కంబాలపాడు(కృష్ణగిరి): క్రీడలతోనే దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కృష్ణగిరి మండలం కంబాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలుర సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్ విజయమోహన్, డీఈఓ సుప్రకాశ్, మాజీ మంత్రి ఎన్‌ఎమ్‌డీ ఫరూక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కేఈ జయన్నతో కలసి ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశాక, శాంతి కపోతాలు ఎగురవేశారు.
అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు మార్కులు, ర్యాంక్‌ల కోసమే పోటీ పడటం చూస్తున్నామని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కృష్ణగిరి మండలంలో త్వరలో జూనియర్ కళశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రతి విద్యార్థికి చదువు, క్రీడలు రెండు కళ్లులాంటివని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కలిగి ఉన్నారని వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపడతామని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ప్రతి మండలంలో రూ.2.5 కోట్లతో మినీ స్టేడియాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు.
సెంట్రల్‌జోన్ పోటీల వైస్ ప్రసిడెంట్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వేశ్వరయ్య, పోటీలకు నిర్వహణకు కృషిచేస్తున్న కేఈ జయనన్న పలువురు అభినందించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ సుంకులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలు కేఈ సుభాషిణి, సర్పంచ్ కేఈ చెన్నయ్య, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
క్రీడలతోనే కీర్తి
Published Mon, Dec 29 2014 2:52 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement