- ఫీజులపై మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి
- పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు, ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ బుధవారం షెడ్యూలు జారీ చేశారు. 2016-17 విద్యా సంవత్సరంలో భాగంగా వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 13 నుంచి స్కూళ్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలు ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టంచేశారు. 21వ తేదీన పాఠశాలల్లో సీట్లు పొందిన వారి వివరాలను ప్రకటించాలని, 22వ తేదీ నుంచి తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యా సంవత్సరంలో జూన్ 13 నుంచి ఆగస్టు 31వరకు ప్రవేశాలు చేపట్టవచ్చని, పాఠశాలల ప్రారంభం నుంచి 3 నెలల్లోగా ప్రవేశాలను ముగించాలన్నారు. ఇక ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల స్కూళ్లలో విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకువచ్చిన రోజే ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. కాగా ఈ నెల 3 నుంచి 12 వరకు నిర్వహించే బడిబాట తర్వాతే హేతుబద్ధీకరణపై దృష్టి సారించాలని విద్యా శాఖ నిర్ణయించింది.
గవర్నింగ్ బాడీ ఉండేలా చర్యలు
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచి వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తెలిపారు. ఫీజుల విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, అందుకు అనుగుణంగానే ఫీజులను నిర్ణయించాలని సూచించారు. డీఈవోలు, ఆర్జేడీలు ప్రైవేటు పాఠశాలలపై నిఘా పెట్టాలని, నిబంధనలు అమలయ్యేలా చూడాలన్నారు.
► తల్లిదండ్రులు సభ్యులుగా ప్రతి స్కూల్‌కు గవర్నింగ్ బాడీ ఉండాలి. గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 13లోగా ఫీజులను నిర్ణయించాలి. ఆ కాపీని డీఈవోకు అందజేయాలి.
► పాఠశాలలు వివిధ రకాల పేర్లతో ఫీజులను వసూలు చేయవద్దు. దరఖాస్తు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, కాషన్ డిపాజిట్ రూ. 5 వేలకు మించడానికి వీల్లేదు.
► జూన్ 13న పాఠశాల నోటీసు బోర్డులో ఫీజుల వివరాలు, యూజర్ చార్జీల వివరాలను ప్రదర్శించాలి. పాఠశాలల ఫీజుల వివరాలతో పాటు పాఠశాలల వివరాలను యాజమాన్యాలు స్కూల్ ఇన్‌ఫర్మేషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
► ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్రా వంటి పేర్లను స్కూళ్లకు పెట్టరాదు. వీటితోపాటు ప్రవేశాల షెడ్యూలును అమలు చేయని స్కూళ్లపై చర్యలు చేపడతారు. ఈ నెల 22లోగా తమ పరిధిలోని పాఠశాలల్లో ప్రవేశాల వివరాలను డిప్యూటీడీఈవోలు, ఎంఈవోలు డీఈలోలకు అందజేయాలి.
పాఠశాలల్లో ప్రవేశాలకు షెడ్యూలు జారీ
Published Thu, Jun 2 2016 3:50 AM | Last Updated on Sat, Sep 15 2018 4:26 PM
Advertisement
Advertisement