ఏబీసీడీ.. ఫీజుల దాడి! | Fees attack! | Sakshi
Sakshi News home page

ఏబీసీడీ.. ఫీజుల దాడి!

Published Tue, Jun 7 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

ఏబీసీడీ.. ఫీజుల దాడి!

ఏబీసీడీ.. ఫీజుల దాడి!

- ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు
- శాస్త్రీయ విధానం లేకుండా ఏటేటా పెంపు
- ఇష్టారాజ్యంగా కేపిటేషన్, డొనేషన్ల వసూళ్లు
- ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో పేర్లతో దందా
- పట్టించుకోని విద్యాశాఖ.. కానరాని నియంత్రణ చర్యలు
- జీవోలన్నీ బుట్టదాఖలు
- యాజమాన్యాలకు ముకుతాడు వేసేదెప్పుడు: తల్లిదండ్రులు
 
 సాక్షి, హైదరాబాద్: సురేశ్‌కుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కొడుకు విశ్వాస్‌ను బాగా చదివించాలన్న కోరికతో గతేడాది ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు. రూ.65 వేల ఫీజు. యూనిఫారం, షూస్, పుస్తకాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నింటికీ మొత్తం లక్ష వరకు వెచ్చించాడు. ఈ ఏడాది విద్యార్థి పైతరగతికి వెళ్లాడు. ఫీజు రూ.85 వేలు చేశారు. అన్ని ఖర్చులు కలిపి రూ.1.35 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది!

► వరంగల్‌లో కాస్త పేరున్న ఓ ప్రైవేటు స్కూల్లో సుధీర్ తన కొడుకును గతేడాది ఒకటో తరగతిలో చేర్చాడు. రూ.25 వేల ఫీజు కట్టాడు. ఇప్పుడు రెండో తరగతికి వచ్చేసరికి స్కూలు యాజమాన్యం ఫీజు కింద రూ.35 వేలు చెల్లించాలంటోంది.
► కరీంనగర్‌లోని మరో ప్రైవేటు స్కూలు యాజమాన్యం గతేడాది మూడో తరగతికి రూ.22 వేలు వసూలు చేసింది. ఇప్పుడు రూ.30 వేలు కట్టాలంటోంది!
 ..ఒకట్రెండు కాదు.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లన్నింటిదీ ఇదే దారి! ఏటేటా భారీగా ఫీజులు పెంచేస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అయినా పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశతో అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఒక విధానం అంటూ లేకుండా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నా వాటిని నియంత్రించే చర్యలు కానరావడం లేదు. ఫీజులపై అనేక ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు ఒక్క స్కూల్‌పైనా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు! ఇక ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. ‘మీ అబ్బాయికి సీటిస్తాం.. డొనేషన్ ఎంతిస్తారు..?’ అంటూ బేరమాడుతున్నాయి. స్కూళ్ల ఆగడాలు ఏటేటా పెరిగిపోతున్నా విద్యాశాఖకు పట్టడం లేదు. ప్రభుత్వమో, ఉన్నతాధికారులో.. చర్యలు చేపట్టాలని ఆదేశించినప్పుడే జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు
 
 హడావుడి చేస్తున్నారు. వారైనా కఠినంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు! తనిఖీల పేరుతో పాఠశాలలకు వచ్చి యాజమాన్యాల వద్ద వసూళ్ల దందాకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ఫీజులపై నియంత్రణ ఏదీ?
 తెలంగాణలో 14,250 ప్రైవేటు పాఠశాలలున్నాయి. అందులో 32.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోనే 9 వేల స్కూళ్లు ఉండగా.. వాటిలో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91ని జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్‌ఆర్‌సీ) ఏర్పాటు చేయాలి. పాఠశాల గవర్నింగ్ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్‌ఆర్‌సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అందులోనూ గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను పేర్కొంది.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్‌ఆర్‌సీల ఏర్పాటు సరిగ్గా లేదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 91న పక్కన పడేసి జీవో 41, 42ను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. అలాగే ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800కు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు కూడా ఆగిపోయింది. దీంతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది.
 
 ఫీజులు ఆకాశంలో.. వసతులు పాతాళంలో..
 వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. చాలా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులు అంతంతే ఉంటున్నాయి. అపార్ట్‌మెంట్లలో స్కూళ్ల నిర్వహణ, అగ్గిపెట్టెల్లాంటి తరగతి గదులు, శిక్షణ లేని ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కొరత మధ్య స్కూళ్లు సాగుతున్నాయి. 1 నుంచి ఐదో తరగతి క్లాసులు కూడా 2, 3, 4వ అంతస్తుల్లో నిర్వహిస్తుండడంతో బ్యాగుల మోతతో మెట్లెక్కలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లంచ్ టైం కేవలం 30 నిమిషాలు ఇస్తున్నారు. మెట్లెక్కి, దిగే సరికే సగం టైం అయిపోతుండడంతో పిల్లలు సరిగా భోజనం చేయడం లేదు.
 
 నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలా?

 నర్సరీ నుంచే ఐఏఎస్ శిక్షణ? అదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. వరంగల్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఐఐటీకే కాదు.. ఐఏఎస్‌కు సైతం నర్సరీ నుంచే శిక్షణ ఇస్తామంటూ ఫీజులు గుంజాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఇందుకు రూ.2 వేల చొప్పున వసూలు చేశాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ శాఖ ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు   చేసి ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేసింది. ఇందులో విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డాయి. ఏసీ క్లాస్ రూమ్‌లు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు తేలింది. వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యాబోధనకు సంబంధం లేదని స్పష్టమైంది.
 
 ఆకర్షణీయమైన పేర్లతో గాలం
 ఐఐటీ ఫౌండేషన్ గతంలో ఆరో తరగతి నుంచి మొదలైతే ఇప్పుడు ఒకటో తరగతి నుంచే చెబుతామంటూ అనేక స్కూళ్లు వెలిశాయి. ఆడుతూ పాడుతూ ఓనమాలు దిద్దాల్సిన ప్రాయంలో వారి మానసిక స్థాయితో సంబంధం లేకుండా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్‌లు మొదలుపెడుతున్నాయి. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులకు గాలమేస్తున్నాయి. ఇలా ఆకర్షణీయ పేర్లు పెట్టడానికి వీల్లేదని, వాటిని వెంటనే తొలగించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ గతంలో ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
 
 ఆ జీవో అమలు ఎక్కడ?
 ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1 జారీ చేసింది. దీని ప్రకారం.. పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తాన్ని 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు ఉపయోగించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం కేవలం 5 శాతం నిధులను మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ జీవో అమలు అటకెక్కింది. అసలు ఆ జీవోను పట్టించుకునేవారే లేరు. ఫలితంగా ఫీజులకు ఏటేటా రెక్కలు వస్తూనే ఉన్నాయి. అడ్డగోలు ఫీజుల ను నియంత్రించి, యాజమాన్యాలకు  ముకుతాడు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement