అరుంధతిలా మారిన మహిళా అధికారి
ఏలూరు: ఆడది అబల కాదు సబల అని నిరూపించారు ఓ మహిళా అధికారి. ఐసీడీఎస్ కార్యాలయంలో ఉద్యోగినులపై రివాజుగా మారిన దూషణల పర్వానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్న ఆ శాఖ అధికారిణి అపర కాళికలా మారారు. అవమానం చేసిన ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. తనను అవహేళన చేసిన ఉద్యోగిని కార్యాలయ తలుపులు మూసి చితకబాదారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సరిగ్గా ఆరు రోజుల ముందు చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా మహిళ, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహించే ఒకాయన ఆ శాఖలోనే పనిచేసే ప్రాజెక్టు అధికారిణితో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ పదజాలాన్ని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన కార్యాలయ ఉద్యోగులు సదరు మహిళా అధికారికి అందించారు. చాలారోజులుగా ఇదేరీతిలో తనను అకారణంగా వేధిస్తున్న అతనికి తగిన గుణపాఠం చెప్పాలని ఆమె నిర్ణయించుకున్నారు.
అనుకున్నదే తడవుగా కార్యాలయానికి చేరుకుని దూషించిన వ్యక్తితో ‘ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. మహిళలు అంటే అంత అలుసా’ అని ప్రశ్నించారు. మరోసారి ఇలా మాట్లాడితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించి కార్యాలయం నుంచి ఆమె వెనుదిరిగారు. ఆమె ఆవేశాన్ని ‘లైట్’ తీసుకున్న సదరు ఉద్యోగి.. ‘నీకు చేతనైంది చేసుకో..’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతే ఆమెలోని ఆవేశం కట్టలు తెగింది. అపర కాళికలా మారిన ఆమె తనవెంట వచ్చిన ఇద్దరు సహ ఉద్యోగినులతో కలసి కార్యాలయ తలుపులు వేసి అతన్ని చితకబాదారు. సమయానికి అక్కడ కర్రలు కూడా అందుబాటులో ఉండటంతో అవి విరిగేటట్టు చితక్కొట్టారు.
అడ్డువచ్చిన అధికారులను సైతం లెక్క చేయకుండా తన ఆదిశక్తి ప్రతాపాన్ని చూపించారు. కర్రలు విరిగి అంతటి అవమానం జరిగిన తర్వాత గానీ సదరు ఉద్యోగిలో మార్పు రాలేదు. అప్పటికి కళ్లు తెరిచిన ఆయన ‘భవిష్యత్‌లో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించను. దయచేసి వదిలేయండి’ అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. అప్పటికి కానీ ఆమె శాంతించలేదు. ఆ తర్వాత ఉన్నతాధికారి వద్దకు వెళ్లి తక్షణమే ఆ ఉద్యోగిని ఇక్కడి నుంచి బదిలీ చేయాలనీ, లేకుంటే విషయాన్ని రాష్ట్రస్థాయి అధికారులు, యూనియన్ నేతల దృష్టికి తీసుకెళతానని హెచ్చరించడంతో తక్షణమే ఆ ఉద్యోగిని కృష్ణా జిల్లాకు బదిలీ చేశారు.
ఆ శాఖలో నిత్యం ఇదేతంతు
ఇన్నాళ్లకు ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి అరుంధతిలా మారి మృగాడికి బుద్ధి చెప్పారు కానీ.. వాస్తవానికి ఆ శాఖలో నిత్యం ఇదే మాదిరి వేధింపుల తంతు నడుస్తోందని అంటున్నారు. మహిళలకు రక్షణ కల్పించి, భరోసా ఇవ్వాల్సిన శాఖలోనే మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, సీడీపీవోలను ఇష్టం వచ్చిన రీతిలో కొందరు మగ సహోద్యోగులే కామెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తనిఖీల పేరిట వేధిస్తున్నారని, జిల్లా కార్యాలయానికి వెళ్లాలంటేనే భయపడుతున్నామని వాపోతున్నారు. ఆ మహిళ మాదిరిగా అందరూ అపరకాళికల్లా మారకుండానే అక్కడి అధికారులు, ఉద్యోగులు దారికొచ్చేస్తారా.. ఏమో చూద్దాం.