పెద్దన్నపైనే ఆశలు!
రాయలేలిన రతనాల సీమ రాళ్లు తేలింది. చినుకు పడితే వరద భయం వెంటాడుతోంది. తాగునీటి కోసం గొంతెండుతోంది. ఛిద్రమైన రహదారుల్లో ప్రయాణం నరకప్రాయమవుతోంది. సంక్షేమ పథకాల అమలు కాగితాలకే పరిమితమైంది. రైతన్న గోడు అరణ్యరోదన అవుతోంది. పెద్దన్నా.. ఇక నీపైనే భారం.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లా రాజకీయాల్లో పెద్దాయనగా గుర్తింపు పొందిన టీడీపీ నేత కె.ఈ.కృష్ణమూర్తి రాష్ట్ర రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కనబర్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అరుదైన గౌరవం ఆయన సొంతమైంది. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగిన కేఈని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇదే సమయంలో రెవెన్యూ.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విభజనానంతరం అభివృద్ధిపై నెలకొన్న అపోహలను తొలగించి కర్నూలును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపే బాధ్యతను భుజానికెత్తుకోవాలని కోరుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం కేఈ తొలిసారిగా నేడు కర్నూలులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పురోభివృద్ధికి ఆయన ఎలాంటి చర్యలు చేపడతారో.. కొండలా పేరుకుపోయిన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతారోననే చర్చ జరుగుతోంది. ఒక్కసారి జిల్లాలో పాలన తీరుతెన్నులను పరిశీలిస్తే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన విత్తనాలు ఇప్పటికీ అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన పంటగా సాగు చేస్తున్న వేరుశనగకు సంబంధించి సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 40వేల క్వింటాళ్ల విత్తనం మాత్రమే మంజూరైంది. జూన్ నెల సగం గడిచిపోయినా సరఫరా ప్రణాళికలో 20 శాతం ఎరువులు కూడా జిల్లాకు చేరని పరిస్థితి. ఇదే అదనుగా డీలర్లు బ్లాక్ విక్రయాలకు తెరతీశారు. రుణ మాఫీపై టీడీపీ చేస్తున్న కాలయాపనతో బ్యాంకుల్లో కొత్త రుణాలు అందక పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇకపోతే రహదారులు ఛిద్రం కావడంతో ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు-బళ్లారి రోడ్డు పేరెత్తితే ప్రయాణికులు వణికిపోతున్నారు. నాయకుల కమీషన్ల కక్కుర్తి కారణంగా రహదారి విస్తరణ అటకెక్కింది.
ఉపాధి నిధులతో గ్రామ పంచాయతీల్లోని ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరైనా పనుల్లో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. అదేవిధంగా సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమార్కుల చేతివాటం వృద్ధులు, వికలాంగులకు నిరాశ మిగులుస్తోంది. స్మార్ట్ కార్డు లేవనే కారణంతో జిల్లాలో 60వేల వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు నిలిపేయడంతో ఆసరా కరువైన బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అభయహస్తం పథకం కింద 1.70 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించినా.. 18వేల మందికే ప్రయోజనం చేకూర్చడం విమర్శలకు తావిస్తోంది.
తాగునీటికీ కటకటే...
జిల్లాలోని 165 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. 48 వాటర్ స్కీంలలో అత్యధికం నిరుపయోగమే. ప్రజలకు శుద్ధి చేసిన నీటి సరఫరా రికార్డులకే పరిమితమైంది. సీపీడబ్లూ స్కీంల ద్వారా మంచినీరు కొన్ని గ్రామాలకు మాత్రమే అందుతోంది. మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతున్న పల్లెల్లో ప్రజల ఇక్కట్లు వర్ణనాతీతం. ఫ్లోరైడ్ నీటితో చాలా పల్లెల్లో చిన్న వయస్సులోనే యువకులు సైతం వికలాంగులుగా మారిపోతున్నారు.
నిర్లక్ష్యం పారుతోంది...
తెలుగుగంగ, శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్, గాలేరు-నగరి, తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పనుల్లో పురోగతి లోపించింది. 1983లో ప్రారంభమైన తెలుగుగంగ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుకు సాగునీరు.. చెన్నైకి తాగు నీరు అందిస్తున్న ప్రధాన కాలువ పూర్తి చేయడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా జిల్లాలో 1.51 లక్షల ఎకరాలకు, 16 మండలాల పరిధిలోని 194 గ్రామాలకు సాగు, తాగు నీరు అందించాల్సి ఉంది. కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటా నీరు అందక ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమవుతోంది.
శ్రీశైలం కుడి గట్టు కాలువ కర్నూలు, కడప జిల్లాలకు వరప్రదాయిని. కాలువ పూర్తయితే 10 మండలాల్లో 200 గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే కాలువ కాంక్రీట్ పనులు పూర్తి చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. అదేవిధంగా ప్రధాన కాల్వ నుంచి గోరుకల్లు ప్రాజెక్టులోకి నీటిని పంపే ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ పూర్తి కాలేదు. గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం ఫేజ్-1 పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీరు అందించే హంద్రీనీవా సుజల స్రవంతి పనులు ఎనిమిదేళ్లు దాటిన ఇప్పటికీ పూర్తి కాకపోవడం గమనార్హం.
మూడు రోజులు జిల్లాలో పర్యటన
కర్నూలు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మూడు రోజుల పర్యటనలో భాగంగా నేడు కర్నూలుకు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో 4.30 గంటలకు కర్నూలుకు చేరుకుంటారు. బళ్లారి చౌరస్తాలోని ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపుగా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారు.
17వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్‌తో పాటు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో అతిథిగృహంలో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు కర్నూలు నుంచి రోడ్డు మార్గంలో 1.30 గంటలకు డోన్ చేరుకుంటారు. 4 గంటలకు పంచాయతీరాజ్ ప్రభుత్వ అతిథిగృహంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. 5.30 గంటలకు తిరిగి కర్నూలుకు చేరుకుంటారు. 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమై అభివృద్ధిపై చర్చించనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం ఓఎస్‌డీ ఎం.గోపాలం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీకి పర్యటన వివరాలు అందాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో కేఈ మొదటిసారి జిల్లా పర్యటనకు వస్తున్నందున జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టారు.