Corporate school
-
కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఇవాళ ఏపీలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి: డిప్యూటీ సీఎం
-
కర్నూల్లో టెన్త్ ప్రశ్నపత్రం లీక్
సాక్షి ప్రతినిధి, కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన టెన్త్ సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం ముందుగానే లీకైంది. ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరికి డీఈఓ సెల్కే రావడంతో పేపర్ ముందుగానే లీకైన విషయం వెలుగుచూసింది. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. రోజూలాగే శనివారం ఉదయం 9.30గంటలకు సోషల్ పేపర్–2 పరీక్ష ప్రారంభమైంది. 9.50గంటల ప్రాంతంలో డీఈఓ తహెరా సుల్తానా సెల్‌కు ప్రశ్నపత్రం వచ్చింది. ఇది ఒరిజినల్ ప్రశ్నపత్రమే అని ఆమె ధృవీకరించుకుని కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలిగే ఓ అమాత్యుని కార్పొరేట్ పాఠశాల ద్వారానే ఈ ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీంతో ఈ కేసు నుంచి సదరు విద్యా సంస్థను తప్పించేందుకు అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఆ విద్యా సంస్థకు ముందుగానే.. వాస్తవానికి 10వ తరగతి ప్రశ్నపత్రాలు మొదటి నుంచీ సదరు విద్యా సంస్థకు లీకు అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఇందుకు అనుగుణంగా ఆ పాఠశాల సిబ్బంది విద్యార్థులతో జవాబులను బట్టీ పట్టిస్తున్నారు. అవీ చదవలేని విద్యార్థుల కోసం చిట్టీలను కూడా సదరు యాజమాన్యం అందిస్తోందని తెలుస్తోంది. సమాధానాలను ఒక పేపరు మీద ఉపాధ్యాయులతో రాయిస్తున్నారు. వీటిని మైక్రో జిరాక్స్ తీసి విద్యార్థులకు అందజేస్తున్నారు. కాగా, ఏ నెంబరు నుంచి మొదట ప్రశ్నపత్రం లీకై వచ్చిందనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ చంద్రబాబు హయాంలోనే.. వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పలుమార్లు ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. 1995లో ఒకసారి టెన్త్ ప్రశ్నపత్రాలు లీకవడంతో చివర్లో జరగాల్సిన మూడు పరీక్షలను వాయిదా వేశారు. అనంతరం తిరిగి షెడ్యూల్ ప్రకటించి పరీక్షలను నిర్వహించారు. దీనిపై అప్పట్లోనే అధికార పార్టీ నేతలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 1997లో ఏకంగా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాలు లీకయ్యాయి. దీంతో ఆ పరీక్షలూ వాయిదా పడ్డాయి. ఈ రెండుసార్లు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అప్పట్లో సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ఉన్న కోలా రామబ్రహ్మం పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ వ్యవహారంలో కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇంటర్మీడియట్ అధికారులతో పాటు ఏకంగా సీఎంపైనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని విపక్షాలు అప్పట్లో బాగా డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యా సంస్థపైనే అప్పట్లోనూ ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిగినప్పటికీ అసలు దోషులు మాత్రం తప్పుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి చంద్రబాబు హయాంలోనే టెన్త్ ప్రశ్నపత్రం లీక్ కావడం గమనార్హం. కేసు నమోదు చేశాం : డీఎస్పీ కాగా, టెన్త్ సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం లీక్ కావడంపై కర్నూలు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందన్నారు. -
కడగండ్లు దాటి కలెక్టరయ్యాడు
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం/కాశీబుగ్గ(పలాస): కార్పొరేట్ స్కూల్ కాదు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం.. పాఠశాలకు బస్సులో కాదు నాలుగు కిలోమీటర్లు కాలినడకనే రోజూ రాకపోక... అమ్మానాన్న ఆర్థికంగా స్థితిమంతులు కాదు ఓ సాధారణ వ్యవసాయ కూలీలు... గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు, అడుగడుగునా అడ్డంకులు... ఇవేవీ ఆయన లక్ష్యం ముందు దూదిపింజల్లా ఎగిరిపోయాయి! ప్రజలకు సేవ చేయడానికి ఉన్నతాధికారి కావాలనే దృఢ సంకల్పం ముందు అవన్నీ మంచుముక్కల్లా కరిగిపోయాయి! దేశంలోనే అత్యున్నతమైన సివిల్స్ సర్వీసు ఐఏఎస్‌ను రెండో ప్రయత్నంలోనే మూడో ర్యాంకుతో సాధించి సిక్కోలు సత్తా చాటాడు! అతనే పలాస–కాశీబుగ్గ పట్టణానికి సమీపంలోని పారసంబ గ్రామానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ. అంతేకాదు ఇప్పుడు అందరూ చిన్నచూపు చూస్తున్న మాతృభాష ‘తెలుగు’కు వన్నెలద్దాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి... తెలుగు సాహిత్యాన్నే ఒక సబ్జెక్టుగా తీసుకొని సివిల్స్‌లో మేటి ర్యాంకరుగా నిలిచాడు. మాతృభూమికి, మాతృభాషకు, తల్లిదండ్రులకు గర్వంగా నిలిచిన ఆయన జీవిత విశేషాలు ఒక్కసారి చూస్తే... పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పారసాంబ గోపాలకృష్ణ సొంత గ్రామం. రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతుల రెండో సంతానం గోపాలకృష్ణ. వారి పెద్ద కుమారుడు కోదండరావు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్ పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి పశ్చిమ గోదావరి జిల్లా దూబచర్ల డైట్లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. వెంటనే డీఎస్సీ–2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత శిలగాం పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం పలాస మండలం రేగులపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. మరోవైపు విజయనగరంలోని మహారాజా కళాశాల నుంచి బీఎస్సీ (ఎంపీసీ) దూరవిద్య విధానంలో పూర్తి చేశారు. కుటుంబం అండగా.... గోపాలకృష్ణ కుటుంబం పాతికేళ్లుగా గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వాటన్నింటినీ అధిగమిస్తూనే అప్పారావు దంపతులు తమకున్న అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ముగ్గురు పిల్లలను అనేక కష్టాలకోర్చి చదివించారు. తమ తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలన్నా, సమాజంలో అలాంటివారికి అండగా ఉండాలన్నా గ్రూప్–1 అధికారి కావాలనేదీ గోపాలకృష్ణ లక్ష్యం. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితుల వల్ల ఆయన దృష్టి సివిల్స్‌పైకి మళ్లింది. అలాంటి దృఢ సంకల్పం ఉండటం వల్లే పదేళ్ల వయస్సులోనే బ్రాహ్మణతర్లా గ్రామంలోని హైస్కూల్‌కు రానుపోను నాలుగు కిలోమీటర్లు కాలినడకనే వెళ్లివచ్చేవారు. ఐదేళ్లు అదే ప్రయాణం. వర్షాకాలంలో గెడ్డలు పొంగింతే తండ్రి భుజాలను పట్టుకొని మరీ పాఠశాలకు వెళ్లేవారు. 19 ఏళ్లకే ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చినా మరో పదేళ్ల పాటు తన కృషిని కొనసాగించి సివిల్స్‌లో 3వ ర్యాంకును గోపాలకృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయన విజయంతో పారసాంబ గ్రామంలో సందడి నెలకొంది. కుటుంబం, బంధువులు, స్నేహితుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాభ్యాసం... ప్రాథమిక విద్య: ఎంపీపీ పాఠశాల, పారసాంబ, పలాస మండలం ఉన్నత విద్య: జడ్పీ హైస్కూల్, బ్రాహ్మణతర్ల, పలాస మండలం ఇంటర్మీడియెట్ : గవర్నమెంట్ జూనియర్ కళాశాల, పలాస డిగ్రీ (బీఎస్సీ): మహరాజా కళాశాల, విజయనగరం (దూరవిద్య) విజయాల పరంపర... టీటీసీ(2006): డైట్, దూబచర్ల, పశ్చిమ గోదావరి జిల్లా డీఎస్సీ (2007): ఉపాధ్యాయుడిగా ఎంపిక. రేగులపాడు ఎంపీపీ స్కూల్లో ఉద్యోగం గ్రూప్–1 (2011): మెయిన్స్‌లో ఉత్తీర్ణులై ఇంటర్వూ్య వరకూ వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల ఆ ఫలితాలు ఆగిపోయాయి. సివిల్స్ (2014): గ్రూప్–1 వదిలేసి సివిల్స్ వైపు దృష్టి. హైదరాబాద్‌లో కోచింగ్ సివిల్స్ (2015): ప్రిలిమినరీ దశలోనే ఆటంకం. తొలి ప్రయత్నం విఫలం సివిల్స్ (2016): ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వూ్య దిగ్విజయంగా దాటుకొని దేశంలోనే 3వ ర్యాంకుతో విజయం న్యాయం కోసం పోరాడాలి ‘‘ప్రస్తుత రోజుల్లో అన్యాయాలు, అక్రమాలు అధికంగా జరుగుతున్నాయి. వీటిపైన మా కుమారుడు కలెక్టర్ హోదాలో ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఉంది. మా గ్రామంలోనే గ్రామ కంఠాలు ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇటువంటివి అరికట్టాలి. పేద ప్రజలకు నా కొడుకు సేవలందించాలి. అదే మాకు గర్వకారణం.’’ – రోణంకి అప్పారావు, రుక్మిణమ్మ దంపతులు -
నిఘా కళ్లు కప్పేశారు !
కాశినాయనణ: పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లైంది. శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదారులు తొక్కే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్ల యాజమాన్యాలు చేస్తున్న మాస్‌కాపీయింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే 5 కేంద్రాల్లో మాత్రమే సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఫలించిన ప్రైవేటు స్కూల్ యాజమాన్యాల హవా? : కొన్నేళ్లుగా జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులదే హవా. దీనికి ఆయా స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తు అయితే పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, నిర్వాహకులను మేనేజ్ చేయడం మరొక ఎత్తు. పరీక్షల్లో విద్యార్థులు అడ్డదారులు తొక్కేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సిబ్బందిని, కొంత మంది అధికారులను లోబరుచుకోవడానికి పెద్ద మొత్తంలో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేసిన ఘటనలు అనేకం. మాస్‌కాపీయింగ్ వల్లే కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్నారని అనేక పర్యాయాలు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే కొంత మంది అవినీతి అధికారులను మేనేజ్ చేసి తమ విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఏ పరీక్ష కేంద్రంలో కూడా సీసీకెమెరాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొత్తం మీద ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. -
ఒకే ఒక్కడు...!
రాజు తలచుకుంటే... అన్నట్లుగా తయారైంది జిల్లా విద్యాశాఖ తీరు. జిల్లాలోని కీలకనేత అండతో విద్యాశాఖపై ఓ అధికారి సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. పదోన్నతిపై బదిలీ అయినా, ఇక్కడ కుర్చీని మాత్రం వదలకుండా వ్యవహారం నడుపుతున్నారు. అప్పుడప్పుడు కీలక నేతకు‘ముట్టజెబుతూ’... సీఎం పాల్గొనే కార్యక్రమాలకు విద్యార్థులను బలవంతంగా తరలిస్తూ చక్రం తిప్పుతున్నారు. డైరెక్టరేట్‌కు బదిలీ అయినా నిబంధనలకు విరుద్ధంగా ఆయనకు జిల్లా బాధ్యతలూ కట్టబెట్టేశారు. సాక్షి, అమరావతి బ్యూరో : ఆ అధికారి ఇటీవల వరకు జిల్లా విద్యాశాఖలో రెండు పోస్టులు నిర్వహించారు. ఓ కీలక రెగ్యులర్ పోస్టుతోపాటు మరో పోస్టుకు ఇన్చార్జిగా వ్యవహరించారు. ఇటీవల రాష్ట్రస్థాయి అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ చేసిన బదిలీల్లో ఆ అధికారికి స్థానం లభించింది. కాకపోతే కాకినాడలో కీలక పోస్టింగు ఆశించారు. ఆ పరిధిలో ఐదు జిల్లాలు ఉండటంతో చక్రం తిప్పొచ్చని భావించారు. అందుకు జిల్లాలో పెత్తనం చెలాయిస్తున్న ప్రభుత్వ పెద్ద ద్వారా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. విద్యాశాఖలో కీలక నేత అండదండలతో ఉత్తరాంధ్రకు చెందిన ఓ అధికారి ఆ పోస్టు దక్కించుకున్నారు. దాంతో జిల్లాలోని అధికారికి విజయవాడలోని విద్యాశాఖ డైరెక్టరేట్‌లో పోస్టింగు ఇచ్చారు. పదోన్నతిపై డైరెక్టరేట్‌లో విధుల్లో చేరినప్పటికీ అది లూప్‌లైన్ పోస్టింగుగానే భావించారు. ఎందుకంటే కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలతో నేరుగా వ్యవహారాలు సాగించడానికి అవకాశం లేని పోస్టు అది. మరోవైపు ఓ మహిళా అధికారిని జిల్లా విద్యాశాఖ లో ఇన్చార్జిగా నియమించారు. దాంతో ఆ అధికారి కలవరపడ్డారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు, అదనపు సెక్షన్లు, ఇతరత్రా కీలక ఫైళ్లు కదిలే తరుణమిదే... ఇలాంటి సమయంలో లూప్లైన్కు పరిమితమైపోయి జిల్లా కార్యాలయంలో లేకుంటే ఎలా అని ఆయన ఆందోళన చెందారు. కీలక నేత అండదండలు ఆ అధికారి వెంటనే జిల్లాలో కీలక నేతను ఆశ్రయించారు. తనకు కాకినాడలో కోరుకున్న పోస్టింగు ఇవ్వ లేదు... కాబట్టి తనకు కనీసం జిల్లా విద్యా శాఖపై పట్టు సడలకుండా చూడాలని కోరారు. తను ఏటా ఆయన్ని తగినరీతిలో ‘సంతృప్తిపరుస్తున్న’ విధానాన్ని కొనసాగిస్తానని కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జిల్లాలో తరచూ పాల్గొనే కార్యక్రమాలకు అన్ని పాఠశాలల నుంచి విద్యార్థులను తరలిస్తూ సహకరిస్తున్న విషయాన్ని కూడా గుర్తుచేశారు. దాంతో కీలక నేత పునరాలోచనలో పడ్డారు. అన్ని కార్యక్రమాలకు విద్యార్థుల తరలింపు, ప్రైవేటు పాఠశాలల నుంచి వాహనాలు సమకూర్చడం వంటి పనులన్నీ చేస్తున్న ఆయన పట్ల సానుకూలంగా స్పందించారు. సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలకు భారీగా విద్యార్థులు లేకపోతే తాను మాట పడాల్సి వస్తుందని కూడా భావిం చారు. మరోవైపు తనను ‘సంతృప్తి’పరుస్తునే ఉన్నారు కదా అని అనుకున్నారు. ఆమె విధుల్లో చేరనే లేదు... మళ్లీ ‘సారు’కే పెత్తనం కీలక నేత వెంటనే జిల్లా ఇన్చార్జి అధికారిగా నియమితులైన మహిళా అధికారిని విధుల్లో చేరవద్దని సమాచారం పంపారు. ఆపై రెండురోజులకే తనను సంతృప్తి పరుస్తున్న ఆ అధికారినే జిల్లాలో ఇన్చార్జిగా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పదోన్నతిపై వెళ్లిపోయిన తరువాత జిల్లా కార్యాలయంలో బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. మరో అధికారిని రెగ్యులర్‌గా కానీ, ఇన్చార్జిగా గానీ నియమించడం సంప్రదాయం. అందుకు విరుద్ధంగా ఆ అస్మదీయ అధికారికే పెత్తనం కట్టబెట్టేశారు. దీనిపై విద్యాశాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
అప్పుల మాసమిది..
సుబ్బారావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన నెల జీతం రూ.12 వేలు. తన కుమారున్ని కార్పొరేట్ స్కూల్లో ఎనిమిదవ తరగతిలో చేర్పించడానికి రూ.26 వేలు అడిగారు. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్ అయితే రూ.45 వేలు అవుతుందని చెప్పారు. బ్యాగు, పుస్తకాలు, స్కూల్ డ్రస్, షూ, బస్సు చార్జీ దాదాపు రూ.16,500 అవుతుంది. ఈ లెక్కన జనరల్ సెక్షన్లో అయితే రూ.42,500.. ఐఐటీ, ఒలంపియాడ్ సెక్షన్లో అయితే రూ.61,500 అవుతుంది. ‘చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పిల్లలు, బంధువుల పిల్లలు ఐఐటీ సెక్షన్లో ఉన్నారు. మన పిల్లాడినీ ఐఐటీ సెక్షన్లోనే చేరుద్దాం. మనం ఎత్తిపెట్టిన మొత్తానికి తోడుగా మరికొంత అప్పు చేద్దాం. ఒక్కగానొక్కడు.. బాగా చదివించుకుందాం.. అప్పు ఎలాగోలా తీర్చుకుందాం’ అని సుబ్బారావు భార్య తెగేసి చెప్పింది. కడప ఎడ్యుకేషన్ : జూన్ నెల వచ్చిందంటే చాలు దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబులు మొదలవుతుంది. పిల్లలకు యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగులతో పాటు స్కూల్ ఫీజును చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రచారార్భాటాలతో ఊదరగొడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ధాటికి సామాన్యులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. అలాంటి స్కూళ్లలో చదివించకపోతే భవిష్యత్ బావుండదనే బెంగతో అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులు ప్రతి ఏడాది ‘జూన్’ ఖర్చుల కోసం కొంత మొత్తం దాస్తుంటారు. పెరుగుతున్న ఫీజులు, పుస్తకాల ధరల వల్ల ఇలా దాచిన డబ్బు సరిపోవడం లేదు. దాదాపు సగం మొత్తం అప్పు చేయాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు ఎంతగా తగ్గించుకున్నా ఈ నెలలో అప్పు చేయక తప్పడం లేదు. ఫీజును మూడు కంతుల్లో చెల్లించడానికి అవకాశం ఉన్నా, తొలి కంతులో సగం చెల్లించాలి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. ఏ స్కూలు మంచిది.. ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాల ప్రాంగణాలు విద్యార్థుల తల్లిదండ్రులతో కిటకిటలాడుతున్నాయి. పిల్లలను ఏ పాఠశాలలో చేర్చాలనేది తల్లితండ్రులకు ప్రస్తుతం ఎదురవుతున్న ప్రథమ పరీక్ష. అందమైన హోర్డింగులు, రంగు రంగుల కరపత్రాలతో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల వారు ఆకర్షిస్తున్నారు. వీటిలో నిపుణులైన అధ్యాపకులు ఉన్నారనే విషయాన్ని నిర్ధారించే వారెవరూ ఉండరు. ఆయా పాఠశాలల యాజమాన్యాలు చెప్పింది నమ్మడం తప్ప మరో మార్గం లేదు. ఏ పాఠశాలలో అయినా వాస్తవంగా సైన్స్, మ్యాథ్స్, ఆంగ్లంపై ఎక్కువగా దృష్టి సారించాలి. అయితే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని గమనించి చాలా పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్ మెథడ్ అంటూ తెరపైకి తెచ్చాయి. ఈ సెక్షన్లో అయితేనే సైన్సు, మ్యాథ్స్‌పై మంచి పట్టు వస్తుందని, ఇంజనీరింగ్/మెడిసిన్‌లో సీటు సాధించాలంటే ఇక్కడ చేర్చక తప్పదని నొక్కి చెబుతుండటంతో తల్లిదండ్రులు అప్పులు చేయడానికి వెనుకాడటం లేదు. కాన్సెప్ట్, ఐఐటి, ఇంటర్ నేషనల్ ఒలంపియాడ్, టెక్నో, ఈ టెక్నో, లెర్నింగ్, స్మార్ట్ ఇలా కొత్త పేర్లు అర్థం కాక.. ఏది మంచిదో తేల్చుకోలేక పలువురు స్కూల్ పీఆర్వోల మాయాజాలానికి బలవుతున్నారు. సౌకర్యాలు దయనీయం పలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం గురించి ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. ఈ చట్టం ప్రకారం కొన్ని సీట్లు పేద పిల్లలతోపాటు ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ఇవ్వాల్సి ఉండగా అలాంటిది ఎక్కడా అమలు కావడం లేదు. ఇక సౌకర్యాల విషయానికొస్తే.. వారు బ్రోచర్లో చూపించినంతగా లోపలుండదు. వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు సరిపడా మరుగు దొడ్లు ఉండవు. ఒక్కో ఫ్లోర్‌కు ఒకటి.. రెండు ఉన్నా వాటి నిర్వహణ ఘోరంగా ఉంటోంది. మరికొన్ని పాఠశాలల్లో గాలి వెలుతురు లేని దుస్థితి ఉంది. ఫీజులను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయాలి. పాఠశాలలో తరగతి ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఫీజుల నియంత్రణ కు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అవి ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చర్యలు ప్రభుత్వం నిర్ణయిం చిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. అప్పటికీ మారకపోతే ఆయా పాఠశాలలకు సంబంధించిన గుర్తింపును రద్దు చేస్తాం. - బండ్లపల్లె పత్రాప్‌రెడ్డి,జిల్లా విద్యాశాకాధికారి. -
క్రీడలతోనే కీర్తి
కంబాలపాడు(కృష్ణగిరి): క్రీడలతోనే దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కృష్ణగిరి మండలం కంబాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలుర సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్ విజయమోహన్, డీఈఓ సుప్రకాశ్, మాజీ మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కేఈ జయన్నతో కలసి ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశాక, శాంతి కపోతాలు ఎగురవేశారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు మార్కులు, ర్యాంక్‌ల కోసమే పోటీ పడటం చూస్తున్నామని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కృష్ణగిరి మండలంలో త్వరలో జూనియర్ కళశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి చదువు, క్రీడలు రెండు కళ్లులాంటివని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కలిగి ఉన్నారని వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపడతామని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ప్రతి మండలంలో రూ.2.5 కోట్లతో మినీ స్టేడియాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సెంట్రల్‌జోన్ పోటీల వైస్ ప్రసిడెంట్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వేశ్వరయ్య, పోటీలకు నిర్వహణకు కృషిచేస్తున్న కేఈ జయనన్న పలువురు అభినందించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ సుంకులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలు కేఈ సుభాషిణి, సర్పంచ్ కేఈ చెన్నయ్య, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ పేరుతో.. లైంగిక వేధింపులు!!
-
విద్యార్థి మృతిపై జ్యుడిషియల్ విచారణ చేయాలి
తిరుపతి గాంధీరోడ్డు : తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఇటీవల విద్యార్థి మోహన్‌కృష్ణారెడ్డి మృతి చెందడంపై జ్యుడిషియల్ విచారణ చేయాలని తిరుపతి ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం మోహన్‌కృష్ణ కుటుంబసభ్యులను ఆ యన పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇటీవల విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు. కనీసవసతులు కూడా లేకుండా పాఠశాల ఎందుకు నడుపుతున్నారని ప్రశ్నించారు. విద్యార్థి మృతి చెంది పది రోజులు దాటినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ చేసి విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు. యాజమాన్యంకు ఏమీ సంబంధం లేకుంటే సంఘటన స్థలంలో సాక్ష్యాలను ఎందుకు భద్రపరచలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు జగదీష్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
స్కూలు బస్సుకు తప్పిన ప్రమాదం
పిల్లలతో వస్తుండగా ఊడిన టైర్లు 48 మంది విద్యార్థులు క్షేమం జగ్గయ్యపేట: ఓ కార్పొరేట్ పాఠశాలకు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. విద్యార్థులతో వస్తుండగా మార్గమథ్యంలో వెనుకనున్న ఒకపక్క టైర్లు ఊడిపోయాయి. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన ఈ బస్సు శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కొన్ని గ్రామాలు, పేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన 48 మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్‌కు వస్తోంది. పేట మండలం రామచంద్రునిపేటకు వచ్చాక బస్సు పెద్దశబ్దం వచ్చి ఆగిపోయింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెంది కేకలు వేశారు. డ్రైవర్, క్లీనర్ కిందకు దిగి చూడగా, బస్సు వెనుకవైపు టైర్లు ఊడిపోయాయి. గ్రామస్తులు స్పందించి పిల్లలను బస్సులో నుంచి కిందకు దించారు. వారికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
అడిగేవారే లేరు
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ పూర్తి స్థాయిలో టెక్నో, ఈ టెక్నో పేర్లను తొలగించని ైవె నం ప్రభుత్వ ఆదేశాలు...నిబంధనలు బుట్టదాఖలు చేష్టలుడిగిన విద్యాశాఖ ‘‘మా పిల్లాడిని ఓ ప్రైవేటు స్కూల్లో ఎల్కేజీలో చేర్పించేందుకు ఓ కార్పొరేట్ స్కూలుకు వెళ్లా. ట్యూషన్ ఫీజు 15వేలు అడిగారు. ఫీజుతో చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. యూనిఫాం..బుక్స్, బూట్లు...బస్సుకు కలిపితే మళ్లీ అంతవుతుంది. అసలు ఫీజుతో పాటు కొసరు ఖర్చు కూడా తడిసిమోపెడవుతోంది. పిల్లాడు బాగా చదువుతాడని ఇక్కడ చదివించాలనుకుంటే ఏడాదికి అయ్యే ఖర్చును చూస్తే భయమేస్తోంది. ప్రైవేటు చదువులు ఇలాగే ఉంటాయేమో!’’ -సగటు మనిషి ఆవేదన ‘‘ఎంత ప్రైవేటు పాఠశాలలైనా వాటికీ కొన్ని హద్దులుం టాయి. ఆ ఫీజులకూ ఒక పరిమితి ఉంటుంది. పదో తరగతికి 35వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి వస్తోంది. పైన మరో 15-20 వేల రూపాయలు భరించాలి. స్కూల్లో పిల్లోడికి అయ్యే ఖర్చు మా పక్కింట్లో ఇంజనీరింగ్ పిల్లోడి చదువు ఖర్చుకు దాదాపు సమానంగా ఉంటోంది. పుస్తకాలకు రూ.4,800 తీసుకున్నారు. బయట కొంటే అన్నీ 2,500 రూపాయలే అవుతున్నాయి. కానీ తప్పదు. వాళ్లవద్దే కొనాలట! ఫీజులతో పాటు మరీ ఇలాంటి దోపిడీ అయితే ఎలా! విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు.’’ -పదో తరగతి విద్యార్థి తండ్రి. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీకి అడ్డులేకుండా పోయింది. కాన్సెప్ట్, ఐఐటీ, టెక్నో, ఈ-టెక్నో, స్మార్ట్టెక్నో, టాలెంట్, ఒలంపియాడ్, సీబీఎస్...తదితర పేర్లు బోర్డులపై నుంచి ప్రభుత్వం తొల గించగలిగింది. కానీ ఫీజులపై నియంత్రణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలంటే సగటు మనిషి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూస్తోంది. దీంతో ప్రభుత్వం రూపొందించిన ఫీజుల నియంత్రణ జీవోలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇవీ నిబంధనలు: ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం 2008లో జీవో నంబర్ 90,91,92లను జారీ చేసింది. వీటి ప్రకారం...పదో తరగతి విద్యార్థికి కార్పొరేషన్లో 15వేలు, మునిసిపాలిటీలో 12వేలు, మిగిలిన ప్రాంతాల్లో అయితే 10వేల రూపాయల లోపు మాత్రమే వసూలు చేయాలి. అంతకు మించి ఒక్క రూపాయి వసూలు చేయకూడదు. కానీ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఎక్కడా ఇది అమలు కావడం లేదు. ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు ? ఎంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు? పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలేంటి? తదితర అన్ని అంశాలను తల్లిదండ్రుల సౌకర్యార్థం బోర్డులో ప్రదర్శించాలి. వసూలు చేస్తున్న ఫీజు మొత్తానికి రశీదు ఇవ్వాలి. ప్రైవేటు ఫీజుల నియంత్రణ కోసం జిల్లా స్థాయిలో నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో డీఈవో, రాజీవ్ విద్యామిషన్ పీవో, అకడమిక్ మానిటరింగ్ అధికారి, మరో అధికారి సభ్యులుగా ఉంటారు. వీరు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి వాటి స్థితిగతులను నిశితంగా పరిశీలించి ఆపై ఏయే పాఠశాలలు ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చో నిర్ధారించాలి. తర్వాత కూడా ఈ కమిటీ ఎప్పటికప్పుడు నిఘా పెట్టి పర్యవేక్షిస్తుండాలి. ప్రతిపాదనల అమలేదీ? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపై అధ్యయనం చేయడానికి ఐఏఎస్ అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఏ పాఠశాలలో ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ప్రాంతాల వారీగా ఈ కమిటీ పరిశీలించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. పాఠశాలల్లో మౌళిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పాఠశాలలను మూడు కేటగిరీలుగా విభజించింది. గరిష్టంగా ఫీజు 30వేలు ఉండవచ్చని ఆ కమిటీ సిఫార్సు చేసింది. కానీ కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్లడంతో ఈ సిఫార్సులకు బ్రేక్ పడింది. దీంతో పాత ఫీజు నిబంధనే అమల్లో ఉంది. చాలా స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో 2.5-3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో కలిపి ఏటా 25 వేల మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందుతున్నారు. అనధికారికంగా నడుస్తున్న పాఠశాలల్లోనూ వేల సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. వీరి నుంచి ఫీజుల రూపంలో ఏటా ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో లెక్కలేకుండా పోయింది. ఎంత ఘోరం : తిరుపతిలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థికి ట్యూషన్ ఫీజు *15వేలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థికి 35 వేలు తీసుకుంటున్నారు.చిత్తూరు, తిరుపతిలో సెంట్రల్ సిలబస్‌ను బోధించే కొ న్ని బడా పాఠశాలల్లో దిమ్మతిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్సుకు అదనంగా చెల్లించాల్సిందే!ఆర్భాటంగా ప్రచారం సాగిస్తున్న ఈ పాఠశాలలు, సౌకర్యాల కల్పనను మాత్రం పట్టించుకోవు. సిలబస్, ఫ్యాకల్టీ విషయంలోనూ పెద్ద వ్యత్యాసం ఉండడం లేదు.కార్పొరేట్ పాఠశాలల్లో అడ్మిషన్ ఫీజు వసూలు చేయరాదు. ట్యూషన్ ఫీజు రూపంలో కొంత, అడ్మిషన్ ఫీజు పేరుతో కొంత వసూలు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులు, బ్యాగు, క్యారేజీ, బూట్లు, సాక్సులు, ఆటో లేదా పాఠశాల బస్సు తదితర అవసరాలకు అదనంగా మరింత ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. పై పాఠశాలల్లో ప్రతి తరగతికి కనీసం 3-5వేల రూపాయలు అదనంగా ఖర్చవుతుంది. ఏం జరుగుతోంది? ఫీజుల నియంత్రణకు జారీ అరుున మూడు జీవోలు ఎక్కడా అమలు కావడంలేదు.నగర పరిధిలో ఉన్న పాఠశాలల్లో గరిష్టంగా వసూలు చేయాల్సిన 15వేల ట్యూషన్ ఫీజు కంటే మూడు రెట్లు అధికంగా గుంజుతున్నారు. కొత్తగా ఎవరైనా పాఠశాలలో చేరితే 5-10వేల రూపాయల వరకూ ప్రత్యేకించి అడ్మిషన్ఫీజు(ప్రవేశ రుసుం) వసూలు చేస్తున్నారు. ఈ మొత్తానికి రశీదు ఇచ్చినా దీనికి ట్యూషన్ ఫీజుతో సంబంధం లేదు.ట్యూషన్ ఫీజును నెలవారీగా కానీ, మూడు నెలలకోసారి కానీ చెల్లించుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రతీ పాఠశాలకు విద్యా సొసైటీ ఉంటుంది. దీని ఆధ్వర్యంలోనే పాఠశాల నిర్వహణ, ఫీజుల వసూళ్లు, లెక్కలు రాయడం, ఆడిట్ చేయించడం, మినిట్స్ నమోదు తదితర కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. పాఠశాలలు నిర్వహించేవారు, విద్యా సొసైటీలో కార్యవర్గ సభ్యులు ఒకరే కావడం వల్ల సర్దుబాట్లుకు ఆస్కారం ఉంటుంది. ఎంత ఫీజు వసూలు చేసినా రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తాన్ని చూపిస్తుంటారు. ఆడిట్ అభ్యంతరాల నుంచి సులువుగా బయటపడుతుంటారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేసినట్లుగా చెబుతున్నా.. ఫీజుల దోపిడీని నివారించలేకపోతున్నారు. అధిక ఫీజులపై ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా విద్యాశాఖ ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. తల్లిదండ్రులు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడం లేదు. ప్రైవేటు ఫీజుల దందాపై ఇంత వరకూ ఏ పాఠశాలపైనా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ‘జూన్’...ఇది ఓ ‘చదివింపుల’ మాసం..! జూన్ వచ్చిందంటే చాలు తల్లిదండ్రుల్లో దడ...విద్యార్థులకు ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, తదితర అన్నిటి కోసం భారీగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం పుస్తకాలు ఫీజులు తదితర ఖర్చులన్నీ కలిపితే ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి(ఎల్కేజీ-10) సగటున 30 వేల రూపాయల ఖర్చవుతుంది. జిల్లాలో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు 875 కోట్ల రూపాయలు అవుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దుస్తులు, నోట్ పుస్తకాలు తదితర ఖర్చులకు ఒక్కొక్కరికి 5-7వేల రూపాయల ఖర్చు యినా జిల్లాలోని 2.43లక్షల మందికి మరో 15 కోట్ల రూపాయల వరకూ ఖర్చవుతుంది. అంటే జూన్‌లో చదువుల కోసం తల్లిదండ్రులపై 890 కోట్ల రూపాయల భారం పడనుంది. -
చదువుకొనలేం!
చదువు అంగట్లో సరుకైంది. ఒక్కో స్కూలులో ఒక్కో క్లాసుకు ఒక్కో ధర నిర్ణయించి జోరుగా వ్యాపారం చేస్తున్నారు. ఊరూరా వెలిసిన ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పోటాపోటీగా విద్యావ్యాపారం చేస్తున్నా విద్యాశాఖాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వేల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నా నియంత్రించాలనే కనీస ప్రయత్నం కూడా సదరు అధికారులు చేయడం లేదు. వెరసి విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజుల భారం మోయక తప్పడం లేదు. ‘మా పిల్లాడిని ఎల్కేజీలో చేర్పించేందుకు ఓ కార్పొరేట్ స్కూలుకు వెళ్లా. ట్యూషన్ ఫీజు రూ.15వేలు అడుగుతున్నారు. ఫీజుతో చదువు పూర్తయ్యే పరిస్థితి లేదు. యూనిఫాం..బుక్స్, బూట్లు...బస్సుకు కలిపితే తిరిగి అంతవుతోంది. అసలు ఫీజుతో పాటు కొసరు ఖర్చు కలిపి తడిసిమోపెడవుతోంది. పిల్లోడు బాగా చదువుతాడని ఇక్కడ చదివించాలనుకుంటే ఇక్కడి ఖర్చు చూస్తేనే భయమేస్తోంది. చదువుకునే రోజులుపోయి చదువుకొనే రోజులొచ్చాయంటే ఇదేనేమో!’ ఇదీ ఓ సగటు మనిషి ఆవేదన సాక్షి ప్రతినిధి,కడప: జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దందాకు అడ్డులేకుండా పోయింది. నిబంధనలు తుంగలో తొక్కు తూ.. ఫీజుల నియంత్రణ జీవోలు కాగితాలకే పరిమితం చేస్తూ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు పిల్లల తల్లిదండ్రులను నిలువునా దోచేస్తున్నాయి. కాన్సెప్ట్, ఐఐటీ, ఈ టెక్నో, ఆ టెక్నో అంటూ ఫీ‘జులుం’ ప్రదర్శిస్తున్నాయి. ఈ దందాను అడ్డుకోవాల్సిన విద్యాశాఖ చోద్యం చూస్తోంది. ఎంత దారుణం... కడపలోని ఓకార్పొరేట్ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థికి ట్యూషన్ ఫీజు రూ. 15వేలు తీసుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థికి రూ. 35 వేలు తీసుకుంటున్నారు. అలాగే నగరంలో సెంట్రల్ సిలబస్‌ను బోధించే రెండు బడా పాఠశాలలో దిమ్మతిరిగే ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇందులో ఓ స్కూలులో 1-4 వరకూ 46వేలు, 5-10 వరకూ రూ. 76వేలు ఫీజు వసూలు చేస్తున్నారు. బస్సు కావాలంటే అదనంగా చెల్లించాల్సిందే! వడ్డింపు.. అదనం ఫీజులతో కాకుండా పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆటో లేదా పాఠశాల బస్సు తదితర అవసరాలకు అదనంగా మరింత ఖర్చవుతుంది. ఈ మొత్తాన్ని కలుపుకుంటే ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని ప్రైవేటు పాఠశాలలకు టెక్నో, ఈ టెక్నో తదితర తోకలను విద్యాశాఖ అధికారులు కత్తిరించినా.. ఇంకా కొన్ని ఉన్నాయి. పైగా పత్రికలు, టీవీ, కరపత్రాల ప్రకటనల్లో పాత పేర్లతోనే పబ్లిసిటీ సాగిస్తున్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ‘ఆదర్శ’ విద్య
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని రాష్ట్రీయ మాధ్యమిక, శిక్షాభియాన్ డీఓ సుబ్బారావు అన్నారు. మంగళవారం 16 మండలాల్లోని మోడల్ స్కూల్‌కు ఎంపిక నిర్వహించగా బుధవారం మరో 16 మండ లాల్లో విద్యార్థుల ఎంపిక పూర్తి చేశారు. పెద్దపాడు సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగింది. ఉదయం డోన్, గోస్పాడు, కొలిమిగుండ్ల, కృష్ణగిరి, అవుకు, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, బండి ఆత్మకూరు, జూపాడుబంగ్లా, శ్రీశైలం మండలాలకు లాటరీ నిర్వహించారు. ప్రతి మండలానికి 80 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేశారు. మధ్యాహ్నం గడివేముల, పాములపాడు, పాణ్యం, రుద్రవరం, శిరివెళ్ల, వెలుగోడు మండలాలకు ఎంపిక ప్రక్రియ జరిగింది. కౌన్సెలింగ్ పూర్తయిన అనంతరం ఆర్‌ఎంఎస్‌ఏ డీఓ సుబ్బారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మోడల్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లలో పోటీ పడతాయని తెలిపారు. మోడల్ స్కూళ్లలో సమస్యలు తీర్చని అధికారులు మోడల్ స్కూళ్లకు విద్యార్థులను ఎంపిక చేస్తున్న అధికార యంత్రాంగం వాటిలో వసతులు, సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆదర్శ స్కూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో మొత్తం 32 స్కూళ్లుండగా ఒక్క స్కూలుకు కూడా హాస్టల్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంది. అయితే ఏ పాటశాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ స్కూలుకు ప్రహరీ సౌకర్యం లేకపోవడంతో భద్రత కొరవడింది. కార్పొరేట్ విద్యను అందిస్తామని చెబుతన్న అధికారులు ఏ స్కూల్లో కూడా కంప్యూటర్లను ఏర్పాటు చేయలేదు. తాగునీటి వసతిని కల్పించలేదు.