ఈ నెల పదిహేనో తారీఖున ఢిల్లీలో జరగబోయే 71వ ఆర్మీ డే పరేడ్ ఓ చరిత్ర సృష్టించనుంది. 144 మంది జవాన్లు ఉన్న ఆర్మీ కాంటింజెట్‌కు ఓ మహిళా అధికారి నాయకత్వం వహించనున్నారు. అసలు ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్ కాంటింజెంటే ఇరవై మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పరేడ్‌లో పాల్గొననుంది. దానిని ఓ మహిళా అధికారి సారథ్యం వహించడం ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆ ఆఫీసర్ లెఫ్టినెంట్ భావనా కస్తూరి. 2015 అక్టోబర్‌లో ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయ్యారు భావన. ‘‘ఈ పరేడ్‌లో పాల్గొనడానికి, లీడ్ చేయడానికి మగవాళ్లు చాలా కష్టపడ్తారు. యేడాది పాటు ప్రాక్టీస్ చేస్తారు. మాది బెంగళూరు సెంటర్. నా రెజిమెంటల్ నుంచి ఇక్కడికి వచ్చా. ఓ ఆరునెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నాతో పాటు ఇంకో ఇద్దరు పురుష అధికారులు కాంటిజెంట్ కమాండర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆర్మీ కాంటిజెంట్‌కు సారథ్యం వహించే అవకాశం మహిళా అధికారికి వచ్చింది అంటే ఆర్మీలో మహిళల పట్ల అమోదనీయత వచ్చినట్లే. ఇది శుభ పరిణామం’’ అన్నారు భావనా కస్తూరి.
Comments
Please login to add a commentAdd a comment