Female officer
-
ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి..
ఒడిశా: ప్రతిరోజూ నాకు నమస్కారం చేయండి.. లేదంటే మీ పనులు నిలిపివేస్తాను అని ఒక మహిళా అధికారి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో బిసంటక్ సమితి పరిధిలోని జీవికా మిషన్ కార్యాలయంలో మానసీ టకిరి అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు ప్రతిరోజూ ఆఫీస్‌కు వచ్చిన వెంటనే సిబ్బంది మొత్తం నమస్కారం చేయడం లేదని, కొంతమంది గుడ్ మార్నింగ్తో సరిపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై అలాంటివి కొనసాగవని, అందరు తప్పకుండా నమస్కారం చేయాల్సిందేనని గట్టిగా చెప్పారు. అయితే ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ చెబుతున్నాం కదా మేడం అని ఒక వ్యక్తి అంటున్నా ఆమె ససేమిరా అన్నారు. ఈ వీడియోను బిసంకటక్ బీడీవో సదాశివ నాయక్ దృష్టికి విలేకరులు తీసుకెళ్లగా, దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
దళపతిగా తొలిమహిళ
ఈ నెల పదిహేనో తారీఖున ఢిల్లీలో జరగబోయే 71వ ఆర్మీ డే పరేడ్ ఓ చరిత్ర సృష్టించనుంది. 144 మంది జవాన్లు ఉన్న ఆర్మీ కాంటింజెట్కు ఓ మహిళా అధికారి నాయకత్వం వహించనున్నారు. అసలు ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ కాంటింజెంటే ఇరవై మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పరేడ్‌లో పాల్గొననుంది. దానిని ఓ మహిళా అధికారి సారథ్యం వహించడం ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆ ఆఫీసర్ లెఫ్టినెంట్ భావనా కస్తూరి. 2015 అక్టోబర్‌లో ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయ్యారు భావన. ‘‘ఈ పరేడ్‌లో పాల్గొనడానికి, లీడ్ చేయడానికి మగవాళ్లు చాలా కష్టపడ్తారు. యేడాది పాటు ప్రాక్టీస్ చేస్తారు. మాది బెంగళూరు సెంటర్. నా రెజిమెంటల్ నుంచి ఇక్కడికి వచ్చా. ఓ ఆరునెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో ఇద్దరు పురుష అధికారులు కాంటిజెంట్ కమాండర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్మీ కాంటిజెంట్‌కు సారథ్యం వహించే అవకాశం మహిళా అధికారికి వచ్చింది అంటే ఆర్మీలో మహిళల పట్ల అమోదనీయత వచ్చినట్లే. ఇది శుభ పరిణామం’’ అన్నారు భావనా కస్తూరి. -
మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం
గుడివాడ : ఓ మహిళా అధికారిపై టీడీపీ నేతల జులుం ఆలస్యంగా వెలుగు చూసింది. దళిత అధికారి అని కూడా చూడకుండా కులం పేరుతో తిట్టిన టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసులు పెడితే కనీసం పట్టించుకోకపోగా ఆమెపై బదిలీ వేటు వేసిన ఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం.. వేలంపాటలో దక్కలేదనే అక్కసుతోనే... గుడివాడ రూరల్ మండలంలోని కూలిపోయిన అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాల తొలగింపునకు వేలం నిర్వహించారు. మోటూరుకు చెందిన టీడీపీ నేత శేషగిరి వేలంలో పాల్గొనగా వేరే వ్యక్తికి దక్కింది. అతను భవనాలు కూల్చే పనిలో ఉండగా శేషగిరి ఫోన్ చేసి పార్టీ ఫండ్‌గా రూ.25 వేలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. తనకు ఎంపీడీవో కె. జ్యోతి కాంట్ట్రాక్టు ఇచ్చారని, ఆమెను అడగాలని చెప్పటంతో రెచ్చిపోయిన ఆ నాయకుడు ఎంపీడీవోను తిట్టినట్లు వినికిడి. కులం పేరుతో ధూషించి అనరాని మాటలు అన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న ఆమె టీడీపీ నాయకుడు శేషగిరి తనను ఏ మని తిట్టాడో కాంట్రాక్టర్‌తో లేఖ రాయించుకున్నారు. టీడీపీలో రెండు వర్గాలుగా విడిపోయి.. విషయం తెలియగానే టీడీపీలోని ఓ వర్గం ఎంపీడీవోకు ఫోన్ చేసి శేషగిరిపై అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పారు. మరోవైపు టీడీపీ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు, అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు కేసు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు వినికిడి. అయితే తనకు జరిగిన అవమానంతో ఆమె గుడివాడ రూరల్ స్టేషన్లో శేషగిరిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పది రోజుల క్రితం జరిగింది. టీడీపీ కార్యాలయంలో పంచాయతీ.. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఎంపీడీవోను పిలిపించి పంచాయితీ పెట్టారు. కేసు వెనక్కి తీసుకోవాలని వత్తిడి తెచ్చారు. ఎంత చెప్పినా ఆమె వినకపోవటంతో నీవు వైఎస్సార్ సీపీ నేతలకు పనులు చేస్తున్నావని అభియోగం మోపారు. దీనిపై ఆమె ఘాటుగానే స్పందించినట్లు సమాచారం. రాజీ కుదరకపోవడంతో బదిలీ వేటు.? రాజీకి రాలేదని ఎంపీడీవోపై బదిలీ వేటు వేశారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌తో మాట్లాడి ఏ కారణం లేకుండానే ఆమెను పెదపారుపూడి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు అందించారు. -
రూల్స్ పాటిస్తే ఇంటికే!
► పంచాయతీ అధికారిణికి అధికార పార్టీ వేధింపులు ► ఆమెను బదిలీ చేయాల్సిందేనని తీర్మానం సాక్షి, అమరావతి బ్యూరో: ‘మేము చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి... లేకుంటే ఇంటికి వెళ్ళక తప్పదు.. రూల్స్ గీల్స్ జాన్ తానై.. ఆ సర్పంచ్ల చెక్‌పవర్ రద్దు చేస్తారా లేక బదిలీపై వెళ్తారా’ అంటూ అధికారపార్టీ నాయకులు మహిళా ఉన్నతాధికారిపై వేధింపులకు పాల్ప డ్డారు. అయితే ఆమె మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించారు. ‘నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో ఆచరించి తీరుతా.. అంతేకాని మీరు చెప్పినట్లు చేసే ప్రసక్తేలేదు’ అంటూ తేల్చిచెప్పడంతో ఆ మహిళా అధికారిని బదిలీ చేయాలని ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీర్మానం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... చెక్ పవర్ రద్దు చేయకపోవడమే.... మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయకపోవడమే జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి చేసిన పాపం. దీనికితోడు 14వ ఆర్థిక సంఘం నిధులపై జాయింట్ చెక్ పవర్ ఈవోపీఆర్డీలకు ఇవ్వడం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సర్పంచ్‌లు ఉన్న చోట ఉపాధి నిధుల కోసం తీర్మానాలు చేసి పంపడంలో విఫలం అయిందని మరొక కారణం... ఇలా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో డీపీవో శ్రీదేవిపై మంత్రులు , ఎమ్మెల్యేలు విరుచుకుపడి, ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. సమావేశం జరిగిన ప్రతిసారీ... జిల్లా ఇన్ చార్జి మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిసారీ డీపీవోను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల, తెనాలి, రేపల్లె ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లున్నచోట ఉపాధి పనులకు సంబంధించి, శాఖలతో సమన్వయం చేసుకొని తీర్మానాలు పంపడంలో విఫలమయ్యారని టార్గెట్ చేసి ప్రజా ప్రతినిధులు ప్రతిసారీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఆదివారం రాత్రి గుంటూరులో జరిగిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అధికారి ఉంటే తలనొప్పులేననని, ప్రతిదీ నిబంధనల ప్రకారం వెతున్నారని, ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా లాభం లేదని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఆమెను సరెండర్ చేయాలని ఇన్ చార్జి మంత్రి జిల్లా కలెక్టర్‌కు నివేదించినట్టు సమాచారం. నిజాయితీగా వ్యవహారించే మహిళా అధికారులకు తెలుగుదేశం పాలనలో తిప్పలు తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు. -
ఒకే ఒక్కడు...!
రాజు తలచుకుంటే... అన్నట్లుగా తయారైంది జిల్లా విద్యాశాఖ తీరు. జిల్లాలోని కీలకనేత అండతో విద్యాశాఖపై ఓ అధికారి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. పదోన్నతిపై బదిలీ అయినా, ఇక్కడ కుర్చీని మాత్రం వదలకుండా వ్యవహారం నడుపుతున్నారు. అప్పుడప్పుడు కీలక నేతకు‘ముట్టజెబుతూ’... సీఎం పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను బలవంతంగా తరలిస్తూ చక్రం తిప్పుతున్నారు. డైరెక్టరేట్‌కు బదిలీ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు జిల్లా బాధ్యతలూ కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి బ్యూరో : ఆ అధికారి ఇటీవల వరకు జిల్లా విద్యాశాఖలో రెండు పోస్టులు నిర్వహించారు. ఓ కీలక రెగ్యులర్ పోస్టుతోపాటు మరో పోస్టుకు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ చేసిన బదిలీల్లో ఆ అధికారికి స్థానం లభించింది. కాకపోతే కాకినాడలో కీలక పోస్టింగు ఆశించారు. ఆ పరిధిలో ఐదు జిల్లాలు ఉండటంతో చక్రం తిప్పొచ్చని భావించారు. అందుకు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వ పెద్ద ద్వారా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విద్యాశాఖలో కీలక నేత అండదండలతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ అధికారి ఆ పోస్టు దక్కించుకున్నారు. దాంతో జిల్లాలోని అధికారికి విజయవాడలోని విద్యాశాఖ డైరెక్టరేట్‌లో పోస్టింగు ఇచ్చారు. పదోన్నతిపై డైరెక్టరేట్‌లో విధుల్లో చేరినప్పటికీ అది లూప్‌లైన్ పోస్టింగుగానే భావించారు. ఎందుకంటే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలతో నేరుగా వ్యవహారాలు సాగించడానికి అవకాశం లేని పోస్టు అది. మరోవైపు ఓ మహిళా అధికారిని జిల్లా విద్యాశాఖ లో ఇన్చార్జిగా నియమించారు. దాంతో ఆ అధికారి కలవరపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, అదనపు సెక్షన్లు, ఇతరత్రా కీలక ఫైళ్లు కదిలే తరుణమిదే... ఇలాంటి సమయంలో లూప్లైన్కు పరిమితమైపోయి జిల్లా కార్యాలయంలో లేకుంటే ఎలా అని ఆయన ఆందోళన చెందారు. కీలక నేత అండదండలు ఆ అధికారి వెంటనే జిల్లాలో కీలక నేతను ఆశ్రయించారు. తనకు కాకినాడలో కోరుకున్న పోస్టింగు ఇవ్వ లేదు... కాబట్టి తనకు కనీసం జిల్లా విద్యా శాఖపై పట్టు సడలకుండా చూడాలని కోరారు. తను ఏటా ఆయన్ని తగినరీతిలో ‘సంతృప్తిపరుస్తున్న’ విధానాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జిల్లాలో తరచూ పాల్గొనే కార్యక్రమాలకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను తరలిస్తూ సహకరిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. దాంతో కీలక నేత పునరాలోచనలో పడ్డారు. అన్ని కార్యక్రమాలకు విద్యార్థుల తరలింపు, ప్రైవేటు పాఠశాలల నుంచి వాహనాలు సమకూర్చడం వంటి పనులన్నీ చేస్తున్న ఆయన పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు భారీగా విద్యార్థులు లేకపోతే తాను మాట పడాల్సి వస్తుందని కూడా భావిం చారు. మరోవైపు తనను ‘సంతృప్తి’పరుస్తునే ఉన్నారు కదా అని అనుకున్నారు. ఆమె విధుల్లో చేరనే లేదు... మళ్లీ ‘సారు’కే పెత్తనం కీలక నేత వెంటనే జిల్లా ఇన్చార్జి అధికారిగా నియమితులైన మహిళా అధికారిని విధుల్లో చేరవద్దని సమాచారం పంపారు. ఆపై రెండురోజులకే తనను సంతృప్తి పరుస్తున్న ఆ అధికారినే జిల్లాలో ఇన్చార్జిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పదోన్నతిపై వెళ్లిపోయిన తరువాత జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. మరో అధికారిని రెగ్యులర్‌గా కానీ, ఇన్చార్జిగా గానీ నియమించడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఆ అస్మదీయ అధికారికే పెత్తనం కట్టబెట్టేశారు. దీనిపై విద్యాశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
అరుంధతిలా మారిన మహిళా అధికారి
ఏలూరు: ఆడది అబల కాదు సబల అని నిరూపించారు ఓ మహిళా అధికారి. ఐసీడీఎస్ కార్యాలయంలో ఉద్యోగినులపై రివాజుగా మారిన దూషణల పర్వానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్న ఆ శాఖ అధికారిణి అపర కాళికలా మారారు. అవమానం చేసిన ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. తనను అవహేళన చేసిన ఉద్యోగిని కార్యాలయ తలుపులు మూసి చితకబాదారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సరిగ్గా ఆరు రోజుల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే ఒకాయన ఆ శాఖలోనే పనిచేసే ప్రాజెక్టు అధికారిణితో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ పదజాలాన్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన కార్యాలయ ఉద్యోగులు సదరు మహిళా అధికారికి అందించారు. చాలారోజులుగా ఇదేరీతిలో తనను అకారణంగా వేధిస్తున్న అతనికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్యాలయానికి చేరుకుని దూషించిన వ్యక్తితో ‘ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. మహిళలు అంటే అంత అలుసా’ అని ప్రశ్నించారు. మరోసారి ఇలా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించి కార్యాలయం నుంచి ఆమె వెనుదిరిగారు. ఆమె ఆవేశాన్ని ‘లైట్’ తీసుకున్న సదరు ఉద్యోగి.. ‘నీకు చేతనైంది చేసుకో..’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతే ఆమెలోని ఆవేశం కట్టలు తెగింది. అపర కాళికలా మారిన ఆమె తనవెంట వచ్చిన ఇద్దరు సహ ఉద్యోగినులతో కలసి కార్యాలయ తలుపులు వేసి అతన్ని చితకబాదారు. సమయానికి అక్కడ కర్రలు కూడా అందుబాటులో ఉండటంతో అవి విరిగేటట్టు చితక్కొట్టారు. అడ్డువచ్చిన అధికారులను సైతం లెక్క చేయకుండా తన ఆదిశక్తి ప్రతాపాన్ని చూపించారు. కర్రలు విరిగి అంతటి అవమానం జరిగిన తర్వాత గానీ సదరు ఉద్యోగిలో మార్పు రాలేదు. అప్పటికి కళ్లు తెరిచిన ఆయన ‘భవిష్యత్‌లో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించను. దయచేసి వదిలేయండి’ అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. అప్పటికి కానీ ఆమె శాంతించలేదు. ఆ తర్వాత ఉన్నతాధికారి వద్దకు వెళ్లి తక్షణమే ఆ ఉద్యోగిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలనీ, లేకుంటే విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులు, యూనియన్ నేతల దృష్టికి తీసుకెళతానని హెచ్చరించడంతో తక్షణమే ఆ ఉద్యోగిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు. ఆ శాఖలో నిత్యం ఇదేతంతు ఇన్నాళ్లకు ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి అరుంధతిలా మారి మృగాడికి బుద్ధి చెప్పారు కానీ.. వాస్తవానికి ఆ శాఖలో నిత్యం ఇదే మాదిరి వేధింపుల తంతు నడుస్తోందని అంటున్నారు. మహిళలకు రక్షణ కల్పించి, భరోసా ఇవ్వాల్సిన శాఖలోనే మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీవోలను ఇష్టం వచ్చిన రీతిలో కొందరు మగ సహోద్యోగులే కామెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తనిఖీల పేరిట వేధిస్తున్నారని, జిల్లా కార్యాలయానికి వెళ్లాలంటేనే భయపడుతున్నామని వాపోతున్నారు. ఆ మహిళ మాదిరిగా అందరూ అపరకాళికల్లా మారకుండానే అక్కడి అధికారులు, ఉద్యోగులు దారికొచ్చేస్తారా.. ఏమో చూద్దాం. -
ఇదీ నిర్మలమ్మ ఆవేదన...
ఆత్మహత్య చేసుకోవాలనుంది పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదు ఓ మహిళా అధికారిణి ఆవేదన పార్వతీపురం: ‘క్షణ క్షణం...ప్రాణ భయం...నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కడ చంపుతారోననే భయం... పోలీ సులను ఆశ్రయించినా ఫలితం లేదు..’ ఇదీ విశాఖపట్నం ట్రెజరర్ అండ్ అకౌం ట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో ఉన్న జి.నిర్మలమ్మ అనే గ్రూప్-1 అధికారిణి ఆవేదన. పోస్టల్ సూపరింటెండెంట్‌గా పదవీ విరమణ చేసిన తన తండ్రి వద్ద నుంచి రూ.25లక్షలు అప్పుగా తీసుకున్న కొంతమంది వ్యక్తులు.. ఆ డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరింపులతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె బుధవారం మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. ‘నా పేరు జి.నిర్మలమ్మ. విశాఖపట్నంలోని ట్రెజరర్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డెరైక్టర్ హోదాలో పని చేస్తున్నా. మా నాన్న పార్వతీపురం పట్టణానికి చెందిన విశ్రాంతి పోస్టల్ సూపరింటెండెంట్ గూనాన వెంకటయ్య వద్ద కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి ఇవటూరి జయరాం అనే వ్యక్తి 2014, మే 25వ తేదీన రూ.25 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆయనకు అప్పు ఇచ్చే సమయంలో సాక్షులుగా పార్వతీపురం మండలం బాలగుడబ గ్రామానికి చెందిన బొత్స రవికుమార్, పార్వతీపురం పట్టణానికి చెందిన దొనకొండ గౌరునాయుడు ఉన్నారు. మా తండ్రి వెంకటయ్య 2015, నవంబర్ 25న పార్వతీపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఒక్కగానొక్క వారసురాలినైన నేను, నాన్న ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగితే ఈ రోజు.. రేపు.. అంటూ సంవత్సరాలు గడిపారు. చివరికి ఇవ్వం.. నీ దిక్కున్నచోట చెప్పుకో.. అంటూ బెదిరిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ష్యూరిటీ ఇచ్చిన చెక్కులు కూడా బౌన్సు కావడంతో కోర్టును ఆశ్రయించి నెలలు తరబడి వాయిదాలకు తిరుగుతున్నాను. నా తండ్రి కూడా అప్పుతీర్చాలని ఒత్తిడి చేయడంతో పథకం ప్రకారం రోడ్డు ప్రమాదం చేయించి ఉంటారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. మాక్కు డబ్బు ఇవ్వకుండా ఉన్న వ్యక్తితో పార్వతీపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు చేయి కలిపి అప్పులు ఇప్పించడం, తరువాత వారిని మోసం చేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ప్రస్తుతం నా తండ్రి వద్ద తీసుకున్న అప్పు తీర్చకుండా నన్ను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నాకు న్యాయంచేయాలి. నా తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలి..’ అని ఆమె వేడుకున్నారు. నిర్మలమ్మకు ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ జేటీ రామారావు అండగా నిలిచారు. నిర్మలమ్మకు న్యాయం చేయకపోతే మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించి ఆందోళన చేపడతామని రామారావు చెప్పారు. విలేకరుల సమావేశంలో కౌన్సిలర్ ఒ.రామారావు, గూనాన రాములు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆయన’లే వసూల్ రాజాలు
అధికారం దన్నుతో ప్రతి పనిలోనూ సొమ్ముల వెతుకులాటలో ఉన్న ఓ ప్రజాప్రతి నిధి ఇటీవల ఉపాధి హామీ నిధులపై కన్నేశాడు. యంత్రాలతో చేసిన రూ.17 లక్షల విలువైన పనులను ఉపాధి హామీ పథకంలో చేసినట్టు చూపించి ఆ నిధులను తమ ఖాతాలోకి మళ్లించాల్సిందిగా ఓ మహిళా అధికారిని ఆదేశించాడు. ‘అదెలా కుదురుతుంది సార్. యంత్రాలతో పనులు చేయించి ఉపాధి హామీ పథకంలో ఎలా చూపిస్తాం. ఇది చాలా అన్యాయం. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్’ అని ఆ మహిళా అధికారి సదరు ప్రజాప్రతినిధి తీరును గట్టిగానే వ్యతిరేకించారు. చిర్రెత్తుకొచ్చిన ఆ నేత ఆమెను సెలవుపై వెళ్లమని గదమాయించాడు. అందుకు ఆమె ‘నేనెందుకు వెళ్లాలి. సెలవు పెట్టి వెళ్తే మా జీతాలు ఎవరిస్తారు. ఇలా అయితే మా ఉద్యోగాలు ఏం కావాలి’ అని ఎదురు ప్రశ్నించారు. ‘జీతాలు నేనిస్తాలే..’ అని ఆ నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా.. ‘కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. మీలాంటి వాళ్ల వద్ద జీతాలు తీసుకునేందుకు కాద’ని ఆ మహిళా అధికారి ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన ఈ విషయంలో.. నిక్కచ్చిగా వ్యవహరించిన ఆ మహిళా అధికారిని అందరూ ప్రశంసించారు. చిల్లర నేతగా పేరున్న సదరు ప్రజాప్రతినిధి ఏం గలాటా చేస్తారోనన్న భయాన్ని కూడా పక్కన పెట్టి నిర్భీతిగా, నిజాయితీగా వ్యవహరించిన ఆ మహి ళా అధికారి ధైర్యాన్ని అధికార పార్టీ నాయకుల్లోనూ చాలామంది మొచ్చుకున్నారు. ఇలాంటి నిజాయితీపరులైన మహిళా అధికారులున్న జిల్లాలోనే ప్రతి చిన్న పనికీ పైసలిస్తే గానీ కనికరం చూపని వారూ ఉన్నారు. పచ్చనోట్లు పడితే కానీ ఫైలు ముందుకు కదిలించని మహిళా అధికారుల జాబితా పెద్దగానే ఉంది. ఇందులోనూ ప్రత్యేకత చూపించే వారున్నారు. ఆ ‘ప్రత్యేకత’ ఏమిటంటే వసూల్ రాజాలు వాళ్ల భర్తలే కావడం. ‘వారి’తో మాట్లాడండి భర్తలనే కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్న కొందరు మహిళా అధికారుల నోటి వెంట నుంచి ఏమైనా ఉంటే ‘వారి’తో మాట్లాడండి అనే మాటలు నిత్యం విని పిస్తున్నాయి. రవాణా శాఖలో ఓ మహిళా ఉద్యోగి పనుల కోసం తన వద్దకు వచ్చే వారిని ముందుగా అడిగే మాట ‘ఆయన్ను కలిశారా’ అని. ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం తన సతీమణికి డబ్బులొచ్చే పనులు చక్కపెట్టే ‘సద్యోగం’ చేస్తున్న ఆయన ఇటీవల వడ్డీ వ్యాపారం కూడా మొదలెట్టాడని చెబుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కేవలం ఆయన ఒత్తిళ్ల మేరకే ఆమె డబ్బులు తీసుకుంటోంది కానీ.. లేదంటే మరీ అంత ఇబ్బంది పెట్టే రకం కాదని ఆ శాఖ ఉద్యోగులు చెప్పుకుంటుంటారు. , రెవెన్యూ శాఖలో ఓ మహిళా అధికారిది మరీ బరితెగింపు వ్యవహారమట. స్వయంగా ఆమె భర్త అదే శాఖలో పనిచేస్తుండటంతో అతన్నే కలెక్షన్ ఏజెంటుగా పెట్టుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ రకంగా అక్కడ అతనే షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనేది ఉద్యోగులు సహా అందరూ అనేమాట. ఏ పనైనా ఆయన్ను సంప్రదించి ముడుపులు చెల్లిస్తే క్షణాల్లో ఐపోతుందట. మహిళా అధికారికి అధికారికి భర్త కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆయనకు వత్తాసు పలుకుతుంటారని చెబుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పట్టాదార్ పాస్ పుస్తకాలు, పలురకాల అనుమతి పత్రాల వంటి ప్రతి పనికీ రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు. అడంగల్ మార్పు కోసం వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచేస్తున్న చరిత్ర ఉంది. ఒక వేళ అడిగినంత ఇవ్వలేదా.. సరైన డాక్యుమెంట్లు లేవని ఆయనే దర ఖాస్తుల్ని తిరస్కరిస్తుంటాడట. మరీ దారుణం ఏమిటంటే కొన్ని కేసుల్లో ‘మేడమ్ ముడుపులు మేడమ్వే. నా లెక్క నాదే..’ అంటూ ఇద్దరూ వసూళ్లు చేసేస్తున్నారట. ఒకచేయి తడపాలంటేనే సామాన్య జనం చావుకొస్తుంటే.. రెండు చేతులూ చాస్తుంటే ఇద్దరికీ సొమ్ములు ఇచ్చుకోలేక జనం అల్లాడిపోతున్నారట. మరి ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి డబుల్ బొనాంజా కేసులపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి ‘మేడమ్’ల పేరు చెప్పి దండుకుంటున్న ‘ఆయన’లకు అడ్డుకట్ట వేస్తారా.. ఏమో చూద్దాం! - జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు