K.E Krishna Murthy
-
నవ వసంతం.. శుభ సంకల్పం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): కొత్త ఏడాది.. నవ్యాంధ్ర నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేద్దామనే శుభ సంకల్పంతో అందరూ ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకలను డిప్యూటీ సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినా తెలుగుతల్లి మనదేనన్నారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఈ సంవత్సరం ఆహ్వానం పలుకుతూ ప్రతిఒక్కరు శ్రమించాలన్నారు. ప్రభుత్వోద్యోగులు సహనం కోల్పోకుండా నిరంతరం శ్రమిస్తేనే నవ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఎలా ఉన్నాయో అదే రీతిలో జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాల్లో రైతులు మూడు పంటలు పండించేందుకు అవసరమైన సాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ.. జిల్లాను ఆర్థిక రాజధానిగా మార్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టామన్నారు. ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. మన్మథ నామ సంవత్సరంలో చేస్తున్న ప్రయత్నాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లి ఫ్యాక్షన్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు. స్వచ్ఛాంధ్రలో భాగంగా దత్తత తీసుకున్న కప్పట్రాళ్ల గ్రామాన్ని వచ్చే ఆరు నెలలో భారీగా అభివృద్ధిపరచి ఫ్యాక్షన్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. జెడ్పీ ఛైర్మన్ మల్లెల రాజశేఖర్, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌లు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెల్పుతూ ఉగాది సందేశాన్ని ఇచ్చారు. అంతకు ముందు మంగళ వాయిద్యాలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కొలనుభారతి ఆస్థాన విద్యాంసుడు శశిభూషణ్ సిద్ధాంతి పంచాంగ పఠనం చేశారు. కవిసమ్మేళనంలో భాగంగా ఎలమర్తి రమణయ్య, పార్వతీదేవి, నొస్సం నరసింహాచారి, ఇల్లూరి నాగరత్నం శెట్టి, కేబీఎస్ కుమార్, మద్దూరి రామ్మూర్తి, హయగ్రీవాచార్యులు, ఎం.శాంతమ్మలు తమ కవితలను వినిపించారు. ఉగాది పర్వదిన వైశిష్ఠ్యాన్ని, ప్రాముఖ్యతను నొస్సం నరసింహాచారి తెలియజేశారు. అనంతరం సాహిత్యం, సంగీతం, నాట్యం, పరిశోధన, సామాజిక సేవలు వంటి వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన పి.బి.పి.శ్రీనివాస్, విజయలక్ష్మి, హీరాలాల్, పోతన, మద్దయ్య, కృష్ణమూర్తి, గురుస్వామి, డాక్టర్ రంగయ్య, డాక్టర్ కె.భాస్కర్‌రెడ్డి, జె.ఎస్.ఆర్.కె.శర్మ, మధుర భారతుల సుబ్రహ్మణ్యంలను సన్మానించారు. వేడుకల్లో కలెక్టర్ సతీమణి సత్యరేఖ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శమంతకమణి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ వి.వి.ఎస్.మూర్తి, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితర జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. సునయన ఆడిటోరియంలోని వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన బృంద నృత్యాలు కనువిందు చేశాయి. కూచిపూడి నృత్యం ద్వారా నృత్యజ్యోతి నృత్యశాల విద్యార్థినులు ప్రేక్షకులను అలరింపజేశారు. గణేశ పంచరత్నానికి చక్కటి నృత్య అభినయం చేశారు. ఇదే సంస్థకు చెందిన సంక్రాంతి వచ్చింది తుమ్మెదా అంటూ చేసిన నృత్యాలు కూడా ఆకట్టుకున్నాయి. శారదా సంగీత కళాశాల విద్యార్థినులు ఓహో.. ఓహో.. వసంతమా.. అంటూ ప్రదర్శించిన నృత్యం ప్రేక్షకులు దృష్టి మరల్చకుండా చేసింది. అలాగే అబ్బా వాడే.. ఎంత చక్కనోడే అనే నృత్యాన్ని అదే కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు చక్కగా ప్రదర్శించారు. -
క్రీడలతోనే కీర్తి
కంబాలపాడు(కృష్ణగిరి): క్రీడలతోనే దేశానికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. కృష్ణగిరి మండలం కంబాలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలుర సెంట్రల్ జోన్ క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కలెక్టర్ విజయమోహన్, డీఈఓ సుప్రకాశ్, మాజీ మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కేఈ జయన్నతో కలసి ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశాక, శాంతి కపోతాలు ఎగురవేశారు. అనంతరం క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు మార్కులు, ర్యాంక్‌ల కోసమే పోటీ పడటం చూస్తున్నామని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కృష్ణగిరి మండలంలో త్వరలో జూనియర్ కళశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి చదువు, క్రీడలు రెండు కళ్లులాంటివని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది విద్యార్థులు ప్రతిభ కలిగి ఉన్నారని వారిలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఓ బృహత్తర కార్యక్రమం చేపడతామని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ప్రతి మండలంలో రూ.2.5 కోట్లతో మినీ స్టేడియాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సెంట్రల్‌జోన్ పోటీల వైస్ ప్రసిడెంట్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విశ్వేశ్వరయ్య, పోటీలకు నిర్వహణకు కృషిచేస్తున్న కేఈ జయనన్న పలువురు అభినందించారు. జెడ్పీ సీఈఓ ఈశ్వర్, జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ సుంకులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మిదేవి, ఉపాధ్యక్షురాలు కేఈ సుభాషిణి, సర్పంచ్ కేఈ చెన్నయ్య, మండల స్థాయి అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎంను కలిసిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు
చినగంజాం: ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ రాష్ర్ట కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎంగా పదవిని చేపట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుఛ్చాన్ని అందించారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఆంధ్ర కబడ్డీ చైర్మన్ పర్వతరెడ్డి శ్రీధర్ ఆనంద్, కార్యదర్శి వీర్లంకయ్య, ట్రెజరర్ రంగారావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి శిఖరం రాంబాబు, తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ కోచ్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైస్ ప్రసిడెంట్ అంజిరెడ్డి, కృష్ణాజిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఆఫీస్ బేరర్స్ తదితరులున్నారు. -
పెద్దన్నపైనే ఆశలు!
రాయలేలిన రతనాల సీమ రాళ్లు తేలింది. చినుకు పడితే వరద భయం వెంటాడుతోంది. తాగునీటి కోసం గొంతెండుతోంది. ఛిద్రమైన రహదారుల్లో ప్రయాణం నరకప్రాయమవుతోంది. సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితమైంది. రైతన్న గోడు అరణ్యరోదన అవుతోంది. పెద్దన్నా.. ఇక నీపైనే భారం. సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా గుర్తింపు పొందిన టీడీపీ నేత కె.ఈ.కృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కనబర్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కేఈని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇదే సమయంలో రెవెన్యూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విభజనానంతరం అభివృద్ధిపై నెలకొన్న అపోహలను తొలగించి కర్నూలును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే బాధ్యతను భుజానికెత్తుకోవాలని కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం కేఈ తొలిసారిగా నేడు కర్నూలులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పురోభివృద్ధికి ఆయన ఎలాంటి చర్యలు చేపడతారో.. కొండలా పేరుకుపోయిన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతారోననే చర్చ జరుగుతోంది. ఒక్కసారి జిల్లాలో పాలన తీరుతెన్నులను పరిశీలిస్తే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన విత్తనాలు ఇప్పటికీ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పంటగా సాగు చేస్తున్న వేరుశనగకు సంబంధించి సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 40వేల క్వింటాళ్ల విత్తనం మాత్రమే మంజూరైంది. జూన్ నెల సగం గడిచిపోయినా సరఫరా ప్రణాళికలో 20 శాతం ఎరువులు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఇదే అదనుగా డీలర్లు బ్లాక్ విక్రయాలకు తెరతీశారు. రుణ మాఫీపై టీడీపీ చేస్తున్న కాలయాపనతో బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇకపోతే రహదారులు ఛిద్రం కావడంతో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు-బళ్లారి రోడ్డు పేరెత్తితే ప్రయాణికులు వణికిపోతున్నారు. నాయకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా రహదారి విస్తరణ అటకెక్కింది. ఉపాధి నిధులతో గ్రామ పంచాయతీల్లోని ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరైనా పనుల్లో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అదేవిధంగా సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమార్కుల చేతివాటం వృద్ధులు, వికలాంగులకు నిరాశ మిగులుస్తోంది. స్మార్ట్ కార్డు లేవనే కారణంతో జిల్లాలో 60వేల వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు నిలిపేయడంతో ఆసరా కరువైన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అభయహస్తం పథకం కింద 1.70 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినా.. 18వేల మందికే ప్రయోజనం చేకూర్చడం విమర్శలకు తావిస్తోంది. తాగునీటికీ కటకటే... జిల్లాలోని 165 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. 48 వాటర్ స్కీంలలో అత్యధికం నిరుపయోగమే. ప్రజలకు శుద్ధి చేసిన నీటి సరఫరా రికార్డులకే పరిమితమైంది. సీపీడబ్లూ స్కీంల ద్వారా మంచినీరు కొన్ని గ్రామాలకు మాత్రమే అందుతోంది. మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతున్న పల్లెల్లో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. ఫ్లోరైడ్ నీటితో చాలా పల్లెల్లో చిన్న వయస్సులోనే యువకులు సైతం వికలాంగులుగా మారిపోతున్నారు. నిర్లక్ష్యం పారుతోంది... తెలుగుగంగ, శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్, గాలేరు-నగరి, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లోపించింది. 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు సాగునీరు.. చెన్నైకి తాగు నీరు అందిస్తున్న ప్రధాన కాలువ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు, 16 మండలాల పరిధిలోని 194 గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాల్సి ఉంది. కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటా నీరు అందక ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతోంది. శ్రీశైలం కుడి గట్టు కాలువ కర్నూలు, కడప జిల్లాలకు వరప్రదాయిని. కాలువ పూర్తయితే 10 మండలాల్లో 200 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే కాలువ కాంక్రీట్ పనులు పూర్తి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కాల్వ నుంచి గోరుకల్లు ప్రాజెక్టులోకి నీటిని పంపే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ పూర్తి కాలేదు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ఫేజ్-1 పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి పనులు ఎనిమిదేళ్లు దాటిన ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం. మూడు రోజులు జిల్లాలో పర్యటన కర్నూలు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు కర్నూలుకు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 4.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపుగా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు. 17వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో అతిథిగృహంలో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు కర్నూలు నుంచి రోడ్డు మార్గంలో 1.30 గంటలకు డోన్ చేరుకుంటారు. 4 గంటలకు పంచాయతీరాజ్ ప్రభుత్వ అతిథిగృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 5.30 గంటలకు తిరిగి కర్నూలుకు చేరుకుంటారు. 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధిపై చర్చించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం ఓఎస్డీ ఎం.గోపాలం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీకి పర్యటన వివరాలు అందాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో కేఈ మొదటిసారి జిల్లా పర్యటనకు వస్తున్నందున జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టారు.