మేల్కోటేలో రామానుజులు తన కులాతీత సమానతా సిద్ధాంతాన్ని సమగ్రంగా ఆచరణ ద్వారా నిరూపించి నిర్ధారించారు. తిరునారాయణుడిని పుట్టలోంచి బయటకు తీసి పునఃప్రతిష్ఠ చేయడానికి సహకరించిన గిరిజనులకు, హరిజనులకు ఆలయ ప్రవేశం, దర్శనార్హత కలిగించి సమతను చాటారు. దళితులనే తక్కువ చూపు లేకుండా కొందరిని తన శిష్యులుగా చేర్చుకున్న రామానుజులు భగవత్సేవలో దళితులందరికీ స్థానం ఉండాలని వారికి తిరుక్కులత్తార్ అనే గౌరవప్రదమైన పేరును పెట్టి, నియమనిష్టలను ఏర్పాటు చేసి, పంచసంస్కారాలు గావించి, భగవత్సేవలో కాహళి ఊదే కైంకర్యాన్ని కల్పించి సముచిత స్థానం ఇచ్చారు. సుల్తాను కూతురు శెల్వప్పిళ్లై విగ్రహాన్ని ప్రేమించి తిరునారాయణపురం వస్తే ఆమెకు గోదాదేవితో సమానమైన స్థానాన్ని కల్పించి, రొట్టెల నైవేద్యంతో ఆమెను ఆరాధించే పద్ధతిని ప్రారంభించారు. తొండనూరులో అన్ని కులాలవారికి సాగుజలం, తాగుజలం అందేలా ఒక ఆనకట్టను, జలాశయాన్ని ఏర్పాటు చేశారు. తన శిష్యులలో పట్టినిప్పెరుమాళ్ శూద్రకులజుడు. శ్రీరంగంలోని శివార్లలో ఉండేవాడు. కావేరీలో స్నానం చేసి రామానుజుడు పట్టినిప్పెరుమాళ్ గుడిసెకు వెళ్లేవారు. అతను పరవశంతో పాడిన పాశురాలను కాస్సేపు వినేవారు.
దాశరథి విధేయత
రామానుజునికి అత్యంత ప్రియమైన శిష్యుడు దాశరథి. తిరుగోష్టియూర్ వెళ్లినప్పుడు ఒంటరిగా రమ్మంటే కూరేశుడిని, దాశరథిని ఎందుకు వెంటతీసుకొచ్చావని అడిగారు. దాశరథి తనకు దండం వంటి వాడనీ ఎప్పటికీ వదలలేనని అంటారు రామానుజులు. స్నానానికి వెళ్లేముందు ఆయన భుజంపైన చేయివేసి నడిచేవాడు. రామానుజుని ఆచార్యులలో ఒకరైన పెరియనంబి కుమార్తె ఆతుల్యలక్ష్మికి వంటపని రాదని వారి అత్తగారు కోపించి పుట్టింటికి పంపించి వేశారు. మళ్లీ వస్తే వంటవాడితో రమ్మని చెప్పిందామె. పెరియనంబి ఏంచేయాలో తోచక రామానుజుడి దగ్గరికి పంపారు. అంతా విన్న రామానుజుడు, ‘‘దాశరథీ ఈ అమ్మాయి వెంట వెళ్లి వారికి వంట చేసి పెట్టు నాయనా’’ అని పంపించారు. ఆయన మారుమాటాడకుండా వెళ్లిపోయాడు. రోజూ మంచి రుచికరమైన వంటలు చేస్తూ ఉన్నాడు. అత్తగారు శాంతించారు. ఓరోజు ఆతుల్యలక్ష్మి మామగారు ఇంటికి వచ్చిన పండితుడితో శాస్త్రచర్చ చేస్తున్నారు. ఓ సూత్రానికి వారు చెప్పిన అర్థం దాశరథికి వినబడింది. వెంటనే వంట ఇంటి నుంచి బయటికి వచ్చి ‘‘అయ్యా ఆ సూత్రం అర్థం అది కాదు. సమంజసమైన అన్వయం ఇది...’’ అని వివరించి మళ్లీ గరిటె పట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. వంటవాడేనా ఈయన. ఏమిటీయన జ్ఞానం. ఇంత జ్ఞాని, పండితుడు, ఘంటం పట్టుకుని పుస్తకాలు వ్రాయాల్సిన వాడు తన ఇంట గరిటె పట్టుకుని వంట చేస్తున్నాడా.
‘నాయనా నీవెవరివి?’ అని అడిగాడు మామగారు. ఆతుల్యలక్ష్మి జోక్యం చేసుకుని ‘‘ఆయన రామానుజుని ప్రప్రథమ శిష్యులు దాశరథి’’ అని చెప్పగానే వారు ఇరువురూ ఆయన పాదాలపై పడి క్షమించమని కోరారు. తమ ఇంట ఈ వంట పని మానేయమని కోరుకున్నారు. దాశరథి ‘‘నేను రామానుజులవారి ఆజ్ఞను శిరసావహించవలసిందే. ఆచార్యుడు ఘంటం పట్టమంటే పడతాను. గంటె తీసుకొమ్మంటే అదే తీసుకుంటాను’’ అన్నాడు. అంతా కలసి దాశరథితో రామానుజుని దగ్గరకు వెళ్లారు. ఆయనకు దాశరథిని అప్పగించి ‘‘మీ శిష్యుడు అపారమైన శాస్త్ర జ్ఞాని. ఆయనచేత వంట చేయించుకోవడం మాకు మహాపాపమే. ఆతుల్యలక్ష్మిని పుట్టింటికి పంపించి వేసినందుకు క్షమించండి. అయ్యా మా కోడలికి మేం వంట నేర్పుకుంటాం, ఇంకేదైనా చేస్తాం, కాని మీరు దయచేసి దాశరథిని మీ ఆశ్రమంలో మీతోనే ఉండనీయండి’’ అని వేడుకున్నారు.
కర్షకుడు మాఱనేఱి నంబి
యామునాచార్యులు ఓసారి ఊరువెళ్లి వస్తూ ఒక కర్షకుడు బురదనీటిని తాగడం చూసి ఏమిటిదని అడిగారు. కర్షకుడు ‘‘నా భార్య అన్నం తేవడంలో ఆలస్యమైంది. ఆకలి ఈ శరీరమనే మన్నుకే కదా అందుకే ఆ మన్నుకు ఈ మన్నునే తినిపిస్తున్నాను’’ అన్నాడు. ఆ రైతు దేహాభిమానరాహిత్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ జిజ్ఞాసికి పంచసంస్కార కర్మలు అనుగ్రహించి, మాఱనేఱి నంబి అని పేరు పెట్టి తన శిష్యులలో చేర్చుకున్నారు. మాఱనేఱి నంబి శ్రీరంగంలో ఆచార్యుల వారి శుశ్రూష చేస్తూన్న సమయంలో యామునాచార్యుల వారికి రాచవ్రణం లేచింది. ఆ బాధ వల్ల అనుష్టానంలో ఏకాగ్రత కుదరడం లేదు. ఆ బాధను తనకు ఇచ్చేయమని మాఱనేఱి నంబి ప్రార్థించాడు. యామునాచార్యులు ఆ భాధను, త్రిదండాన్ని రోజూ మాఱనేఱి నంబికి ఇచ్చి అనుష్టానం తరువాత మళ్లీ తీసుకునే వారు. మొత్తం ఆ బాధను తనకే ఇమ్మని అది మహాప్రసాదంగా తాను అనుభవిస్తానని పదే పదే ప్రార్థించాడు. ఆయన మన్నించారు. యామునులు అవతారం చాలించిన తరువాత మాఱనేఱి నంబి ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు. తన వార్ధక్యంలో మాఱనేఱి నంబి రాచపుండుతో బాధపడడం చూసి రామానుజుడు తట్టుకోలేక శ్రీరంగనాథుని ప్రార్థించి ఆ బాధను తొలగింప చేశారు. సంగతి తెలుసుకున్న మాఱనేఱి నంబి ‘‘రామానుజా ఏమిటీ పని. నా గురువు నాకు ఫలం రూపంలో ఇచ్చిన బాధను అనుభవించకుండా నీవు అడ్డు రాకూడదు. నా బాధను నాకిప్పించు నాయనా’’ అన్నారు. ‘‘నమ్మాళ్వార్ శ్రీ సూక్తిలో ఒక దశకాన్ని స్తుతించి మీ బాధను నివృత్తి చేయాలని ప్రయత్నించాను స్వామీ, నన్ను క్షమించండి’’ అన్నారు రామానుజులు.
‘‘అయితే మళ్లీ ప్రార్థించు. నాబాధ నాకు ఇప్పించు’’ అని ఆదేశించారు గురువుగారు. మళ్లీ ప్రార్థన చేసి విచారంతోనే మళ్లీ ఆ వ్రణాన్ని రప్పించారు రామానుజులు. ఆ బాధతోనే ఆయన పరమపదించారు. పెఱియనంబి వారికి బ్రహ్మమే«ధా సంస్కారం జరిపించారు. ఒక శూద్రుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయిస్తారా అని జాతి బ్రాహ్మణులు ఆగ్రహించి పెఱియనంబికి ఆలయ సేవల నుంచి బహిష్కారం విధించారు. శ్రీరంగని సేవించకపోవడం కన్న శిక్ష ఏముందని పెరియనంబి కుటుంబం కృంగి పోయింది. శ్రీరంగని ఊరేగింపు ఇంటిముందు నుంచి సాగుతున్న సమయంలో ఆయన పుత్రిక అత్తుళాయమ్మ రంగనాథుడిని చూసి ‘‘స్వామీ నా తండ్రి నీకేం అపకారం చేసినాడని ఈ బహిష్కారం, ఇదేనా నీ న్యాయం. ముందు సమాధానం చెప్పిన తరువాతనే నీవు ఇక్కడ నుంచి కదలాలి’’ అని కనుల నీరు కారుతుండగా మనసులో అనుకున్నది. అంతే! రథం ఎంత లాగినా కదలడం లేదు. అందరూ శ్రీరంగని ప్రార్థించినా ప్రయోజనం లేకపోయింది. ‘‘స్వామీ ఏమైంద’’ ని అడిగారు అందరూ. అర్చకునికి సమాధానం స్ఫురింపచేశారు రంగడు. ‘‘ఏ పాపమూ ఎఱుగని పెరియనంబిని బహిష్కరించడం రంగనాథునికి కోపం తెప్పించింది, భక్తుడికి, ఆచార్యానుగ్రహం పొందిన శిష్యుడికి బ్రహ్మమేధా సంస్కారం చేయడంలో తప్పేమిటి? యామునాచార్యుల బోధలు విన్నవారు చేయవలసిన పనేనా ఇది అని శ్రీరంగడు ఆగ్రహించాడు’’ అని అర్చకుడు వివరించారు. వారంతా లోపలికి వెళ్లి పెరియనంబిని క్షమాపణ కోరి ఆయనను తీసుకువచ్చి రథం ఎక్కించిన తరువాత గాని రథం కదలలేదు.
రెండో ప్రతిజ్ఞ: వ్యాస, పరాశర
తన ఐశ్వర్యాన్నంతా త్యజించి రామనుజుని శిష్యుడై నిత్యం అభిగమన, ఉపాదాన, ఇజ్య, స్వాధ్యాయ యోగాలను చేస్తూ ఊంఛ వృత్తి (బిక్షాటన)తో జీవిస్తున్న నిరాడంబరుడు నిర్వికారుడు, నిరహంకారుడు, దేహాభిమానం పూర్తిగా వదులుకున్నవాడు కూరేశుడు (ఆళ్వాన్, శ్రీవత్సాంక అనే పేర్లూ ఈయనవే). విపరీతమైన వర్షం వల్ల ఆరోజు భిక్షాటనకు వెళ్లలేదు. ఊంఛవృత్తిలో రేపటికోసం దాచుకోవడం ఉండదు. నారాయణ స్వరూపమైన సాలగ్రామానికి ఒక ఫలాన్ని నివేదించి, ఆ సాలగ్రామ అభిషేక తీర్థాన్ని సేవించి దివ్యప్రబంధం పఠించి పడుకున్నారాయన. భార్య ఆండాళమ్మను తన భర్త ఉపవాసం బాధిస్తున్నది. ఆ సమయంలో శ్రీరంగని రాత్రి ఆరగింపు గంట వినిపించింది. ‘‘నీ భక్తుడు తిండి లేక నకనకలాడుతుంటే నీవు షడ్రసోపేత భోజనం చేస్తున్నావా హు’’ అని నవ్వుకున్నది. కాస్సేపటికి మేళతాళాల ధ్వనులు వినిపించాయి. స్వామి ఊరేగింపు వస్తున్నదనుకుని కూరేశులు ఆండాళ్ బయటకు వచ్చారు. శ్రీరంగడి ఉత్సవ మూర్తి రావడం లేదు. ఆలయ అధికారి ఉత్తమనంబి నెత్తిన ఒక మూటతో వస్తున్నారు. ఇదేమిటని అడిగాడు కూరేశుడు. శ్రీరంగని ప్రసాదం అన్నాడు. ‘‘వితరణ చేయడమో విక్రయించడమో చేయవలసిన శ్రీరంగ ప్రసాదం నాకెందుకు ఇస్తున్నార’’ని కురేశుడు అడిగాడు. ‘‘ఇది శ్రీరంగనాథుని ఆజ్ఞ. నాకు కలలో కనిపించి, నా మిత్రుడు నిరాహారంగా పడుకున్నాడు. నీవు శిరస్సున ప్రసాదం ఉంచుకుని సగౌరవంగా తీసుకువెళ్లి ఇవ్వమని ఆదేశించారు. మీ కోసం శ్రీరంగడు నాకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. మీవల్లే నాకీ భాగ్యం కలిగింది. మీకు నా ధన్యవాదాలు, అభివందనములు స్వామీ’ అన్నారాయన.
మౌనంగా ప్రసాదం స్వీకరించినా, ఎవరో బలీయంగా అడగకపోతే శ్రీరంగడెందుకు ప్రసాదం పంపిస్తాడని ఆలోచించి భార్యతో ‘‘శ్రీరంగని నీవేమైనా అడిగావా’’ అని ప్రశ్నించాడు. ‘‘నా స్వామి పస్తులుంటే నీవు హాయిగా భుజిస్తున్నావా అని మనసులో అనుకున్నాను’’ అన్నదామె. ‘‘ఎంత పనిచేశావు ఆండాళ్. నా స్వామిని గురించి అంత మాట అంటావా. ఆయన ఎంత నొచ్చుకుని ఉంటాడు’’ అని హెచ్చరించాడు.‘‘నేనేమన్నాను.. మీరు మీస్వామి గురించి ఆలోచించారు. అదే విధంగా నేనూ నా స్వామి గురించి ఆలోచించకూడదా? అది నా ధర్మం’’. సరే ఇదేదో దైవసంకల్పమే కావచ్చు అనుకుని ఇద్దరూ రెండు ముద్దలు ప్రసాదాన్ని భక్తితో ఆరగించి నిద్రించారు. శ్రీరంగని ప్రసాదంగా ఆ దంపతులకు శుభకృత్‌నామ సంవత్సరం వైశాఖ మాసం పూర్ణిమ నాడు అనూరాధా నక్షత్రాన కవలలు జన్మించారు. జాతసూతకం ముగిసిన తరువాత రామానుజులు స్వయంగా కూరేశుని ఇంటికి వెళ్లి రక్ష చెప్పి ప్రేమతో పిల్లలను ఎత్తుకున్నారు. ‘‘గోవిందా ... ఏమిటిది ఈ శిశువుల నుంచి ద్వయమంత్ర సుగంధం వస్తున్నది?’’ అనడిగారు. ‘‘లోపలి నుంచి తీసుకువస్తూ రక్ష కోసం ద్వయమంత్రానుసంధానం చేశాను స్వామీ’’ అని గోవిందుడు జవాబిచ్చాడు. ‘‘సరే అయితే నీవే ఈ కవలలకు ఆచార్యుడివై నడిపించు’’. ఆ పసివారికి పంచాయుధ ఆభరణాలు ఇచ్చి దీవించారు. ఆ బాలురకు వ్యాస భట్టర్ అనీ పరాశర భట్టర్ ఇద్దరికీ నామకరణం చేశారు. కూరేశుడు పిల్లలను పట్టించుకునే వారే కారు. శ్రీరంగనాథుడు వీరిని నేను దత్తత తీసుకుంటున్నాను. వారు నా పుత్రులే సుమా అని కూరేశుడితో అన్నారని ప్రతీతి.
కాలక్రమంలో గోవిందుని బోధనలతో ఏకసంథాగ్రాహులైన ఇద్దరు బాలురు శాస్త్రాధ్యాయనాలలో అగ్రగాములుగా నిలిచారు. యుక్తవయసులో వారికి ఉపనయన పంచసంస్కారాలు జరిపించారు. కుశాగ్రబుద్ధులైన ఈ కవలలు ఓ రోజు వీధిలో ఆడుకుంటూ ఉంటే ‘‘సర్వజ్ఞ భట్టరు వస్తున్నారు బహుపరాక్’’ అంటూ అరుపులు వినిపించాయి. మేళ తాళాలతో పల్లకిలో వస్తున్న పెద్దమనిషిని చూసి అందరూ పారిపోయారు కాని వ్యాసపరాశర భట్టరులు అక్కడే ఉండి ‘‘ఎవరో సర్వజ్ఞుడని తనకు తానే చాటించుకుంటూ పల్లకీలో ఊరేగుతున్నారు’’ అని ఒకరికొకరు చెప్పుకొని నవ్వుకున్నారు. అక్కడి ఇసుకను రెండు చేతుల్లో పట్టుకుని వ్యాస భట్టరు, ‘‘నా చేతుల్లో ఎంత ఇసుక ఉందో చెప్పండి సర్వజ్ఞులవారూ’’ అని అడిగాడు. ఆయన ఏమీ చెప్పలేకపోయారు. మళ్లీ మౌనమే సమాధానమయింది సర్వజ్ఞుడికి. ఒక పిడికిలి ఇసుక పారవేసి, ‘‘ఇప్పుడెంత ఉందో చెప్పండి’’ అన్నాడా బాలుడు. ‘‘మీరేమి సర్వజ్ఞులు స్వామీ, రెండు గుప్పిళ్లలో దోసెడు, ఒక్క పిడికిలిలో గుప్పెడు ఇసుక ఉన్నదని తెలియదా’’ అన్నారు. ‘ఈ బాలురతోనే వాదించలేని నేను వీరి తండ్రులతో ఏమి వాదిస్తాను’ అనుకుని ఆయన ఇద్దరు పిల్లలను పల్లకీ ఎక్కించుకుని కూరేశుని ఇంటివద్ద దింపి, సర్వజ్ఞ నినాదాలు మానేసి వెళ్లిపోయారు.
తరుణ వయస్కులు కాగానే వివాహం చేయాలని సంకల్పించినా కొన్నేళ్లుగా కంచీపురాన్ని వదిలి, శ్రీరంగని సేవలో ఉన్న కూరేశుడికి సంబంధాల గురించి తెలియదు. ఆండాళ్ ‘‘పిల్లల పెళ్లి గురించి పట్టించుకోరేమి?’’ అని అడిగితే ’’శ్రీరంగనాథుడు, మన స్వామి రామానుజులు ఉండగా మనకేమి దిగులు’’ అని వదిలేశారాయన. ‘‘రంగనాథా! పిల్లల పెళ్లి గురించి నన్నడుగుతారేమిటి, నీవుండగా, అదేదో నీవే చూసుకో’’ అని ఆ రాత్రి ఏకాంత సేవ తరువాత చెప్పి వచ్చేశారు.
సంబంధాలు వెతుకుతూ రామానుజుడు ఇద్దరు కన్యలున్న బ్రహ్మజ్ఞాని మహాపూర్ణుడి బంధువు ఒకాయన ఉన్నాడని గమనించాడు. వారిని అడుగుదామన్నారు రామానుజులు. కన్యాదాత ఎందుకో నిరాకరించారు. కూరేశుడు స్మార్త బ్రాహ్మణ కులం వడమ శాఖకు చెందిన వాడు. మహాపూర్ణుడు బృహచ్చరణ వర్గానికి చెందిన పురశ్శిఖా బ్రాహ్మణుడు. ఈ కులాంతర భేదం వల్ల నిరాకరించి ఉంటారని ఒక అభిప్రాయం. కాని ఆశ్చర్యకరంగా ఓరోజు ఆయనే ముందుకు వచ్చి ఈ యువకులకు కన్యాదానం చేస్తానన్నారు. ‘‘శ్రీరంగనాథుడు నా కలలో కనిపించి’’ నా దత్త పుత్రులకు కన్యలను ఎందుకు ఇవ్వవు అని అడిగారు. ఇంతకన్న నాకు కావలసిందేముంది. నన్ను క్షమించి అంగీకరించండి’’ అని వేడుకున్నారు. మణ్ణి, అక్కచ్చిలను వారికిచ్చి వివాహం చేశాడాయన. గురుకృప, భగవదనుగ్రహం ఉన్న వ్యాస పరాశరులు ఆ మహర్షుల గౌరవాన్ని నిలబెట్టే రచనలు చేసి రామానుజుని ప్రియశిష్యులై భాసిల్లారు. పరాశర భట్టర్ శ్రీ లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ గుణరత్న కోశం, రంగనాథ వైభవాన్ని వివరించే శ్రీరంగరాజస్తవం, పూర్వోత్తర శతకాలు, త్రిమంత్ర సారాంశమైన అష్టశ్లోకి, శ్రీరంగనాథ స్తోత్రం, విష్ణుసహస్రనామస్తోత్రానికి సవివర వ్యాఖ్యానమైన శ్రీ భగవద్గుణ దర్పణం, కైశిక పురాణానికి చేసిన మణిప్రవాళ వ్యాఖ్యానం, అత్యంత మధురంగా ముక్త శ్లోకాలను రచించారు. పరాశరభట్టర్ అసాధారణ పాండిత్య వైభవాన్ని ప్రకటించే ఈ రచనలు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రజానీకానికి చేరువ చేశాయి. వీరిరువురి రచనలు విష్ణుపురాణంలోని విశ్వతత్వాన్ని, జీవతత్త్వాన్ని, పరమాత్మతత్వాన్ని సులభగ్రాహ్యరీతిలో నిర్ధారించాయి. వ్యాసుడు, పరాశరుడు రచించిన పురాణాల మూలతత్వాన్ని, తత్వత్రయమును ఆ పేర్లుగలిగిన ఇద్దరు మహాభక్తుల ద్వారా వ్యాఖ్యానింపచేయడం రామానుజుని సమర్థత. తద్వారా వ్యాస పరాశర మునుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయేట్టు చేసి యామునులకు ఇచ్చిన రెండో వాగ్దానం రామానుజులు నెరవేర్చారు.
- ఆచార్య మాడభూషి శ్రీధర్
సమతామూర్తిగా... స్ఫూర్తిప్రదాతగా
Published Sun, Apr 1 2018 1:48 AM | Last Updated on Sun, Apr 1 2018 1:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment