సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు రూ.1,200 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ క్షేత్రంలో దర్శనానికి రుసుము పెడుతున్నారు.
తొలుత పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.200 టికెట్ ధర పెట్టాలని భావించారు. కానీ అది భక్తులకు భారమవుతుందన్న భావనతో దాన్ని రూ.150కి తగ్గించాలని అనుకున్నారు. అది కూడా ఎక్కువ అవుతుందని కొందరు కమిటీ సభ్యులు పేర్కొనటంతో పెద్దలకు రూ.150, చిన్నారులకు రూ.75గా ఖరారు చేశారు. మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు.
రామానుజాచార్యుల స్వర్ణ మూర్తికి ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి 6 నుంచి 8 అడుగుల దూరం నుంచి బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేసేవరకు స్వర్ణమూర్తి సందర్శనకు అనుమతించరు. ఈ ప్రాంతంలో సాయుధులైన రక్షణ సిబ్బంది 24 గంటలూ పహారాలో ఉంటారు.
♦ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న ఈ క్షేత్ర నిర్వహణకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా జరుపుతున్నారు. ఈ పనులు పూర్తయ్యేవరకు దర్శనాలను కేవలం సాయంత్రం వేళకే పరిమితం చేయాలని నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఆరున్నర వరకు అనుమతిస్తారు. పనులు పూర్తయ్యాక ఉదయం, సాయంత్రం వేళల్లో అనుమతించనున్నారు. మరో నెల రోజుల్లో పనులు పూర్తవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. సాంకేతిక కారణాల వల్ల 3డీ లేజర్‌షోను తాత్కాలికంగా ఆపేశారు.
♦ప్రాంగణంలో 250 ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఫీడ్‌ను పరిశీలించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
♦50 ఎకరాల్లో విస్తరించిన ఈ క్షేత్రాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు షిఫ్టుల్లో 300 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. లోపలకు ఎంతమంది వచ్చారు, బయటకు తిరిగి ఎందరు వెళ్లారన్న వివరాలు తెలిసే ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెండు సంఖ్యలు సరిపోలకుంటే లోపలే అనుమానితులు ఉండిపోయారని భావించి క్షుణ్ణంగా తనిఖీ చేసే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.
♦ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర బ్యాగేజీని అనుమతించకూడదని భావిస్తున్నారు. టికెట్ కౌంటర్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలో సెల్‌ఫోన్లు, లగేజీ, పాదరక్షలు అప్పగించాలి. ఫుడ్‌కోర్టు దగ్గర నిష్క్రమణ మార్గం ఉంటుంది. ఎంట్రీ వద్ద అప్పగించిన వస్తువులు కన్వేయర్ బెల్టు ద్వారా ఎగ్జిట్ వరకు చేరతాయి. అక్కడ వాటిని తీసుకుని బయటకు రావాల్సి ఉంటుంది.
♦వాహనాలను స్కానర్లతో తనిఖీ చేస్తారు. అనుమానిత వాహనాలను ఆపేందుకు బూమ్ బారియర్స్, బొల్లార్డ్స్ ఉంటాయి. వాటిని ఛేదించుకుని వెళ్లే ప్రయత్నం చేసే వాహనాల టైర్లను చీల్చే టైర్ కిల్లర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
♦ఈ కేంద్రంలో 250 మంది అర్చకులను నియమించనున్నారు. దివ్యదేశాలుగా పేర్కొనే 108 ఆలయాలకు ఇద్దరు చొప్పున, మిగతా ఆలయాల్లో మరికొందరని నియమిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఇతర అవసరాలకు కలిపి మొత్తం 800 మంది సిబ్బంది ఉంటారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment