శ్రీరంగని సేవలో రామానుజులు పరవశులవుతున్నారు. మహాపూర్ణులతో వివరంగా మాట్లాడుకోవాలని తపన పడుతున్నారు. తన భార్య తంజ ద్వారా అవమాన సంఘటన జరిగినప్పటి నుంచి క్షమాపణ చెప్పుకునే అవకాశం కోసం పరితపిస్తున్నారు. ఓరోజు కలిసి ‘‘నాభార్య తప్పిదానికి నన్ను మన్నించండి స్వామీ’’ క్షమాపణ కోరారు. ‘‘నీ భార్య అంత నేరం చేసినట్టు నాకు జ్ఞాపకమే లేదు’’ అన్నారు పెరియనంబి. కొన్ని మరచిపోవలసిన సంఘటనలను మహానుభావులు ఆ విధంగా వదిలేస్తారు. లేకపోతే కంచినుంచి మొత్తం కుటుంబంతో సహా తరలిపోవలసినంతగా కదలించిన సంఘటనను అసలు గుర్తుపెట్టుకోకుండా ఉండగలగడం సాధ్యం. వాటిని మనోఫలకంనుంచి తుడిచిపెట్టడమే సత్పురుషుల లక్షణం. ఆచార్యుల సత్పురుషత్వాన్ని మననం చేసుకుంటూ రామానుజుడు ‘‘మీరిదివరకు నాకు దివ్యప్రబంధమును బోధించి నన్ను ధన్యుడిని చేశారు. ఇప్పుడు యామునాచార్యుల రచనలు ఇతర దివ్యగ్రం«థములను మీద్వారా అధ్యయనం చేయదలచుకున్నాను. నన్ను అనుగ్రహించండి స్వామీ’’ అని వేడుకున్నారు. నిష్కల్మష హృదయులైన మహాపూర్ణుడు ‘‘రామానుజా అంతకన్న కావలసిందేమిటి. ఆలస్యమేలేదు. వెంటనే మొదలు పెడదాం. మన యామునాచార్యులకు ఆంతరంగిక శిష్యులు గోష్టీపూర్ణుల వారు. అన్నింటికన్న ప్రధానమైన పరమపావన కరమైన అష్టాక్షరి ద్వయమంత్రాలలో సమస్త శాస్త్ర సారం ఇమిడి ఉంది. అది నీవు గోష్టీపూర్ణులనుంచి తెలుసుకోవడం ముఖ్యం. ఆ విషయమై వ్యాఖ్యానించగల నిపుణుడు మరొకరు లేరు. అందుకు ఆయనను ఆశ్రయించే కార్యాన్ని ఆరంభించు’’ అని చెప్పారు.
రామానుజులు వెంటనే తిరుగోష్టియూరు ప్రయాణం చేశారు. చేరుకున్నారు. స్వామి ఇప్పుడు కాదు మరోసారి చూద్దాం అని 18 సార్లు తిప్పిపంపారు. 19 వ సారి కురేశుడు దాశరథితో కలిసి వెళ్లినపుడు రహస్యంగా ఉంచుతానని ప్రమాణం చేయించుకుని రహస్యార్థాలను వివరించారు. ఓం అనే మొదటి పదం ప్రణవం. నమః అనే నమస్సు మధ్యమం, నారాయణాయ చివరిది. ఇది భుక్తిని ముక్తిని ప్రసాదించే సిద్ధమంత్రం. భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ మంత్రమునే రుషులు మునులు జపిస్తూ ఉంటారు. ఈ మంత్రం జపించిన వారికి లభించనిది అంటూ ఏమీ ఉండదు. (ఆ రహస్యాలను వెంటనే ఆయన తిరుగోష్టియూర్ గోపురం ఎక్కి అందరికీ వెల్లడించడం గురించి ఈ సహస్రాబ్ది ధారావాహిక తొలిభాగాల్లో విస్తారంగా చర్చించుకున్నాం) గురువుగారి చేత ఎంబెరుమానార్ (మా ప్రభువు) అని బిరుదు పొందిన శిష్యుడు రామానుజుడు. మళ్లీ రా నీకు చరమశ్లోకం (సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ, అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః) పరమార్థాన్ని వివరిస్తాను అని గోష్టీపూర్ణులు అనుగ్రహించారు. గురువు ఆశీస్సులు పొందడం కన్న విజయం ఏముంటుంది. అందుకే శ్రీరంగంలో జయజయధ్వానాలతో స్వాగతం చెప్పారు. రామానుజుని విద్యాతృష్ణ అంతులేనిది. గోష్టీపూర్ణులు ఒకసారి శ్రీరంగం వచ్చినపుడు స్వయంగా రామానుజుడిని చూచుటకు ఆశ్రమాన్ని సమీపించారు. ముందే గమనించిన రామానుజుడు ఎదురేగి సాష్టాంగ నమస్కారాలు చేసినారు. దీవిస్తూ రెండు చేతులతో లేవనెత్తి ఎంతో ఆప్యాయతతో ‘‘నీవు ఇంకా ఆళ్వారుల దివ్యప్రబంధాలను నేర్చుకోవాలి. నమ్మాళ్వారుల తిరువాయిమొళి అర్థాలు అంతరార్థాలు గ్రహించాలి’’ అన్నారు.
మాలాధరుడు– వరరంగడు
‘‘నాకెవరు ఉపదేశిస్తారు స్వామీ..’’ అని ప్రశ్నించారు. ‘‘నా సహాధ్యాయి స్నేహితుడు మాలాధరుడు ఉపదేశిస్తాడు..‘‘ అని మాలాధరుని దగ్గరకు తీసుకువెళ్లి రామానుజుని అప్పగించారు గోష్టీపూర్ణులు. కాంచీ పూర్ణుల మార్గదర్శకత్వం, మహాపూర్ణుల మహోపదేశం, గోష్టీపూర్ణుల మంత్రార్థ రహస్యోపదేశాల తరువాత ఆవిధంగా రామానుజుడు మాలాధరుడి శిష్యుడైనారు. గురువు చెప్పింది చెప్పినట్టు వినడంతోనే సరిపెట్టుకోకుండా దివ్యప్రబంధాలలో రచయితల భావాన్ని గమనించడానికి రామానుజుడు ఆలోచిస్తూ ఉండే వారు, గురువుగారి అన్వయానికి తోడు తను కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ సాగుతూనే ఉండేది. ఒక్కోసారి రామానుజుని సమన్వయం మాలాధరుడికి ఆశ్చర్యం కలిగించేది. ఇది మా గురువుగారు నాకెన్నడూ చెప్పలేదే అనిపించేది. నమ్మాళ్వారుల తిరువాయిమొళి ఉపదేశం సాగుతున్న సందర్భంలో ఒక పత్తు (పదిపాశురాలు) వివరణ పూర్తయింది. కాని ఒక పాశురంలో అర్థాన్ని విశదీకరిస్తూ ‘‘స్వామీ నీతో ఉన్న సంబంధాన్ని తెలియజేసే జ్ఞానాన్ని ఇచ్చినా, ఆ జ్ఞానాన్ని నశింపచేసే ఈ భౌతిక దేహంలో నన్ను బంధించినావే’’ అని ప్రశ్నించినట్టు మాలాధరుల వారు తెలిపారు. రామానుజులు ఆలోచనలో పడ్డారు. స్వామీ ఒక పత్తులో తొమ్మిది పాశురాలు ఒకరీతిలో భగవంతుని ప్రశంసలతో సాగి ఒక్క పాశురంలో మాత్రం ఈ విధంగా భగవంతుడిని నిందించే విధంగా నమ్మాళ్వార్లు వ్రాసి ఉంటారంటారా? జ్ఞానాన్ని దరిచేయనీయని ఈ భౌతిక దేహంలో చిక్కుకున్నప్పటికీ నాకు నీతో ఉన్న సంబంధ జ్ఞానాన్ని ప్రసాదించావు అని ఉంటారేమో కాస్త ఆలోచించండి అన్నారు రామానుజులు.
మాలాధరులకు ఈ వాదం నచ్చలేదు. నాకు మా గురువుగారు యామునాచార్యుల వారు ఈ వివరణ ఇవ్వలేదు. నీ అన్వయం నీదే. నీవు ప్రతిదానికీ కొత్తగా అన్వయాలు ఇస్తున్నావు. ఇది సరికాదు. అని మాలాధరులు బోధనను నిలిపివేసారు. రామానుజులు మౌనంగా నమస్కరించి వెళ్లిపోయారు. కొన్నాళ్ల తరువాత గోష్టీపూర్ణుల వారు రామానుజుని దివ్యప్రబంధ అధ్యయనం ఏ విధంగా ఉందని అడిగారు. ఆగిపోయిందని శిష్యులు తెలిపారు. వారికి వివరాలు తెలియవు. ఆయన వెంటనే శ్రీరంగానికి వచ్చి మాలాధరుని అడిగారు.. ‘‘ఏమైంది రామానుజుని దివ్యప్రబంధ విద్యాభ్యాసం ఆగిన మాట నిజమేనా’’.
‘‘అవును నేను చెప్పింది ఆయన వినడం లేదు. వేరే అర్థాలు ఊహిస్తున్నారు. యామునులు చెప్పని అన్వయాలు చేస్తున్నాడు. దీని అర్థం యామునాచార్యులను ధిక్కరించినట్టే అని నాకు అనిపించింది. మన గురువుగారికి వ్యతిరేక వ్యాఖ్యానాన్ని నేను వినదలుచుకోలేదు అందుకే ఆపాను’’ అని మాలాధరుడు వివరించాడు. అన్వయంలో విభేదాన్ని పూర్తిగా విన్నతరువాత ‘‘రామానుజుడి వ్యాఖ్యానమే సమంజసంగా ఉంది మాలాధరా.. నిజానికి యామునుల అంతరంగాన్ని రామానుజుడి కన్న తెలిసిన వారెవరైనా ఉన్నారా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇతర పాశురాల అర్థాలతో సమన్వయించి మొత్తం పాఠ్యం యొక్క సారాంశాన్ని గమనించి అన్వయం చేయడమే సరైనది కదా. యామునుల çహృదయం రామానుజుడికి బాగా తెలుసు. అతని వల్ల తప్పు జరగదు. రామానుజుడికి అన్నీ తెలుసు. కాని గురుముఖతః కొంత నేర్చుకునేందుకు శ్రీకృష్ణుడు సాందీపని ముందు కూర్చున్నట్టు రామానుజుడు మనముందు శిష్యుడై ఉన్నాడు. భవిష్యదాచార్యుడైన రామానుజుడు గురువు దగ్గరకు వెళ్లడం కాదు. గురువులే వెళ్లాలి. అది ఆధ్యాత్మిక అవసరం మాలాధరా..’’ అని యామునాచార్యులు మాలాధరుడిని తీసుకుని రామానుజుని వద్దకు వెళ్లారు. ఆచార్యులిరువురూ వస్తుండగా ఎదురేగి పాదాభివందనం చేసి సాదరంగా లోనికి తీసుకువెళ్లి గౌరవించారు రామానుజులు. మళ్లీ అధ్యయనం మొదలైంది. ఒక నూతన ధృక్కోణం నుంచి తిరువాయి మొళి అన్వయం సాగుతున్నది. రామానుజుడు కొత్త అర్థాలను ఆవిష్కరిస్తున్నారు. అన్వయాన్ని సమన్వయంగా చర్చిస్తున్నారు. మాలాధరులు సానుకూల ధోరణిలో ఈ అర్థాలు రామానుజునికి స్ఫురించడం గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోతున్నారు.
‘‘రామానుజా... నీవు ఒక్కరోజైనా యామునాచార్యులతో మాట్లాడలేదు. వారి ప్రబోధాలు వినలేదు.
నిన్ను ఆచార్యుల వారు రప్పించినా వారు దేహం వదిలిన తరువాతనే నీవు చేరుకున్నావు. వారి మనసు నీకెలా అర్థమయింది. ఏమిటీ సాహసం?’’ అని అడిగారు. ‘‘మన్నించండి స్వామి. అదంతా ఆచార్యుల అనుగ్రహం, మీదయ. నావరకు నేను యామునులకు ఏకలవ్యశిష్యుడిగా భావిస్తాను. నేను మీతో విభేదించడం లేదు. మీరు అర్థం చెప్పిన తరువాత నా మనసుకు తోచిన అర్థాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు సరైనదో కాదో విశదం చేస్తే ధన్యుడినౌతాను’’ అని వినయంగా సమాధానం చెప్పారు. ఆ కాలపు విశేషం ఏమంటే గురువులు తమకు తెలిసినది బోధించి, ఇతర విజ్ఞానానికి గాను మరొక ఆచార్యుడిని ఆశ్రయించాలని సహృదయంతో పంపేవారు. మాలాధరుడు కూడా తన దివ్యప్రబంధ బోధన ముగిసిందనీ, ఇక నీవు వరరంగమునిని ఆశ్రయించి తదుపరి విద్యాభ్యాసం కొనసాగించాలని నా సూచన. వారి దగ్గర ఇంకా అనేకానేక శాస్త్ర విద్యారహస్యాలు ఉన్నాయి. వారినాశ్రయించమనీ అన్నారు. ధన్యోస్మి అని వెంటనే రామానుజులు వారిదగ్గరకు వెళ్లారు. వరరంగముని ముందుగా రామానుజుని పరీక్షించారు. వినయాన్ని పరిశీలించారు. గురుభక్తిని సమీక్షించారు. ‘‘గురువును భగవంతుడిగా భావించే వాడే విద్యార్జనకు అర్హుడు. గురువు మనసు గెలుచుకోవడం ముఖ్యం. ఆచార్యులని మదిలో శిష్యుడిపట్ల ప్రేమాభిమానాలు కలిగే విధంగా శిష్యుడు వ్యవహరించాలి. గురువుకు ప్రేమ కలిగి శిష్యుడిపట్ల వాత్సల్యం పెంచుకుంటాడు. దాన్ని అలుసుగా తీసుకోకుండా, గురువును అలక్ష్యం చేయకుండా కేవలభావం లేకుండా నడుచుకోవాలి. గురువే భగవంతుడు. ఆ భావన కరువైన శిష్యుడికి భగవత్ ప్రాప్తి కూడా సందేహాస్పదమే అవుతుంది’’ అని ముందుగా గురుశిష్య సంబంధం గురించి వరరంగముని పాఠాలు చెప్పారు. రామానుజుడు అన్ని విధాలా అర్హుడని నిర్ణయించి శిష్యుడిగా స్వీకరించి తనకు తెలిసిన దివ్యప్రబంధ రహస్యాలను ఉపదేశించారు. ఎప్పటి వలెనే రామానుజుడు శ్రద్ధాభక్తులతో వినయవిధేయతలతో ఒక ఆదర్శ విద్యార్థిగా నేర్చుకున్నారు. గురుశుశ్రూష చేసి గురువు మనసు గెలిచి, విద్యను అభ్యసించారు.
రామానుజుని శిష్యులు
కురేశులు రామానుజాచార్యులకు ప్రధానమైన శిష్యుడు. కుర్ అనే గ్రామానికి అధినేత మహాసంపన్నుడు అయిన కురేశుడు తెల్లవారినప్పటి నుంచి రాత్రిదాకా దానాలు చేస్తూనే ఉంటాడు. వచ్చిన వారందరికీ దానాలు చేసిన తరువాత ఒక రోజు రాత్రి కురేశుని భవనం ప్రధాన ద్వారాన్ని మూసినప్పుడు దఢేలని ధ్వని వచ్చింది. ఆ ధ్వని ఏమిటని వరదరాజపెరుమాళ్‌ను లక్ష్మీదేవి అడిగింది. కురేశుడు రోజంతా వచ్చిన వారికి దానధర్మాలు చేసి ఇప్పుడే తలుపు మూసుకున్న చప్పుడది. ఎంత మంది వచ్చినా కాదనని కురేశుడి దానశీలాన్ని వరదుడు వివరిస్తే ఆయనను ఒక సారి చూడాలని లక్ష్మీదేవి భర్తను అడిగారు. సరేనని కురేశుడిని సతీసమేతంగా తీసుకురమ్మని వరదుడు కాంచీపూర్ణులను ఆదేశించారు. కాంచీపూర్ణుల వారు తమ ఇంటికి వచ్చి రమ్మని అడిగితే, తన ఇంటి తలుపు చప్పుడు గురించి వరదుడు లక్ష్మీదేవి మాట్లాడుకున్నారని తెలిసి కురేశుడు ఆండాళ్ ఆశ్చర్యపోతారు. తలుపు చప్పుడయ్యేట్టుగా వేయడం అహంకారానికి నిదర్శనంగా మారిందని తెలుసుకుని, ఎవరో వచ్చి తనను అడగడం కాదు, తామే వెళ్లి అందరికీ దానాలు చేయాలని కురేశుడు తనకు ఏమీ మిగుల్చుకోకుండా మొత్తం ఆస్తినంతా పేదలకు పంచి పెట్టారు. ఆ తరువాత కంచి వరదుడిని కురేశ దంపతులు దర్శనం చేసుకున్నారు. కురేశుని భార్య ఆండాళ్ క్షమాపణ వేడింది.
స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆచార్యుడైన రామానుజుడి దగ్గరకు వెళ్లాలని వారిరువురూ శ్రీరంగం బయలుదేరారు. దారిలో అరణ్యమార్గంలో ప్రయాణించినపుడు ఆండాళ్ కొంత భయపడితే, ఎందుకు భయపడుతున్నావు? చేపలు నీటిలో పురుగులను తినేస్తాయి. మరణం జీవితాన్ని తినేస్తుంది. దొంగలు ధనాన్ని తింటారు. మన దగ్గర ధనం ఏమీ లేదుకదా దొంగలేం చేస్తారు? అని అడిగాడు. మీరు నీళ్లు తాగడానికని ఒక బంగారు గిన్నె తెచ్చుకున్నాను అంటుంది ఆండాళ్. దాన్ని తీసుకుని విసిరి పారేస్తారు కురేశులు. ఏ భయమూ లేకుండా శ్రీరంగం చేరుకున్నారు. వారు రాగానే రామానుజులు ఆసనం దిగి ఎదురొచ్చి ఆలింగనం చేసుకుని లోనికి తీసుకువెళ్లారు.
గోవిందుడు
తన చిన్నమ్మ కుమారుడు గోవిందుడు శైవంనుంచి వైష్ణవంలోకి మళ్లితే బాగుండునని రామానుజుడు యోచించారు. శ్రీ కాళహస్తిలో శివుని సేవలో ఉన్న గోవిందుని రప్పించే బాధ్యతను మేనమామ శ్రీ శైలపూర్ణులకు అప్పగించారు రామానుజుడు. త్వరలోనే గోవిందుడు రామానుజుడి ప్రధాన శిష్యుడుగా చేరాడు. ఒకసారి భక్తులు గోవిందుని ప్రశంసించారు. అతని భక్తి, జ్ఞానము, గురుభక్తిని కొనియాడారు. దానికి గోవిందుడు అవునవునని తల ఊపినాడట. నిన్ను ప్రశంసిస్తున్నప్పుడు ఆ విధంగా ఒప్పుకోవడం ఆత్మస్తుతి కదా గోవిందా, ఆత్మస్తుతి పాపమని తెలియదా.. అని రామానుజుడు వారిముందే అడిగారట. స్వామీ వీరు నన్ను పొగుడుతున్నది మిమ్మల్ని ఆశ్రయించిన తరువాతనే కాని అంతకు ముందు కాదు. ఇప్పుడు నేను మీ శిష్యుడిని, ఈ వైభవమంతా మీది. మీ శిష్యత్వమే నాకు ఈ స్థితి కల్పించింది. సంసారకూపంలో పడిన నన్ను మీరు ఉద్ధరించారు. ఈ పొగడ్తలన్నీ మీవి. మీకే చెందుతాయి. అందుకే ఒప్పుకున్నాను. మిమ్మల్ని, మీ గురుత్వాన్ని, అనుగ్రహాన్ని ప్రశంసించడం సమంజసమే కదా. కనుక నేను అవునన్నాను. ఇందులో నా ప్రమేయమేమీ లేదుస్వామీ... అని వినయంతో వివరించారు గోవిందుడు. రామానుజుడు లేచి వచ్చి గోవిందుని కౌగలించుకుని, ‘‘గోవిందా నీకు కలిగినంత జ్ఞానం నాకు కూడా కలుగుగాక‘‘ అన్నారు.
ఆచార్య మాడభూషి శ్రీధర్
మాలాధర వరరంగల శిష్యరికం
Published Sun, Feb 4 2018 12:29 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment