చిదంబరం కుటుంబం
కుంటి సాకులు, కారణాలు వద్దు.. విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందే.. అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుటుంబానికి చెన్నై ఎగ్మూర్ కోర్టు అక్షింతలు వేసింది. ఆగస్టు 20వ తేదీ జరిగే విచారణకు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని న్యాయమూర్తి మలర్ వెలి సోమవారం ఆదేశాలు ఇచ్చారు.
సాక్షి, చెన్నై : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుటుంబాన్ని గురిపెట్టి సాగిన, సాగుతున్న ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సతీమణి నళిని, కుమారుడు కార్తీ చిదంబరం కొన్ని కేసుల్లో కోర్టు విచారణల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే, పి.చిదంబరం సైతం సీబీఐ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కార్తీ చిదంబరం అరెస్టయి బెయిల్ మీద బయట ఉన్నారు. చిదంబరం సైతం అరెస్టు కావచ్చన్న ప్రచారం ఉంది. ఈ కేసులు, విచారణల్ని పక్కన పెడితే, విదేశాల్లో చిదంబరం కుటుంబం ఆస్తుల్ని గడించి ఉండడాన్ని ఇటీవల ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఇంగ్లండ్‌లో రూ.5.31 కోట్లతో రెండు ఆస్తులు, అమెరికాలో రూ.3.25 కోట్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల్ని ఆదాయ పన్ను లెక్కల్లో చూపించలేదని తేలింది. దీంతో నల్లధనం నిరోధక చట్టం కింద నళిని, కార్తీ, శ్రీనిధి మీద కేసు నమోదుచేశారు. ఇందుకు తగ్గ పిటిషన్ ఎగ్మూర్ కోర్టులో విచారణలో ఉంది.
స్వయంగా కోర్టుకు రండి
గత వారం ఈ కేసు విచారణకు రాగా నళిని, కార్తీ, శ్రీనిధి కోర్టుకు హాజరు అయ్యారు. న్యాయమూర్తి మలర్ వెలి ఈ ముగ్గురి వద్ద వేర్వేరుగా విచారణ జరిపారు. తదుపరి విచారణకు హాజరు కావాలని ఈ ముగ్గురికి సూచించారు. సోమవారం పిటిషన్ విచారణకు రాగా, ఆ ముగ్గురు డుమ్మా కొట్టారు. వారి తరపున హాజరైన న్యాయవాదులు ఓ పిటిషన్‌ను న్యాయమూర్తి ముందు ఉంచారు. నళిని చిదంబరం సుప్రీం కోర్టుకు వెళ్లారని, కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లారని, డాక్టరుగా ఉన్న శ్రీనిధి వైద్యపరంగా బిజీగా ఉన్నారని అందులో వివరించారు.
ఈ ముగ్గురు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి ఉందని, మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఆదాయ పన్ను శాఖ తరఫున తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అయింది. చివరకు న్యాయమూర్తి స్పందిస్తూ, కుంటి సాకులు, కారణాలు వద్దు అని, విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిందేనని అక్షింతలు వేశారు. ఏదోఒక కారణాలతో విచారణకు గైర్హాజరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తే, సమన్లు జారీ చేయక తప్పదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆ ముగ్గురు స్వయంగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశించారు. విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజును తప్పనిసరిగా రావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో చిదంబరం ఫ్యామిలీ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment