తిరుపతి నగర నిర్మాత రామానుజుడు | Chidambaram is the capital of the Tamil Nadu Shivaratra | Sakshi
Sakshi News home page

తిరుపతి నగర నిర్మాత రామానుజుడు

Published Sun, Apr 22 2018 12:29 AM | Last Updated on Sun, Apr 22 2018 12:29 AM

Chidambaram is the capital of the Tamil Nadu Shivaratra - Sakshi

చోళరాజ్యానికి తమిళనాడులోని పుణ్యక్షేత్రం చిదంబరం రాజధాని. రాజు కులోత్తుంగ చోళుడు వీరశైవ భక్తుడు. అతనికెంత శివ భక్తి ఉందో అంతకుమించిన విష్ణు ద్వేషం ఉంది. చిదంబరం గొప్ప హరిహర క్షేత్రం. పరమ శివుడి ఆలయంతోపాటు పరమాత్ముడైన హరి రూపం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం కూడా పక్కనే ఉంది.  విష్ణువును గొప్పవాడుగా జనం నమ్మకుండా ఉండాలంటే విష్ణు విగ్రహాన్ని తొలగించాలనే మూర్ఖత్వంతో, విపరీతమైన విష్ణుద్వేషంతో కులోత్తుంగ చోళుడు ఆలయాన్ని ధ్వంసం చేసి, గోవిందరాజస్వామి మూల విగ్రహాన్ని పెరికించి సముద్రం పాలు చేశాడు. రామానుజులకు ఈ విషయాలన్నీ తెలుస్తూనే ఉన్నాయి. అంతటి దివ్యక్షేత్రాన్ని ధ్వంసం చేసినందుకు ఆయన చాలా బాధ పడ్డారు. రాజే ఇంత అన్యాయం చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు. అందుకని రామానుజుడు గోవిందరాజుకు మరొకచోట భవ్యమైన ఆలయం నిర్మించాలని తిరుపతిని ఎంచుకున్నారు. సుధామూర్తిగా (సుద్దమన్నుతో) గోవిందరాజు విగ్రహాన్ని తయారు చేయించి శయనమూర్తిగా హరిని ప్రతిష్టింపజేశారు. భూదేవి రూపమైన గోదాదేవిని స్వామికి దక్షిణాన పట్టమహిషిగా ప్రతిష్ఠించారు. పవిత్రమైన తిరుమల కొండను కాళ్లతో తొక్కబోమని కిందనుంచే నమస్కరించిన ఆళ్వార్ల విగ్రహాలను తిరుమల చూస్తున్నట్టుగా ప్రతిష్టింపజేశారు. నాలుగు మాడ వీధులను నిర్ణయించి, అర్చక, పాచక, అధికార, సేవక తదితర వర్గాలకు గృహసముదాయాలను నిర్ణయించి, జల వనరులను, వర్తక సౌకర్యాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. రామానుజుని ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా యాదవరాజు ఎత్తయిన గోపురాలు, విశాలమైన వీధులు, ప్రాకారాలతో తిరుపతి నగరాన్ని నిర్మించారు. దానికి శ్రీమద్రామానుజ పురం అని నామకరణం చేశారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుడు, తిరుపతిలో గోవిందరాజు తోడుగా ఉండి భక్తులను రక్షిస్తారని రామానుజులు ఏర్పాట్లు చేసారు. వ్యాసుడు రచించిన వరాహ పురాణంలో వేంకటేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రంలో ‘‘గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయతే నమః’’ అనే నామాన్ని సార్థకం చేస్తూ వారిరువురూ సోదర సమానులని నిర్ధారణ చేశారు.  

విష్ణుద్వేషి అయిన చోళరాజు దుష్టపు చూపు శ్రీరంగం పైన కూడా పడింది. అయితే ఆస్థాన నర్తకి, అద్భుత సౌందర్యరాశి, విష్ణు భక్తురాలు అయిన తిల్ల, రాజు దృష్టిని కొంతకాలం మరోవైపు మళ్లించడంలో సఫలీకృతురాలైంది. అదే సమయం లో ఉత్సవ విగ్రహాలను తిరుపతికి తరలించి వైష్ణవులు రాజు దుర్మార్గం నుంచి రక్షించారు. అందుకే అక్కడ ప్రతిష్టించిన గోవిందరాజమూర్తికి తిల్లై గోవిందరాజు అని నామకరణం చేశారు. ప్రాణాలకు తెగించి కాపాడిన భక్తురాలి పేరును భగవంతుడికి పెట్టడం రామానుజుడికే చెల్లింది.  ఈ నగర నిర్మాణానికి గాను రామానుజుడు సుదీర్ఘకాలం తిరుపతిలోనే ఉండవలసి వచ్చింది. అక్కడే శ్రీ భాష్య రచనకు ఆయన ఉపక్రమించారు. కొంత భాగం రచిస్తూ ఉండగా కొన్ని మౌలికమైన సందేహాలు తలెత్తాయట. సమాధానాల కోసం కురేశులను గోష్టీపూర్ణులవద్దకు పంపించి వారి వివరణలతో శ్రీభాష్య రచన తిరుపతిలో కొనసాగింది. మిగిలిన భాగం శ్రీరంగంలో పూర్తి చేశారు. యామునాచార్యుల ఆశయాలను నెరవేర్చుతూ తిరుమల తిరుపతి, శ్రీరంగం దివ్యదేశాలలో సక్రమమైన వైష్ణవారాధనా వ్యవస్థలను స్థిరీకరించి కట్టుదిట్టం చేశారు రామానుజులు. ఈ విషయాలన్నీ తెలిసి కులోత్తుంగచోళ రాజు రగిలిపోయాడు. తాను నాశనం చేసిన చిదంబరం విష్ణు ఆలయాన్ని తిరుపతిలో అంతకన్నా భవ్యంగా నిర్మించాడని తెలుసుకున్న ఆ రాజు కోపం మిన్నంటింది. శ్రీమద్రామానుజుల మీద ఎందుకో కోపం కలిగిన ఒక దుష్ట వైష్ణవుడు నాలూరాన్‌ చోళరాజు ద్వారా రామానుజుల మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు ‘‘విగ్రహాన్ని సముద్రంలో పారవేయిస్తే వైష్ణవం అంతరించదు రాజా, వైష్ణవాన్ని శరవేగంగా దేశమంతటా వ్యాప్తిచేస్తున్న రామానుజుడిని అరికడ్తేనే అది సాధ్యం’’ అన్న నాలూరాన్‌ దుర్బోధ చెవికెక్కింది. శాస్త్రవాదానికి రమ్మంటే వస్తాడని రామానుజుడిని రాజధానికి రప్పించాలని కొందరు సైనికులను శ్రీరంగానికి పంపిస్తూ, రానంటే బంధించి తీసుకు రమ్మని రాజు ఆదేశించాడు. సైనికులు వచ్చి ‘శాస్త్ర వాదానికి రామాజునులు రావాలని రాజాజ్ఞ, రమ్మని చెప్పండి’ అన్నారు. రామానుజులు అనుష్టానానికి లోపలి గదిలో ఉన్నారు. రాబోయే అనర్థం ఏమిటో కూరేశుడికి అర్థమైంది. చోళ రాజు దౌర్జన్యం నుంచి ఏదో విధంగా రామానుజుడిని దక్కించుకోవాలి. ఆ సైనికాధికారులకు రామానుజుడెవరో తెలియదు. కనుక కాషాయ దండ కమండలాలు ధరించి తానే రామానుజుడినని పరిచయం చేసుకుని వారి వెంట బయలు దేరాడు. ఒంటరిగా కూరేశుడిని వెళ్లనివ్వడం ప్రమాదమని తెలిసి మహాపూర్ణులు తోడుగా బయలుదేరారు.వృద్ధుడైన తండ్రికి సాయంగా ఉండడం కోసం అత్తుళాయమ్మ కూడా నడిచింది. వెళ్లేముందు ముదలియాండాన్‌ (దాశరథి)కి ధనుర్దాసుకు రామానుజుల వారిని జాగ్రత్తగా పశ్చిమాన ఉన్న చోళ రాజుతో వైరం ఉన్న హోయసల రాజుల సామంతులైన కళ్యాణ చాణుక్యుల పాలనలోని కర్ణాటక తొండనూరు రాజ్యానికి తరలించి రక్షించమని రహస్యంగా చెప్పారు. 

చోళరాజు క్రూరచర్య
కులోత్తుంగచోళుని రాజసభలో శాస్త్రమూ లేదూ చర్చా లేదు. మూర్ఖంగా అతని నిర్ణయాలను ఒప్పుకోవలసిందే, లేకపోతే శిక్షిస్తాడు. వాదాన్ని వినిపించే ప్రయత్నం చేశారు కూరేశులు. శృతి స్మృతి పురాణాలనుంచి కూరేశులు ఎన్ని ప్రమాణాలు చూపినా వినకుండా, కులోత్తుంగ చోళుడు కూరేశులు, మహాపూర్ణుల నేత్రాలు పెరికించమని ఆదేశించాడు. ‘ఓరీ దుర్మార్గుడా నీవంటి పాపాత్ముడిని చూసిన కళ్లతో నేను నా ఆచార్యుడిని, శ్రీరంగని చూడలేను. నీవు పీకేదేమి, నేనే నా కళ్లు పెరుక్కుంటాను’ అని చెప్పి కళ్లు పెరుక్కున్నారు. మహాపూర్ణులు 105 సంవత్సరాల వృద్ధులని కూడా చూడకుండా కళ్లు పొడిపించి, అతి క్రూరంగా వారిని సభనుంచి తరిమివేశారు.  అంధులై కళ్లనుంచి నెత్తురోడుతున్న ఆ ఇద్దరిని వెంట తీసుకుని అత్తుళాయమ్మ శ్రీరంగం వైపు నడిచింది. కూరేశులు ఆ బాధను తట్టుకోగలిగినా వార్థక్యంతో కనులు పీకిన బాధ భరించలేక మహాపూర్ణులు ‘‘కూరేశా ఇక నాకు సమయం తీరింది నాయనా,’’ అని శిరసు ఆయన ఒడిలో ఉంచి, అత్తులై ఒడిలో కాలు పెట్టుకుని (1102లో) తుది శ్వాస విడిచారు. ఇతర వైష్ణవమిత్రుల సాయంతో ఆచార్యులవారికి సంస్కారం చేశారు కూరేశులు. రామానుజుని రక్షించుకోవడానికీ జీవితాన్నే ఫణంగా పెట్టి మూర్ఖుడైన శత్రురాజు ఎదుట నిలబడడం అపూర్వమైన త్యాగం కూరేశులదైతే ప్రాణమే అర్పించిన మహాపూర్ణులది మహా త్యాగమే. ఆ తరువాత కూరేశుడు శ్రీ రంగనాథుడి ఆలయానికి వెళ్లాలనుకున్నారు. కాని భటులు అడ్డగించి రామానుజుని అనుచరులెవరూ రంగనాథుడి ఆలయంలోకి వెళ్లరాదని నిషేధ శాసనం విధించారని చెప్పారు. రామానుజుడు నా గురువు కాదని చెప్పండి లోనికి అనుమతిస్తాం అన్నారు వారు. ఎంచుకోవలసింది రామానుజుడినో రంగనాథుడినో అయితే నేను రామానుజుడినే ఎంచుకుంటాను ఏం చేసుకొంటారో చేసుకోండి అని కూరేశుడు వెళ్లిపోయారు. రంగని చూడలేక, ఆలయంలోకి వెళ్లలేక రామానుజుని వదులుకోలేక కూరేశుడు శ్రీరంగాన్నే వదులుకున్నాడు. భార్య ఆండాళమ్మను కొడుకులను, కోడళ్లను తీసుకుని తిరుమాలిరుంశోలైకి వెళ్లిపోయారు.   

కర్ణాటకలో రామానుజులు 
అప్పడికే రామానుజుడు కాషాయం వదలి శ్వేతవస్త్రం ధరించి కర్ణాటకకు రహస్యంగా తరలిపోయారని తెలుసుకుని కూరేశులు సంతోషించారు. తనకు చెప్పకుండా కూరేశులు, మహాపూర్ణులు మృత్యు కుహరంలోకి వెళ్లారే అని రామానుజుడు బాధపడుతూ కీకారణ్యాలు దాటుతున్నారు. నీలగిరి పర్వతాలను చేరుకున్నారు. విపరీతమైన వర్షం కురవడంతో రామానుజులు, ఆయన శిష్యులు విడిపోయినారు. ఒకరినొకరు వెతుకుతూ ఉన్న దశలో శిష్యులకు కొందరు గిరిజనులు కనిపించారు. ‘‘మీరెవరు ఎక్కడినుంచి వస్తున్నార’’ని అడిగారు. ‘శ్రీరంగంనుంచి’ అని చెప్పగానే ‘రామానుజులు క్షేమమేనా’ అని అడిగారు. రామానుజులు అడవిలో దారితప్పారని చెప్పగానే వారు కూడా వెతకడం మొదలుపెట్టారు. ఆరురోజులు వెదికినా ప్రయోజనం లేకపోయింది. ఓ రాత్రి చలిమంటలు రగిల్చి కూచున్నారు. అక్కడికి ఒక శ్వేతవస్త్రధారి వచ్చి ‘‘ఇక్కడ జనావాసమేమయినా ఉందా’’ అని అడిగారు. చలికి ఆకలికి బాధపడుతున్న ఆ వైష్ణవుడిని ముందు చలిమంటల చెంత కూర్చోబెట్టారు. ఆయన శ్రీరంగం నుంచి వచ్చారని తెలుసుకుని ‘రామానుజులెక్కడున్నార’ని అడిగారు. ‘మీకు రామానుజులు ఏ విధంగా తెలుసున’ని ప్రశ్నిస్తే నల్లాన్‌ చక్రవర్తి శిష్యులమనీ భగవద్రామానుజులే తమకు మోక్షమార్గమని చెప్పారని వివరించారు. కూరేశుని వస్త్రాలలో ఉన్న వీరే రామానుజులని శిష్యుడు తెలిపారు. సాష్టాంగ దండాలు పెట్టి, కొర్రలను పిండిగా కొట్టి తేనెతో ఆరగించమని పెట్టారు. చెక్కతో పాదుకలు చేసి సమర్పించారు. ఆ అడవిలోనే రామానుజులను కట్టెలు కొట్టే వారి యజమాని ఇంటిలో దించారు. ఆ యజమాని భార్య కొంగిల్‌ పిరాట్టి (చేలాచలాంబ) ఒకసారి కరువు వల్ల శ్రీరంగానికి వలసబోయినప్పుడు రామానుజుడు ఏడిళ్లలో భిక్షాటన చేయడం, వందలాది శిష్యులు ఆయనను అనుసరించడం చూసి, ఇంతమంది మీవెంట రావడానికి కారణమేమిటి అని ఆయన్నే అడిగింది. ‘‘నేను వీరికి నారాయణ మంత్రం బోధించానమ్మా. సంసారం తరించడానికి అదే మార్గం. వీరంతా అందుకే నా శిష్యులుగా ఉన్నారు’’.  

‘‘స్వామీ అయితే నాకూ ఆ మంత్రం బోధించండి’’ అని అడిగిందామె. నీకు శ్రద్ధ ఉంటే చాలు తల్లీ అని మంత్రోపదేశం చేశారు. మిమ్మల్ని ఆరాధించడానికి నాకు ఏదైనా అనుగ్రహించండి అని ఆమె ప్రార్థించింది. రామానుజులు ఆమెకు పాదుకలను ఇచ్చారు. వర్షాలు కురిసాయని తెలిసి ఆ తరువాత ఆమె మళ్లీ నీలగిరి కొండప్రాంతాలకు వచ్చింది. అప్పడినుంచి రామానుజుని దర్శనమే కాలేదు. వచ్చింది రామానుజుడని తెలుసుకుని ఆమె ప్రసాదం వండి రోజుటి వలెనే పాదుకలకు నైవేద్యం చేసి స్వామిని సాపాటుకు రమ్మని కోరింది. ‘‘అమ్మా శ్రీహరికి నివేదించని ఆహారాన్ని నేను తీసుకోకూడదు. అది నా వ్రతం. నీవు ప్రసాదాన్ని నా పాదుకలకు నివేదించావు కదా’’ అన్నారు. కొంగిల్‌ బయటకు వెళ్లి పాలు పండ్లూ తెచ్చి ఇచ్చింది. గురుపాదాలకు నివేదించిన విందును శిష్యులంతా స్వీకరించారు. కొంగిల్‌ పిరాట్టి ప్రేరణతో కోయవారు, కట్టెలు కొట్టుకునే వారంతా రామానుజుని శిష్యులైనారు. 

రామానుజులు అక్కడినుంచి వహ్ని పుష్కరంమనే రామనాథపురానికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఆగి అక్కడినుంచి మిథిలా సాలిగ్రామం (మిర్లే సాలగ్రామం) చేరుకున్నారు. అక్కడ వడుగనంబి (ఆంధ్రపూర్ణులు) రామానుజుyì ని ఆశ్రయించి ఆయన ప్రియమైన శిష్యుడిగా ఎదిగాడు. ఆంధ్రపూర్ణులు ఒక్కరోజు కూడా శ్రీఆచార్య పాద తీర్థం లేకుండా ఉండలేనంత సన్నిహితులైనారు. రామానుజులు అక్కడినుంచి బయలుదేరి వెళ్తున్నట్టు చెప్పారు. మీ పాద తీర్థం లేకుండా రోజు ఎలా గడుస్తుంది ఆచార్యా అన్నారు. అక్కడున్న కొలనులో తన పాదం ఉంచి ఇదే నీ గురు పాద తీర్థం సరేనా అన్నారు రామానుజులు. ఈ సంఘటన వల్లనే ఆ గ్రామానికి సాలగ్రామమని పేరు వచ్చింది. 

అక్కడినుంచి తొండనూరు చేరుకున్నారు యతిరాజు. తొండనూరు విఠల దేవరాయని పాలనలో ఉంది. విఠల దేవరాయుడు జైనమతాన్ని ప్రోత్సహించేవాడు. ఆ రాజుకు రెండు సమస్యలు న్నాయి. రాజ్యం దుర్భిక్ష పీడితమైతే రాజకుమారి గ్రహపీడితురాలై ఉన్నది. పరిష్కారాన్ని ఆశించి జైనమత గురువులను తన ఇంటి విందుకు పిలిచాడు. ‘‘రాజా! యుద్ధంలో వేలు పోగొట్టుకున్న నీవు అంగవిహీనుడివి, విఠల దేవరాయనివి కాదు ఉట్టి భిట్టి దేవుడవు. నీవంటి అంగవిహీనుని ఇంట భోజనం చేయడం మతవిరుద్ధం. నీ మీద మా మంత్రాలు కూడా పారవు’’ అని చెప్పి విందుకు రాలేదు. రాజు చాలా దుఃఖించారు. రాణి ఆయనను ఓదార్చి, ‘‘శ్రీరంగం నుంచి యతిరాజు రామానుజులు వచ్చి తొండనూరులో ఉన్నారట. ఆయన ఇదివరకు ఒక రాజకుమారికి పట్టిన బ్రహ్మరాక్షసిని విడిపించిన మహిమాన్వితుడు. ఆ పవిత్రమూర్తి కాలిడిన చోట వర్షాలు పడతాయి, నేల సస్యశ్యామలమవుతుందంటారు. ఆ మహానుభావుడిని ఆహ్వానించండి. ఆపైన మన అదృష్టం’’. అప్పటికి రాజుకు మరో మార్గం కనిపించలేదు. యతిరాజును పిలిచారు. 
రామానుజులు శిష్యసమేతంగా రాజభవనానికి వెళ్లి రాకుమారిని సమక్షంలోకి తీసుకురమ్మని చెప్పారు. ఆమె వచ్చింది. పరిశీలించారు. గ్రహపీడ తొలగాలని ప్రార్థిస్తూ రామానుజాచార్య మంత్రపూరిత తీర్థాన్ని ఆమెపైన చిలకరించారు. ఆమెను పట్టిన బ్రహ్మరాక్షసి వదిలిపోయింది. ప్రశాంతమైన రాకుమారి సిగ్గుపడి లోనికి వెళ్లింది. రాజు ఆనంద భరితుడై ‘‘నేనూ నా రాజ్యం పరివారం జనం మీ అధీనం స్వామీ’’ అని రాజు శరణువేడాడు. రాజ దంపతులు జైనాన్ని వదిలి వైష్ణవాన్ని స్వీకరించి రామానుజుని శిష్యులైనారు. విఠల దేవరాయుడికి విష్ణువర్ధన రాయలని నామకరణం చేశారు. రాజే శిష్యుడు కాగానే ఆయన పరివారం చాలామంది జనులు కూడా అదే దారిలో నడిచారు. 
ఆచార్య మాడభూషి శ్రీధర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement