అనుమతి లేకుండా స్కూలు నడిపితే జైలుకే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు స్కూళ్లు నడిపినా.. ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్, ప్లేస్కూల్ తరగతులను నిర్వహించినా ఆయా పాఠశాలలను సీజ్ చేస్తామని విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. దీనిని అతిక్రమిస్తే యాజమాన్యాలకు 6 నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. అనుమతి లేకుండా విద్యా సంస్థలు తరగతులను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం సెక్షన్ 18 ప్రకారం జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని పేర్కొంది. ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలకు జారీ చేసిన నోటీసుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనుమతి కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన గడువు ఆదివారంతో ముగియనుంది. వారం రోజుల్లో విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ప్రైవేటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖ మధ్య వివాదం మరింతగా ముదురుతోంది.
స్పందన నామమాత్రమే..
ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కిండర్ గార్టెన్, ప్లేస్కూల్ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని విద్యాశాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా.. యాజమాన్యాల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14,500 ప్రైవేటు పాఠశాలలుండగా.. అందులో ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్నది 263 స్కూళ్లే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 121 పాఠశాలలు నమోదు చేసుకోగా... విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొంతజిల్లా వరంగల్ నుంచి ఒక్క పాఠశాల కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరి చేయొద్దని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతుండగా... విద్యాహక్కు చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరని సర్కారు పట్టుదలగా ఉంది. దీంతో అనుమతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు నిర్ణయించాయి.
చట్టాన్ని గౌరవించాల్సిందే..
‘‘విద్యాహక్కు చట్టంలోని అంశాలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు గౌరవించాల్సిందే. అనుమతి లేకుండా ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. నిబంధనల అమలుకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించాలి. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని అనుమతులు పొందిన పాఠశాలలు పాత అనుమతి పత్రాలతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. జీవో 91 ప్రకారం ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కరిక్యులం సిద్ధంగా ఉంది..’’
- కిషన్, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్
కొత్తగా అనుమతులెందుకు..?
‘‘ప్రైవేటు పాఠశాలల నిర్వహణ యాజమాన్యాలకు ఇప్పటికే భారంగా మారింది. ఒకసారి అనుమతి తీసుకున్న విద్యా సంస్థలు కింది తరగతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనడం ఎంత మాత్రం సబబు కాదు. ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరని భావిస్తే.. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్న పాఠశాలలన్నింటికీ దరఖాస్తు లేకుండానే అనుమతులు జారీ చేయాలి. అంతేగానీ జైలుకు పంపుతామని బెదిరిస్తే వెనుకాడం..’’
- ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు