన తొలి మూడు జట్లకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించారు. ప్రతి విభాగంలో మొదటి స్థానానికి రూ.లక్ష, రెండో స్థానానికి రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు చొప్పున నగదు అందజేశారు. ఉత్తమ విద్యార్థి, ప్రతిభావంతుడైన విద్యార్థి కేటగిరీల్లో కన్సొలేషన్‌ బహుమతి కింద రూ.10 వేలు ప్రదానం చేశారు. టెన్త్‌ , ఇంటర్, ఉన్నత విద్యలో మొత్తం 88 మంది టాపర్లుగా నిలిచారు. విద్యార్థులందరినీ ప్రశంసాపత్రం, జ్ఞాపికతో సత్కరించారు. 

స్ఫూర్తిదాయకం.. ఆరోగ్యకరమైన పోటీ
సీఎం చేతుల మీదుగా పురస్కారాలు అందించడం మరింత మంది విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆరోగ్యకరమైన పోటీత­త్వాన్ని పెంపొందిస్తున్నాం. అలాంటి విద్యార్థు­లను తయారు చేసిన అధ్యాపకులకు అభినందనలు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్యా రంగానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. అందరూ గర్వపడేలా అవకాశాలు కల్పిస్తున్నాం. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఉన్నత విద్య అభ్యసించేలా సీఎం జగన్‌ తోడుగా నిలిచి ప్రోత్సహిస్తున్నారు. డిజిటల్‌ విద్యలో మన విద్యార్థులు రాణించేలా చర్యలు చేపట్టారు.    
– బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement