ఒకే ఒక్కడు...!
రాజు తలచుకుంటే... అన్నట్లుగా తయారైంది జిల్లా విద్యాశాఖ తీరు. జిల్లాలోని కీలకనేత అండతో విద్యాశాఖపై ఓ అధికారి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. పదోన్నతిపై బదిలీ అయినా, ఇక్కడ కుర్చీని మాత్రం వదలకుండా వ్యవహారం నడుపుతున్నారు. అప్పుడప్పుడు కీలక నేతకు‘ముట్టజెబుతూ’... సీఎం పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను బలవంతంగా తరలిస్తూ చక్రం తిప్పుతున్నారు. డైరెక్టరేట్‌కు బదిలీ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు జిల్లా బాధ్యతలూ కట్టబెట్టేశారు.
సాక్షి, అమరావతి బ్యూరో : ఆ అధికారి ఇటీవల వరకు జిల్లా విద్యాశాఖలో రెండు పోస్టులు నిర్వహించారు. ఓ కీలక రెగ్యులర్ పోస్టుతోపాటు మరో పోస్టుకు ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ చేసిన బదిలీల్లో ఆ అధికారికి స్థానం లభించింది. కాకపోతే కాకినాడలో కీలక పోస్టింగు ఆశించారు. ఆ పరిధిలో ఐదు జిల్లాలు ఉండటంతో చక్రం తిప్పొచ్చని భావించారు. అందుకు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వ పెద్ద ద్వారా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విద్యాశాఖలో కీలక నేత అండదండలతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ అధికారి ఆ పోస్టు దక్కించుకున్నారు.
దాంతో జిల్లాలోని అధికారికి విజయవాడలోని విద్యాశాఖ డైరెక్టరేట్‌లో పోస్టింగు ఇచ్చారు. పదోన్నతిపై డైరెక్టరేట్‌లో విధుల్లో చేరినప్పటికీ అది లూప్‌లైన్ పోస్టింగుగానే భావించారు. ఎందుకంటే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలతో నేరుగా వ్యవహారాలు సాగించడానికి అవకాశం లేని పోస్టు అది. మరోవైపు ఓ మహిళా అధికారిని జిల్లా విద్యాశాఖ లో ఇన్‌చార్జిగా నియమించారు. దాంతో ఆ అధికారి కలవరపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, అదనపు సెక్షన్లు, ఇతరత్రా కీలక ఫైళ్లు కదిలే తరుణమిదే... ఇలాంటి సమయంలో లూప్‌లైన్‌కు పరిమితమైపోయి జిల్లా కార్యాలయంలో లేకుంటే ఎలా అని ఆయన ఆందోళన చెందారు.
కీలక నేత అండదండలు
ఆ అధికారి వెంటనే జిల్లాలో కీలక నేతను ఆశ్రయించారు. తనకు కాకినాడలో కోరుకున్న పోస్టింగు ఇవ్వ లేదు... కాబట్టి తనకు కనీసం జిల్లా విద్యా శాఖపై పట్టు సడలకుండా చూడాలని కోరారు. తను ఏటా ఆయన్ని తగినరీతిలో ‘సంతృప్తిపరుస్తున్న’ విధానాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జిల్లాలో తరచూ పాల్గొనే కార్యక్రమాలకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను తరలిస్తూ సహకరిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. దాంతో కీలక నేత పునరాలోచనలో పడ్డారు. అన్ని కార్యక్రమాలకు విద్యార్థుల తరలింపు, ప్రైవేటు పాఠశాలల నుంచి వాహనాలు సమకూర్చడం వంటి పనులన్నీ చేస్తున్న ఆయన పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు భారీగా విద్యార్థులు లేకపోతే తాను మాట పడాల్సి వస్తుందని కూడా భావిం చారు. మరోవైపు తనను ‘సంతృప్తి’పరుస్తునే ఉన్నారు కదా అని అనుకున్నారు.
ఆమె విధుల్లో చేరనే లేదు... మళ్లీ ‘సారు’కే పెత్తనం
కీలక నేత వెంటనే జిల్లా ఇన్‌చార్జి అధికారిగా నియమితులైన మహిళా అధికారిని విధుల్లో చేరవద్దని సమాచారం పంపారు. ఆపై రెండురోజులకే తనను సంతృప్తి పరుస్తున్న ఆ అధికారినే జిల్లాలో ఇన్‌చార్జిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పదోన్నతిపై వెళ్లిపోయిన తరువాత జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. మరో అధికారిని రెగ్యులర్‌గా కానీ, ఇన్‌చార్జిగా గానీ నియమించడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఆ అస్మదీయ అధికారికే పెత్తనం కట్టబెట్టేశారు. దీనిపై విద్యాశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.