సాక్షి, తిరుపతి : నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 20 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారి పుష్కరిణి లో తెప్పపై విహరించనున్నారు.
తెప్పోత్సవం తొలిరోజు మార్చి 20న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా రామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పపై మూడు ప్రదక్షిణలు చేసి భక్తులను ఆశీర్వదిస్తారు. రెండో రోజు మార్చి 21న రుక్మిణి సమేతంగా కృష్ణస్వామి మూడుసార్లు తెప్పలపై విహరిస్తారు. మూడో రోజు మార్చి 22న శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి పుష్కరిణిలో మూడుసార్లు చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. అదేవిధంగా మార్చి 23న నాలుగో రోజు ఐదుసార్లు, మార్చి 24న చివరి రోజు ఏడుసార్లు మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా మార్చి 20, 21వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
శ్రీవారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామివారిని 63,251 మంది దర్శించుకున్నారు. వారిలో 20,989 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకతో స్వామివారి హుండీ ఆదాయం 4.14 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామి ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం.. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పట్టనుందని టీటీడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment