శ్రీరంగం వైపు నడుస్తున్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే.మహాపూర్ణుల గురించి తపనే. ఏ సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని విడిచిపోవలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణులవారు కూడా పరమ పదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్ సంస్కారాలు నిర్వహించారని తెలిసింది.
కళ్యాణి పుష్కరంలో స్నానం చేసి, మంటపంలో తిరుమణి కాపుచేసుకుని, తిరునారాయణుని ధ్యానిస్తూ కూర్చున్న రామానుజుడికి ఇద్దరు వైష్ణవులు శ్రీరంగం నుంచి వచ్చారని చెప్పగానే ఆయన కళ్లుతెరిచి చూసాడు. ఎన్నాళ్లయింది శ్రీరంగానికి దూరమై, అని కళ్లు చెమర్చాయి.‘స్వామీ అడియేన్’ అని పాదాలపై బడి ‘కులోత్తుంగ చోళుడి కంఠంలో క్రిములు పుట్టి ఏమీ భుజించలేని పరిస్థితుల్లో నానాటికి క్షీణించి చివరకు అంతరించాడు. శ్రీవైష్ణవులకు ఉపద్రవం కూడా అంతరించింది ఆచార్యవర్యా’ అని చెప్పారు. ‘ఓహో కళ్యాణి పుష్కరిణి కళ్యాణిదాన్ అయింది’ (అంటే శుభం కలిగింపజేసిందని) అని రామానుజులు సంతోషించారు. శెల్వనారాయణుని అనుమతి గ్రహించి శ్రీరంగానికి రామానుజుడు బయలుదేరాడు. ‘మీరు వెళ్లిపోతే మేమంతా ఏం కావాలి? మేమూ వస్తాం’ అని శిష్యులంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ‘మీరంతా వస్తే ఇక్కడి ఆచార ఆరాధనా విధులు ఎవరు చేస్తారు నాయనా’ అని రామానుజులు అంటే ‘ఏమో మేము మాత్రం మీ నుంచి దూరం కాలేము స్వామీ’ అన్నారు వారు.రామానుజుడు తన విగ్రహాన్ని ఒకటి రూపొందింపజేసి తన తపోశక్తితో అందులో తన జీవశక్తిని కొంత నిక్షిప్తం చేసి, ‘ఇదిగో ఈ విగ్రహమే నేను, నన్ను ప్రేమతో పిలిచిన వారికి నేను బదులు పలుకుతాను. ఇక నన్ను శ్రీరంగని సన్నిధానానికి వెళ్లనివ్వండి’ అని వారిని ఒప్పించారు. ఈ విగ్రహానికి తమర్ ఉగన్ద తిరుమేని (శిష్యులు ప్రేమతో ఆదరించిన శ్రీ విగ్రహం) అని పేరు.
తిరునారాయణపురంలో సర్వవిధ సేవలు సక్రమంగా జరిగేందుకు కట్టుదిట్టం చేశారు. 52 కుటుంబీకులను పిలిచి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో బాధ్యతను అప్పగించారు. శెల్వపిళ్లైని బావిగట్టు మీద ఉన్న బిడ్డను తల్లి చూసుకునేంత జాగ్రత్తగా ప్రేమతో, ఆప్యాయతతో చూచుకోవాలని ఉపదేశించారు. బావిగట్టుమీద ఏ శిశువునూ తల్లి కూర్చోబెట్టదు. కానీ వాడు మారాం చేస్తే గట్టుమీద నుంచి బావిని చూపించి నవ్విస్తుంది. పాలుపడుతుంది. గోరుముద్దలు పెడుతుంది. పడిపోకుండా గట్టిగా పట్టుకుంటుంది. సనత్ కుమారులు తిరునారాయణ పెరుమాళ్లను ప్రతిష్టించడం వలన ఇది తిరునారాయణ పురమై భాసిల్లింది. ఈ నారాయణ క్షేత్రం కొండపై ఉంది కనుక నారాయణాద్రి అయింది. త్రేతాయుగంలో దత్తాత్రేయ మహర్షి వేదపఠనంతో పుష్కరిణి ఏర్పడినందున వేదాద్రి అయింది. శ్రీ సీతారాములు వనవాస కాలంలో ఇక్కడ కొన్నాళ్లుండటం వలన సీతారామ క్షేత్రమయింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణబలరాములు ఉత్సవమూర్తిని ప్రతిష్టించడం వలన యాదవాద్రి అయింది. రామానుజులు తిరిగి ప్రతిష్టించినందున యతిశైలమైంది. దీని చుట్టూ మేలైన కోటను కట్టించడం వల్ల మేల్కోట అయింది.
శ్రీరంగం వైపు నడుస్తున్నంత సేపు రామానుజులకు కూరేశుల గురించి ఆలోచనే. మహాపూర్ణుల గురించి తపనే. ఏ సమాచారమూ లేదు. వారికేమయింది. ఏ విధంగా ఉన్నారు. శ్రీరంగం చేరుకునే సమయంలోనే కూరేశులు శ్రీరంగాన్ని విడిచిపోవలసి వచ్చిందని తెలిసింది. గోష్ఠీ పూర్ణులవారు కూడా పరమపదించారని, వారి తనయుడు తెర్కాళ్వార్ సంస్కారాలు నిర్వహించారని తెలిసింది. దాదాపు అదే కాలంలో తిరుమలై అండన్, తిరువరంగప్పెరుమాళ్ అఱైయార్, శ్రీశైల పూర్ణులు, కాంచీపూర్ణులు కూడా పరమపదం చేరారని తెలిసింది. ఆర్ద్రమైన మనస్సుతో తన గురువులందరికీ రామానుజులు అంజలి ఘటించారు. తనను నడిపిన అపురూప ఆచార్య సంపద తనకు దక్కినందుకు జన్మ ధన్యమైందని భావించారు. ఆ గురువులు పెట్టిన అక్షయ అక్షర సంపదే తన జీవితమని అది వారికే అంకితమని అంతరంగభావన చేశారు.
శ్రీరంగం చేరకముందే కూరేశుని ఇంటికి వెళ్లారు రామానుజులు. పాదాలపై బడిన కూరేశుని ఆదరించి ‘నాకోసం కళ్లు పెరుక్కున్నావా కూరేశా! అయ్యో ఎంత పని జరిగింది’ అని పరితపించారు. గాఢ పరిష్వంగంతో ఓదార్చారు. ‘నేను ఒక వైష్ణవుడు ధరించిన నామాలు వంకరగా ఉన్నాయని విమర్శించాను స్వామీ! అందుకే నాకీ శిక్ష కాబోలు!’’ అని కూరేశుడు అన్నారు. ‘‘కూరేశా రా ముందుగా కాంచీపురం వెళ్దాం. అక్కడ వరదుడిని ప్రార్థించు’’ అని అక్కడికి తీసుకువెళ్లారు. కూరేశుడు వరదరాజస్తవం అనే అద్భుత స్తోత్రాన్ని చేశారు. వరదుడు ప్రత్యక్షమైతే నాలూరన్‌ను అనుగ్రహించాలని కోరారు. ‘ఒక్క నాలూరన్ ఏమిటి కూరేశా, నీతో సంబంధం ఉన్న వారందరికీ నా దగ్గర శాశ్వత నివాసాన్ని, మోక్షాన్ని ఇస్తున్నాను’ అని వరదుడు అన్నాడు. అది విని రామానుజులు ‘తిరుగోష్ఠియూర్ నంబి ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు నాకు నరకమే కలుగుతుంది. కాని నీ వల్ల నీతో సంబంధం ఉన్న వారందరికీ వరదుడు మోక్షం ఇవ్వడం వల్ల నాకు కూడా మోక్షం లభిస్తున్నది’ అని సంతోషించారు. తనకు నేత్రాలను మాత్రం కూరేశులు కోరుకోలేదు. కూరేశునికి చూపును ప్రసాదించమని రామానుజులు వరదుని ప్రార్థించారు. ఆచార్యుని సేవించుటకు మాత్రం సర్పదృష్టిని కూరేశుడికి ఇస్తున్నానని వరదుడు వరమిచ్చాడు. అందరూ శ్రీరంగానికి బయలుదేరారు.
ఓరోజు కూరేశుడు శ్రీరంగని ముందు నిలిచి తనకు భవబంధముల నుంచి విముక్తిని ప్రసాదించి తనలో చేర్చమని కోరుకున్నారు. ‘‘నాకన్నా ముందే వెళ్ళిపోదామనుకుంటున్నావా నాయనా’’ అని రామానుజులు అడిగారు. ‘‘మీకు వైకుంఠంలో నేనే స్వాగతం చెప్పాలి గురువర్యా. అక్కడ మీ ఆచార్యత్వాన్ని చాటాలి కదా’’ అన్నాడాయన.‘‘వైకుంఠంలో ఈ బంధాలేవి ఉండవు. కాని నీవు అక్కడ కూడా ఈ అనుబంధాన్ని ఆశిస్తున్నావంటే నీదెంత విశాల హృదయం కూరేశా, అయినా నిన్ను వదిలి నేనుండగలనా?’’ అన్నారు రామానుజులు. ‘‘ క్షమించండి స్వామీ ఆ విషయం మరిచా’’నని కన్నీట ఆచార్యుని పాదాలు కడిగారు కూరేశులు. ఆయన పాదాలను శిరసున ధరించారు. వారి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించారు. యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహితస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోరామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే నిత్యం అచ్యుతుని పాదాలను సేవిస్తూ ఇతరములన్నీ గడ్డితో సమానమని తృణీకరించే మా గురువు రామానుజుని పాదములే నాకు శరణు అని ప్రార్థించారు కూరేశులు. కొద్దిరోజుల తరువాత కూరేశులు కుమారులైన వ్యాస పరాశర భట్టులను పిలిచి ‘అమ్మ జాగ్రత్త నాయనా ఇక మీ తల్లిదండ్రులు రంగనాయకి రంగనాథులే’అని శిరస్సును శ్రీరంగని వైపు, పుత్రుల ఒడిలో ఉంచి పాదములను భార్య ఆండాళ్ ఒడిలో ఉంచి నిర్విచారంగా, రామానుజునే మనసునిండా స్మరిస్తూ తుది శ్వాస విడిచారు. రామానుజులు వారికి స్వయంగా అంత్యేష్టి నిర్వహించారు. పుత్రులను ఓదార్చారు. మఠాధిపత్యాన్ని కూరేశుడి పుత్రుడు పరాశరుడికి అప్పగించారు.
దాశరథి పుత్రుడు కందాడై అండన్ ‘అయ్యా! మీ విగ్రహాన్ని భూతపురి (శ్రీ పెరుంబుదూర్)లో ప్రతిష్టించుకునేందుకు అనుమతించాల’ని రామానుజుని కోరుకున్నారు. ఒక విగ్రహాన్ని తయారుచేయించి, దాన్ని ఆలింగనం చేసుకుని శక్తిని ప్రవేశపెట్టి కొంత బలహీనులైనారు. ఆండన్ ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లి రామానుజుని జన్మస్థలంలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రతిష్టింపజేసారు. అక్కడ తన విగ్రహ అభిషేక నేత్రోన్మీలన సమయంలో ఇక్కడ రామానుజులకు కళ్లు కదలిపోయాయి. ఆ ప్రతిష్ట జరిగినన్ని రోజులు రామానుజులు అస్వస్థత చెందారు. రెండోసారి షష్టిపూర్తి జరిగి 120 నిండుతున్నదని గమనించారు. ఆండన్‌ను, ఇతర శిష్యులను పిలిపించారు. ఎన్నెన్నో బోధనలు చేస్తున్నారు. ఎందుకో శిష్యులకు అర్థం కావడం లేదు. ‘భగవంతుడికి అనుకూలంగా ఉండండి, పాముకు దూరంగా ఉన్నట్టు నాస్తికులకు దూరంగా ఉండండి. సంసారులలో ఆసక్తి ఉన్నవారికి శాస్త్రజ్ఞానం బోధించండి. ఆసక్తి లేకపోయినా వారి పట్ల దయచూపండి. వైష్ణవుల పట్ల అపరాధం చేయకండి. శ్రీభాష్యం చదవండి. బోధించండి. వీలు కాకపోతే తిరువాయ్ మొళి చదవండి చదివించండి. ఏదైనా పుణ్యక్షేత్రంలో గుడిసె కట్టుకుని సేవించండి. లేదా ఆలయాలకు వెళ్లి సేవ చేయండి. అదీ కాకపోతే ద్వయమంత్రం పఠించండి. మంత్ర భావాన్ని తెలుసుకొండి. అశక్తులైతే వైష్ణవులను సేవించండి. ఇక నాకు సెలవివ్వండి. నేను ఈ దేహాన్ని విసర్జించవలసిన సమయం ఆసన్నమైంది’ అనగానే శిష్యులు నిర్ఘాంతపోయారు. ‘దుఃఖించకండి నాయనా. నారాయణుని పూజించినట్టు వైష్ణవులను పూజించండి. అర్చామూర్తిని బొమ్మ అనుకోకండి, గురువు సామాన్యమానవుడనుకోకండి.’ అని బోధించారు.
శిరస్సును గోవిందుని ఒడిలో ఉంచి పాదములను వడుగనంబి ఒడిలో పెట్టి శిష్యులందరికీ తోచిన బోధనలు చేస్తూ కన్నుమూసారు. నిన్ను వదులుకోను అని రంగనాథుడు అన్నట్టు రామానుజుని చరమశ్రీ శరీరం (తిరుమేని)కి శ్రీరంగనాథుడి ఆజ్ఞ మేరకు తన ఆలయ సముదాయంలోని వసంత మండపంలో ఆలయం నిర్మింపజేసారు. నేటికీ తానాన తిరుమేనిగా శ్రీమద్రంభగవద్రామా నుజులు కూర్చున్నభంగిమలో విగ్రహంగా ఘనీభవించిన ఆయన శ్రీశరీరాన్ని ఇప్పటికీ శ్రీరంగంలో అందరూ దర్శించుకోవచ్చు. 1017లో ప్రారంభమైన రామానుజ జీవనం 1137 పింగళనామ సంవత్సరం మాఘమాసం దశమీ తిథిరోజున ముగిసింది. 120 సంవత్సరాల రామానుజ మార్గం శాశ్వతంగా ప్రతిష్టితమైంది. రామానుజులు తీర్చిదిద్దిన క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం, తిరుమల, తిరునారాయణ పురం. అందుకే.. శ్రీరంగమంగళ మణిం కరుణా నివాసంశ్రీ వేంకటాద్రి శిఖరాలయ కాలమేఘమ్‌శ్రీ హస్తిశైల శిఖరోజ్జ్వల పారిజాతమ్ శ్రీశం నమామి శిరసా యదుశైల దీపమ్‌ఆదిశేషుడై, సేనాని విష్వక్సేనుడై, చివరకు శ్రియఃపతియై ఈ లోకానికి వచ్చిన మహాజ్ఞానియా ఈ రామానుజుడు అని మనకు అనిపించేంత మహానుభావుడు. వేయేళ్ల కిందట అవతరించిన మహా ప్రాజ్ఞుడు. శేషోవాసైన్యనాథోవా శ్రీపతిర్వేతిస్వాత్త్వికైఃవితర్క్యాయ మహా ప్రాజ్ఞైర్భాష్యకారాయ మంగళమ్‌రామానుజార్య దివ్యాజ్ఞా వర్థతాం అభివర్థతాం (ఆయన దివ్యోపదేశాలు నిత్యం అభివర్థనం చెందుగాక).సమాప్తం.
‘రామానుజ మార్గం’ రచయిత ఆచార్య మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment