ఎన్‌సీటీఈ నిబంధనలు బేఖాతరు!
- ‘గురుకుల’పోస్టుల విద్యార్హతలపై సంక్షేమ శాఖల ఇష్టారాజ్యం
- 6, 7, 8 తరగతుల బోధనకు డిగ్రీలో 50% ఉంటే చాలన్న ఎన్‌సీటీఈ
- డిగ్రీతో పాటు రెండేళ్ల డీఎడ్ చేసిన వారికి అవకాశమివ్వాలని సూచన
- ఈ నిబంధనలను పక్కనబెట్టి మరీ అర్హతల నిర్ణయం
- లక్షల మంది అభ్యర్థులకు అవకాశం దూరం
- పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ వారికి ఇవ్వని అవకాశం
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఆదేశాలను రాష్ట్ర సంక్షేమ శాఖలు తుంగలో తొక్కాయి. 6, 7, 8 తరగతులకు బోధించేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులుంటే చాలన్న నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన నింపాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ అర్హులు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో మూడు లక్షల మంది వరకు గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కానీ ఇప్పుడు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన కారణంగా.. దాదాపు 2 లక్షల మంది వరకు అర్హత కోల్పోతున్నారు. ఇక పీజీటీ పోస్టులకు విద్యార్హతలతోపాటు కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలన్న నిబంధన కారణంగా గత మూడేళ్లలో పీజీ పూర్తి చేసిన వారు అనర్హులు అవుతున్నారు. అసలు ఎన్‌సీటీఈ నిబంధనల్లో ఈ అంశమే లేకపోవడం గమనార్హం.
మరోవైపు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పీఈటీ పోస్టులకు ఇంటర్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులన్న నిబంధన విధించారు. కానీ డిగ్రీ చదివి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) పూర్తి చేసిన వారిని విస్మరించారు. మరోవైపు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పీజీతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పూర్తి చేసిన వారు అర్హులని ప్రకటించారు. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఉన్నవి ఈ రెండు కేటగిరీల పోస్టులే. కానీ ఎందులోనూ బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంగ్లిషులోనే ప్రశ్నపత్రం ఇస్తామనడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ ఉన్నవారికి అన్యాయం!
డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్‌సీటీఈ నిబంధనలున్నాయి. కానీ గురుకులాల్లో 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో.. డిగ్రీ, డీఎడ్ వారికి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీతో బీఎడ్ చేసిన వారు మాత్రమే టీజీటీ పోస్టుకు అర్హులని నిబంధన విధించాయి.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు ఉండాల్సిన అర్హతలను ఎన్‌సీటీఈ నిర్ణయిస్తుందని కేంద్రం 2010 ఏప్రిల్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్‌సీటీఈ 2002 నాటి అర్హతలను సవరిస్తూ 2010 ఆగస్టులో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై గెజిట్ జారీ చేసిన కేంద్రం.. 2002 ఎన్‌సీటీఈ నిబంధనలకు ముందు అర్హతలు పొందిన వారికి మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ గెజిట్‌లోని ప్రధాన అంశాలు..
► 1 నుంచి 5 తరగతులకు బోధించే వారు సీనియర్ సెకండరీ (ఇంటర్)లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే రెండేళ్ల డీఎడ్ కోర్సు చేసి ఉండాలి. అదే ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటే.. డీఎడ్ మాత్రం 2002 ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఉండాలి.
► 6, 7, 8 తరగతులకు బోధించే వారు డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ చేసి ఉండాలి.. లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి.. లేదా 45 శాతం మార్కులతో డిగ్రీ చేసి ఉంటే బీఎడ్ ఎన్‌సీటీఈ నిబంధనల మేరకు ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో ఇంటర్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
► వీటన్నింటితోపాటు ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’లో అర్హత సాధించి ఉండాలి.
► 9, 10 తరగతులకు బోధించేవారికి డిగ్రీలో 50శాతంతోపాటు బీఈడీ, 11, 12 తరగతులకు బోధించేవారికి పీజీలో 50శాతంతోపాటు బీఈడీ చేసి ఉండాలని పేర్కొంది. ఒకవేళ డిగ్రీ, పీజీల్లో 45 శాతమే ఉంటే.. బీఎడ్ మాత్రం ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
బీసీలకు అన్యాయం
విద్యార్హతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 5 శాతం సడలింపు వర్తిస్తుందని ఎన్‌సీటీఈ స్పష్టం చేసింది. కానీ ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉండాలని.. బీసీ, ఇతరులైతే 60 శాతం ఉండాలని టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అంటే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే 5 శాతం సడలింపు ఇచ్చింది. దీంతో బీసీలకు, వికలాంగుల కు అన్యాయం తప్పడం లేదు.
విద్యాశాఖ చెప్పినా..
విద్యా శాఖ ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలపై సంక్షేమ శాఖలకు వివరాలిచ్చినా పట్టించుకో లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్‌సీటీఈ జారీ చేసిన ఉత్తర్వులను సైతం సంక్షేమ శాఖలకు అందజేశా మని.. అయినా ఇష్టానుసారం నిబంధన లు పెట్టారని పేర్కొంటున్నారు.