► పంచాయతీ అధికారిణికి అధికార పార్టీ వేధింపులు
► ఆమెను బదిలీ చేయాల్సిందేనని తీర్మానం
సాక్షి, అమరావతి బ్యూరో: ‘మేము చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి... లేకుంటే ఇంటికి వెళ్ళక తప్పదు.. రూల్స్ గీల్స్ జాన్ తానై.. ఆ సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేస్తారా లేక బదిలీపై వెళ్తారా’ అంటూ అధికారపార్టీ నాయకులు మహిళా ఉన్నతాధికారిపై వేధింపులకు పాల్ప డ్డారు. అయితే ఆమె మాత్రం ముక్కుసూటిగా వ్యవహరించారు. ‘నిబంధనలు ఎట్టిపరిస్థితుల్లో ఆచరించి తీరుతా.. అంతేకాని మీరు చెప్పినట్లు చేసే ప్రసక్తేలేదు’ అంటూ తేల్చిచెప్పడంతో ఆ మహిళా అధికారిని బదిలీ చేయాలని ఏకంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీర్మానం చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...
చెక్ పవర్ రద్దు చేయకపోవడమే....
మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయకపోవడమే జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి చేసిన పాపం. దీనికితోడు 14వ ఆర్థిక సంఘం నిధులపై జాయింట్ చెక్ పవర్ ఈవోపీఆర్‌డీలకు ఇవ్వడం టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల సర్పంచ్‌లు ఉన్న చోట ఉపాధి నిధుల కోసం తీర్మానాలు చేసి పంపడంలో విఫలం అయిందని మరొక కారణం... ఇలా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జరిగే సమన్వయ కమిటీ సమావేశాల్లో డీపీవో శ్రీదేవిపై మంత్రులు , ఎమ్మెల్యేలు విరుచుకుపడి, ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.
సమావేశం జరిగిన ప్రతిసారీ...
జిల్లా ఇన్ చార్జి మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రతిసారీ డీపీవోను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాపట్ల, తెనాలి, రేపల్లె ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లున్నచోట ఉపాధి పనులకు సంబంధించి, శాఖలతో సమన్వయం చేసుకొని తీర్మానాలు పంపడంలో విఫలమయ్యారని టార్గెట్ చేసి ప్రజా ప్రతినిధులు ప్రతిసారీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు.
ఆదివారం రాత్రి గుంటూరులో జరిగిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అధికారి ఉంటే తలనొప్పులేననని, ప్రతిదీ నిబంధనల ప్రకారం వెతున్నారని, ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినా లాభం లేదని నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఆమెను సరెండర్ చేయాలని ఇన్ చార్జి మంత్రి జిల్లా కలెక్టర్‌కు నివేదించినట్టు సమాచారం. నిజాయితీగా వ్యవహారించే మహిళా అధికారులకు తెలుగుదేశం పాలనలో తిప్పలు తప్పడం లేదని పలువురు పేర్కొంటున్నారు.