బ్యాగు బరువు తగ్గేదెలా?
బ్యాగు బరువు తగ్గేదెలా?
Published Thu, Jul 27 2017 2:57 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM
నిబంధనలు పాటించని స్కూళ్లపై ఏం చర్యలు తీసుకుంటారు?
- కార్యాచరణ లేకుండానే ప్రభుత్వ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులపై స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు ఇటీవల మార్గదర్శకాలు (జీవో 22) జారీ చేసిన ప్రభుత్వం.. వాటిని పక్కాగా అమలు చేసేందుకు కార్యాచరణ మాత్రం ప్రకటించలేదు. దీంతో బ్యాగు బరువు తగ్గింపు అమలుకు నోచుకునే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం పాఠశాల విద్యాశాఖ అయినా ఆ మార్గదర్శకాల అమలుకు పక్కాగా చర్యలు చేపట్టలేదు. బ్యాగు బరువు తగ్గించేందుకు చర్యలు చేపట్టని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపడతారన్న అంశంలో స్పష్టమైన విధానం ప్రకటించలేదు. పిల్లల బ్యాగు బరువు తగ్గించేందుకు యాజమాన్యాలు చర్యలు చేపట్టాయా.. లేదా అన్న అంశాన్ని పరిశీలించేందుకు జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు తనిఖీలు చేయాలంటూ విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు ఇచ్చి వదిలేసింది. బ్యాగు బరువును తగ్గించే ఏర్పాట్లు చేయని పాఠశాలలపై ఎలాంటి చర్యలు చేపట్టాలో స్పష్టం చేయకపోవడంతో యాజమాన్యాలు పెద్దగా దృష్టి పెట్టడం లేదు.
మంత్రిదో మాట.. అధికారులదో బాట..
ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా పాఠ్య పుస్తకాలను వినియోగిస్తున్నాయి. తమకు నచ్చిన పబ్లిషర్ పుస్తకాలను అమలు చేస్తున్నాయి. వాటికి తోడు పదుల సంఖ్యలో నోటు పుస్తకాలతో విద్యార్థులకు మోత తప్పడం లేదు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) నిర్దేశిత పుస్తకాలను ఏమాత్రం అమలు చేయడం లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా.. మీ ఇష్టం ఉన్న పుస్తకాలను వినియోగించుకోం డని, ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశించిన పుస్తకాలనే వినియోగించాల్సిన అవసరమే లేదని హామీ ఇచ్చినట్లు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు చెబుతున్నాయి. అంతేకాదు గతేడాది ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన విద్యాశాఖ.. ఈసారి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అయితే స్కూల్ బ్యాగు బరువు తగ్గించేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో మాత్రం కచ్చితంగా ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశిత పుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేసింది.
ఏ తరగతికి ఎంత బరువు?
ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 5 నుంచి 7 కిలోలు ఉంటోంది. రెండో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 9 కిలోలు, 5వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలు, 7వ తరగతి విద్యార్థి బ్యాగు బరువు 12 కిలోలు ఉంటుండగా, పదో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 17 కిలోల వరకు ఉంటోందని విద్యాశాఖ తనిఖీల్లో వెల్లడైంది. ఫలితంగా విద్యార్థుల వెన్ను వంగిపోతోందని, శారీరక ఎదుగల దెబ్బతింటోందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే ఎస్‌సీఈఆర్‌టీ నిర్దేశిత పుస్తకాలను వాడాలని, పైగా బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోల బరువే ఉండాలని, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతుల బరువు 4 కిలోలకు మించకూడదని, 8, 9, 10 తరగతులకు 4.5 నుంచి 5 కిలోల లోపే ఉండాలని స్పష్టం చేసింది. అయితే వీటిని పాటించని స్కూళ్లపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? కేసులు నమోదు చేయాలా? పాఠశాల గుర్తింపు రద్దు చేయాలా? వంటి అంశాలేవీ ఆ ఉత్తర్వుల్లో లేకపోవడంతో అవి బుట్టదాఖలు అయ్యే పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement