అధికారం దన్నుతో ప్రతి పనిలోనూ సొమ్ముల వెతుకులాటలో ఉన్న ఓ ప్రజాప్రతి నిధి ఇటీవల ఉపాధి హామీ నిధులపై కన్నేశాడు. యంత్రాలతో చేసిన రూ.17 లక్షల విలువైన పనులను ఉపాధి హామీ పథకంలో చేసినట్టు చూపించి ఆ నిధులను తమ ఖాతాలోకి మళ్లించాల్సిందిగా ఓ మహిళా అధికారిని ఆదేశించాడు. ‘అదెలా కుదురుతుంది సార్. యంత్రాలతో పనులు చేయించి ఉపాధి హామీ పథకంలో ఎలా చూపిస్తాం. ఇది చాలా అన్యాయం. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్’ అని ఆ మహిళా అధికారి సదరు ప్రజాప్రతినిధి తీరును గట్టిగానే వ్యతిరేకించారు. చిర్రెత్తుకొచ్చిన ఆ నేత ఆమెను సెలవుపై వెళ్లమని గదమాయించాడు. అందుకు ఆమె ‘నేనెందుకు వెళ్లాలి. సెలవు పెట్టి వెళ్తే మా జీతాలు ఎవరిస్తారు. ఇలా అయితే మా ఉద్యోగాలు ఏం కావాలి’ అని ఎదురు ప్రశ్నించారు. ‘జీతాలు నేనిస్తాలే..’ అని ఆ నేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా.. ‘కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
మీలాంటి వాళ్ల వద్ద జీతాలు తీసుకునేందుకు కాద’ని ఆ మహిళా అధికారి ఒకింత ఘాటుగానే సమాధానమిచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన ఈ విషయంలో.. నిక్కచ్చిగా వ్యవహరించిన ఆ మహిళా అధికారిని అందరూ ప్రశంసించారు. చిల్లర నేతగా పేరున్న సదరు ప్రజాప్రతినిధి ఏం గలాటా చేస్తారోనన్న భయాన్ని కూడా పక్కన పెట్టి నిర్భీతిగా, నిజాయితీగా వ్యవహరించిన ఆ మహి ళా అధికారి ధైర్యాన్ని అధికార పార్టీ నాయకుల్లోనూ చాలామంది మొచ్చుకున్నారు. ఇలాంటి నిజాయితీపరులైన మహిళా అధికారులున్న జిల్లాలోనే ప్రతి చిన్న పనికీ పైసలిస్తే గానీ కనికరం చూపని వారూ ఉన్నారు. పచ్చనోట్లు పడితే కానీ ఫైలు ముందుకు కదిలించని మహిళా అధికారుల జాబితా పెద్దగానే ఉంది. ఇందులోనూ ప్రత్యేకత చూపించే వారున్నారు. ఆ ‘ప్రత్యేకత’ ఏమిటంటే వసూల్ రాజాలు వాళ్ల భర్తలే కావడం.
‘వారి’తో మాట్లాడండి
భర్తలనే కలెక్షన్ ఏజెంట్లుగా పెట్టుకున్న కొందరు మహిళా అధికారుల నోటి వెంట నుంచి ఏమైనా ఉంటే ‘వారి’తో మాట్లాడండి అనే మాటలు నిత్యం విని పిస్తున్నాయి. రవాణా శాఖలో ఓ మహిళా ఉద్యోగి పనుల కోసం తన వద్దకు వచ్చే వారిని ముందుగా అడిగే మాట ‘ఆయన్ను కలిశారా’ అని. ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం తన సతీమణికి డబ్బులొచ్చే పనులు చక్కపెట్టే ‘సద్యోగం’ చేస్తున్న ఆయన ఇటీవల వడ్డీ వ్యాపారం కూడా మొదలెట్టాడని చెబుతున్నారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కేవలం ఆయన ఒత్తిళ్ల మేరకే ఆమె డబ్బులు తీసుకుంటోంది కానీ.. లేదంటే మరీ అంత ఇబ్బంది పెట్టే రకం కాదని ఆ శాఖ ఉద్యోగులు చెప్పుకుంటుంటారు.
, రెవెన్యూ శాఖలో ఓ మహిళా అధికారిది మరీ బరితెగింపు వ్యవహారమట. స్వయంగా ఆమె భర్త అదే శాఖలో పనిచేస్తుండటంతో అతన్నే కలెక్షన్ ఏజెంటుగా పెట్టుకుని ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఓ రకంగా అక్కడ అతనే షాడో అధికారిగా వ్యవహరిస్తున్నాడనేది ఉద్యోగులు సహా అందరూ అనేమాట. ఏ పనైనా ఆయన్ను సంప్రదించి ముడుపులు చెల్లిస్తే క్షణాల్లో ఐపోతుందట. మహిళా అధికారికి అధికారికి భర్త కావడంతో మిగిలిన ఉద్యోగులు సైతం ఆయనకు వత్తాసు పలుకుతుంటారని చెబుతున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పట్టాదార్ పాస్ పుస్తకాలు, పలురకాల అనుమతి పత్రాల వంటి ప్రతి పనికీ రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని అంటున్నారు.
అడంగల్ మార్పు కోసం వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచేస్తున్న చరిత్ర ఉంది. ఒక వేళ అడిగినంత ఇవ్వలేదా.. సరైన డాక్యుమెంట్లు లేవని ఆయనే దర ఖాస్తుల్ని తిరస్కరిస్తుంటాడట. మరీ దారుణం ఏమిటంటే కొన్ని కేసుల్లో ‘మేడమ్ ముడుపులు మేడమ్‌వే. నా లెక్క నాదే..’ అంటూ ఇద్దరూ వసూళ్లు చేసేస్తున్నారట. ఒకచేయి తడపాలంటేనే సామాన్య జనం చావుకొస్తుంటే.. రెండు చేతులూ చాస్తుంటే ఇద్దరికీ సొమ్ములు ఇచ్చుకోలేక జనం అల్లాడిపోతున్నారట. మరి ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి డబుల్ బొనాంజా కేసులపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి ‘మేడమ్’ల పేరు చెప్పి దండుకుంటున్న ‘ఆయన’లకు అడ్డుకట్ట వేస్తారా.. ఏమో చూద్దాం!
- జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు
‘ఆయన’లే వసూల్ రాజాలు
Published Sun, Apr 19 2015 4:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement