నిఘా కళ్లు కప్పేశారు !
పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అడ్డదారులు తొక్కే కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్‌ల యాజమాన్యాలు చేస్తున్న మాస్‌కాపీయింగ్ విధానాన్ని అడ్డుకునేందుకు అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే 5 కేంద్రాల్లో మాత్రమే సీసీకెమెరాలను ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
మాస్‌కాపీయింగ్ వల్లే కొన్ని పాఠశాలల్లో ఎక్కువ ఉత్తీర్ణత సాధిస్తున్నారని అనేక పర్యాయాలు జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. అయితే కొంత మంది అవినీతి అధికారులను మేనేజ్ చేసి తమ విధానాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఏ పరీక్ష కేంద్రంలో కూడా సీసీకెమెరాలను ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొత్తం మీద ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు.