
సాక్షి, హైదరాబాద్: మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం వేగవంతం చేసింది. పరీక్ష రాసేందుకు 5,60,395 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరి కోసం 2,500కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. కేంద్రాల్లో అవసరమైన బెంచీలు, సదుపాయాల, ఇతర ఏర్పాట్లపై ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ అధికారులతో సమీక్షించారు. అన్ని సదుపాయాలుండేలా చూడాలని, లోపాలేమైనా ఉంటే తెలపాలని ఆదేశించారు. ఫర్నీచర్ అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ సూచించింది.
సీసీ కెమెరాల ఏర్పాటు..: పరీక్షల ఏర్పాట్లలో భాగంగా సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య కమిషనర్ కిషన్ ఉన్నతాధికారులతో చర్చించారు. గతేడాది మాల్ ప్రాక్టీస్ ఆరోపణలున్న జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్షలకు హాజరయ్యేందు కు 11,109 ఉన్నత పాఠశాలలకు చెందిన 5,04,545 మంది రెగ్యులర్ విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఒకసారి ఫెయిలైన ప్రైవేటు విద్యార్థులు 35,864 మంది హాజరుకానుండగా, వొకేషనల్ విద్యార్థులు 19,986 మంది హాజరయ్యేందుకు ఫీజు చెల్లించారు. తత్కాల్ కింద ఫీజు చెల్లించేందుకు ఇంకా సమయం ఉన్నందున సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశముంది. పరీక్ష కేంద్రాలుగా ప్రైవేటు విద్యా సంస్థల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది.
హైదరాబాద్, రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి..
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అధిక సంఖ్యలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. దీంతో ఈ 2 జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిం చింది. రెగ్యులర్ విద్యార్థుల్లో హైదరాబాద్ జిల్లా నుంచి 69,871, రంగారెడ్డి జిల్లా నుంచి 43,427 మంది హాజరుకానున్నారు. నిజామాబాద్ జిల్లాలో 24,200, సంగారెడ్డిలో 20,807, నల్లగొండలో 20,512, మహబూబ్‌నగర్‌లో 20,063 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment