ఎందుకొచ్చారు.. మీ ప్లాన్ ఏంటి? | Why you came what is your plane? | Sakshi
Sakshi News home page

ఎందుకొచ్చారు.. మీ ప్లాన్ ఏంటి?

Published Tue, Jan 5 2016 1:12 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM

Why you came what is your plane?

 అమెరికా వెళ్లిన విద్యార్థులకు అధికారుల ప్రశ్నలు: వినయ్
 
 కోరుట్ల: ‘‘ముగ్గురు కలిసి ఎందుకు వచ్చారు? మీ ప్లాన్ ఏంటి? పికిల్స్(పచ్చళ్లు)లో ఏమున్నాయ్.. తిని చూపెట్టండి. మీ యూనివర్సిటీలు బోగస్.. మిమ్మల్ని తిప్పి పంపుతున్నామంటూ రెండ్రోజులపాటు ఓ గదిలో ఉంచారు. తినడానికి కూడా ఏమీ ఇవ్వకుండా తిప్పి పంపారు. మమ్మల్ని ఎక్కడికి పంపుతున్నారో కూడా తెలియదు. నెదర్లాండ్స్‌లో దిగి అక్కడి నుంచి కష్టమ్మీద ఢిల్లీ చేరుకున్నాం. మమ్ముల్ని నేరస్తులను చూసినట్లుగా చూశారు..’’ అని గోడు వెళ్లబోసుకున్నారు కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన సుతారి వినయ్(25). ఈ నెల 26న వినయ్‌తో పాటు పెద్దపల్లి, హైదరాబాద్‌కు చెందిన మరో ఇద్దరు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికా వెళ్లారు. 27న అట్లాంటా ఎయిర్‌పోర్టులో దిగగానే అక్కడి కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ టీం సభ్యులు వినయ్‌తో పాటు మరో తొమ్మిది మంది విద్యార్థుల లగేజీలు, పాస్‌పోర్టులు, వీసాలు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.

మూడు రౌండ్లుగా నాలుగు గంటల పాటు విద్యార్థులను ప్రశ్నించారు. ‘‘అమెరికాకు మీరు ముగ్గురు ఎందుకు కలిసి వచ్చారు.. ఇక్కడేం చేయడానికి వచ్చారు. మీ ప్లాన్ ఏంటి’’ అంటూ నేరస్తులను ప్రశ్నించినట్లుగా నిలదీశారని వినయ్ వివరించారు. ‘‘లగేజీలో ఉన్న ఊరగాయలను తెరిచి తిని చూపెట్టండని అన్నారు. వెంట తెచ్చుకున్న సబ్బులు.. పేస్టులను వాసన చూడండని చెప్పి వాటిలో ఏమైనా విష పదార్థాలు ఉన్నాయా? అని పరీక్షించారు. ఆ తర్వాత మీరు చదువుకోవడానికి వచ్చిన నార్తర్న్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ, సిలికాన్‌వ్యాలీ యూనివర్సిటీలు బోగస్ అని చెప్పారు. ఇండియాకు తిరిగి వెళ్లాలన్నారు’’ అని ఆయన తెలిపారు.

సీసీ కెమెరాలు అమర్చిన గదిలోకి తరలించి, ఓసారి తినడానికి ఎద్దు మాంసం ఇచ్చారని పేర్కొన్నారు. బాత్‌రూంకు వెళ్లాలన్న వెంట సెక్యూరిటీని పంపించారని, చివరికి 28న సాయంత్రం అట్లాంటాలో ఓ విమానం ఎక్కిం చారని తెలిపారు. విమానం దిగిన తర్వాత  పాస్‌పోర్టు, వీసా, లగేజీ, ఇతర పత్రాలను ఎయిర్‌హోస్టెస్ తెచ్చి ఇచ్చి.. మీరు నెదర్లాండ్స్‌లో ఉన్నారని, ఇక్కడ్నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఉందని వెళ్లిపోయినట్లు వివరించారు. అమెరికాలో చదువుకోవడానికి వెళుతున్న విద్యార్థులకు అనేక అవమానాలు ఎదురవుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని వినయ్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement