పెద్దాయన ఉప ముఖ్యమంత్రి
పెద్దాయనకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సౌమ్యుడు, వివాద రహితునిగా పేరున్న సీనియర్ నాయకుడు, పత్తికొండ శాసనసభ్యుడు కె.ఈ.కృష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన కేఈ అంచెలంచెలుగా ఎదిగిన బీసీ నేతగా కీర్తి గడించారు. రైతు కుటుంబంలో జన్మించిన ఆయనకు అత్యున్నత పదవి దక్కడం పట్ల జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, కర్నూలు: డిప్యూటీ సీఎం పదవి పత్తికొండ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిని వరిచింది. ఇది జిల్లాకు దక్కిన అరుదైన అవకాశంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ ఒకటి 2014 వరకు గమనిస్తే ఐదుసార్లు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. వీరిలో ముగ్గురు తెలంగాణవారు. మరో ఇద్దరు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వంలో కర్నూలు జిల్లాను డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఆ పదవిని చేపట్టిన పత్తికొండ శాసనసభ్యులు కేఈ కృష్ణమూర్తి చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం సంపాదించినట్లయింది.
1956 నుంచి చరిత్రను చూసుకుంటే.. మొదట్లో కోవెలకుంట్లకు చెందిన బీవీ సుబ్బారెడ్డికి ఆ పదవి దక్కింది. ఆ తరువాత హైదరాబాద్‌కు చెందిన కేవీ రంగారెడ్డి(ఈయన పేరుపైనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది)కి, మెదక్ జిల్లాకు చెందిన సి.జగన్నాథరావుకు, కృష్ణా జిల్లాకు చెందిన కోనేరు రంగారావుకు, మొన్నటి ప్రభుత్వంలో దామోదర రాజనర్సింహకు డిప్యూటీ సీఎం అవకాశం వచ్చింది. ఇందులో కేవీ రంగారెడ్డి, సి.జగన్నాథరావు, దామోదర రాజనర్సింహ తెలంగాణ వారు. ప్రొటోకాల్‌లో ముఖ్యమంత్రి తరువాతి స్థానంలో ఉండే డిప్యూటీ సీఎం పదవి పరిపాలనాపరంగా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం తీసుకునే కీలకమైన నిర్ణయాల్లో డిప్యూటీ సీఎం పాత్ర ఉంటుంది.
అభినందనల వెల్లువ
కేఈ కృష్ణమూర్తికి డిప్యూటీ సీఎం పదవి రావడంతో జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీశ్రేణులు, అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగితేలారు. ఆయన ప్రమాణస్వీకారాన్ని టీవీల్లో తిలకిస్తూ ఎంతో సంతోషించారు. జిల్లా నుంచి ఆయనకు మంత్రిపదవి దక్కడం పట్ల అభినందనలు తెలియజేశారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ..
కర్నూలు, న్యూస్‌లైన్: రాజకీయాల్లో కేఈ కృష్ణమూర్తి అంచెలంచెలుగా ఎదిగారు. ఈయన 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. కోట్ల కుటుంబానికి దీటుగా నిలబడటంతోపాటు వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచిన దివంగత కె.ఇ.మాదన్న నుంచి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్నారు. 1978లో తొలిసారి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అనంతరం 1985లో టీడీపీ, 1989లో కాంగ్రెస్, 2009లో టీడీపీ నుంచి గెలుపొంది ప్రస్తుతం అదే పార్టీలోనే కొనసాగుతున్నారు. మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. మర్రిచెన్నారెడ్డి హయాంలో పార్లమెంటు కార్యదర్శిగా, 1980లోఅంజయ్య ప్రభుత్వంలో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా, అలాగే జిల్లాపరిషత్ చైర్మన్‌గా, 1985 నుంచి 1988 మధ్యలో ఎన్‌టీఆర్ ప్రభుత్వంలో భారీ తరహా నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
డోన్ నుంచి ఐదు పర్యాయాలు, పత్తికొండ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1999లో కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2013 జూన్ 3 నుంచి 2014 ఫిబ్రవరి 23 వరకు ప్రజాపద్దుల సంఘానికి(పీఏసీ) చైర్మన్‌గా పనిచేశారు. కేఈకి డిప్యూటీ సీఎం పదవి రావడంతో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం దక్కింది. వెనుకబడిన కర్నూలు జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రధాన బాధ్యత కేఈ పైన ఉంది. అలాగే జిల్లా టీడీపీలోనూ అందరినీ సమన్వయపరిచి.. పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడం .. ఆయనకు ముళ్ల కిరీటమే. పెనుసవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాల్సి ఉంటుంది.