egmore court
-
కోర్టులో విశాల్ లొంగుబాటు
చెన్నై ,పెరంబూరు: నటుడు విశాల్ బుధవారం చెన్నై, ఎగ్మూర్ కోర్టులో లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే నటుడు విశాల్ తనపేరుతో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. అందుకోసం స్థానిక వడపళనిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే వారికి చెల్లించే వేతనాలకు సంబంధించి టీటీఎస్‌ను ఆదాయశాఖకు కట్టడం లేదు. అలా సుమారు రూ.4 కోట్ల వరకూ బాకీ ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆదాయ పన్ను శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినా విశాల్ స్పందించలేదు. దీంతో ఆదాయపన్ను శాఖాధికారులు విశాల్‌పై స్థానిక ఎగ్మూర్ న్యాయస్తానంలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వలర్మతి విశాల్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేశారు. అయినా విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరయ్యారు. దీంతో మంగళవారం మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సారి కూడా విశాల్ హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేశారు. దీంతో బుధవారం ఉదయం నటుడు విశాల్ కోర్టులో లొంగిపోయారు. అయితే ఆయన్ని సుమారు రెండుగంటలకు పైగా అంటే మధ్యాహ్నం వరకూ వేచి ఉంచారు. అనంతరం కేసుపై విచారణ జరిపా రు. ఆయనపై అరెస్ట్ వారెంట్‌ను వెనక్కి తీసుకునేలా న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అయితే కేసు మాత్రం విచారణలోనే ఉంది. -
కారణాలు వద్దు.. కోర్టుకు రండి!
కుంటి సాకులు, కారణాలు వద్దు.. విచారణ నిమిత్తం స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందే.. అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుటుంబానికి చెన్నై ఎగ్మూర్ కోర్టు అక్షింతలు వేసింది. ఆగస్టు 20వ తేదీ జరిగే విచారణకు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనని న్యాయమూర్తి మలర్ వెలి సోమవారం ఆదేశాలు ఇచ్చారు. సాక్షి, చెన్నై : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కుటుంబాన్ని గురిపెట్టి సాగిన, సాగుతున్న ఐటీ, సీబీఐ, ఈడీ దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సతీమణి నళిని, కుమారుడు కార్తీ చిదంబరం కొన్ని కేసుల్లో కోర్టు విచారణల్ని ఎదుర్కొంటున్నారు. అలాగే, పి.చిదంబరం సైతం సీబీఐ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కార్తీ చిదంబరం అరెస్టయి బెయిల్ మీద బయట ఉన్నారు. చిదంబరం సైతం అరెస్టు కావచ్చన్న ప్రచారం ఉంది. ఈ కేసులు, విచారణల్ని పక్కన పెడితే, విదేశాల్లో చిదంబరం కుటుంబం ఆస్తుల్ని గడించి ఉండడాన్ని ఇటీవల ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. ఇంగ్లండ్‌లో రూ.5.31 కోట్లతో రెండు ఆస్తులు, అమెరికాలో రూ.3.25 కోట్లతో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాల్ని ఆదాయ పన్ను లెక్కల్లో చూపించలేదని తేలింది. దీంతో నల్లధనం నిరోధక చట్టం కింద నళిని, కార్తీ, శ్రీనిధి మీద కేసు నమోదుచేశారు. ఇందుకు తగ్గ పిటిషన్ ఎగ్మూర్ కోర్టులో విచారణలో ఉంది. స్వయంగా కోర్టుకు రండి గత వారం ఈ కేసు విచారణకు రాగా నళిని, కార్తీ, శ్రీనిధి కోర్టుకు హాజరు అయ్యారు. న్యాయమూర్తి మలర్ వెలి ఈ ముగ్గురి వద్ద వేర్వేరుగా విచారణ జరిపారు. తదుపరి విచారణకు హాజరు కావాలని ఈ ముగ్గురికి సూచించారు. సోమవారం పిటిషన్ విచారణకు రాగా, ఆ ముగ్గురు డుమ్మా కొట్టారు. వారి తరపున హాజరైన న్యాయవాదులు ఓ పిటిషన్‌ను న్యాయమూర్తి ముందు ఉంచారు. నళిని చిదంబరం సుప్రీం కోర్టుకు వెళ్లారని, కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లారని, డాక్టరుగా ఉన్న శ్రీనిధి వైద్యపరంగా బిజీగా ఉన్నారని అందులో వివరించారు. ఈ ముగ్గురు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితి ఉందని, మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇందుకు ఆదాయ పన్ను శాఖ తరఫున తీవ్ర ఆక్షేపణ వ్యక్తం అయింది. చివరకు న్యాయమూర్తి స్పందిస్తూ, కుంటి సాకులు, కారణాలు వద్దు అని, విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాల్సిందేనని అక్షింతలు వేశారు. ఏదోఒక కారణాలతో విచారణకు గైర్హాజరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తే, సమన్లు జారీ చేయక తప్పదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆ ముగ్గురు స్వయంగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశించారు. విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజును తప్పనిసరిగా రావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో చిదంబరం ఫ్యామిలీ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి. -
కోర్టుకు దినకరన్
► చార్జ్‌షీట్ దాఖలు ► ఇక, సాక్షుల వద్ద విచారణ ► సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారు ► టీటీవీ వ్యాఖ్య సాక్షి, చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనపై అభియోగం మోపుతూ ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల్ని విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించినట్టుగా కోర్టు ముందు దినకరన్ వాదన వినిపించారు. టీటీవీ దినకరన్‌పై విదేశీ మారక ద్రవ్యం కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టులో సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో తాజాగా, కేసు విచారణ వేగాన్ని న్యాయమూర్తి మలర్మతి పెంచారు. విచారణకు దినకరన్ తొలుత హాజరైనా తదుపరి గైర్హాజరయ్యారు. ఇందుకు కారణం రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పరిమితం చేయడమే. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడంతో గురువారం విచారణ నిమిత్తం ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు. కోర్టుకు దినకరన్.. ఉదయం న్యాయమూర్తి మలర్మతి ఎదుట విచారణకు దినకరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ వర్గాలు ఆయన మీద అభియోగం మోపుతూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారని, తనపై అభియోగాలు మోపుతున్నారని పేర్కొంటూ దినకరన్ న్యాయమూర్తి ఎదుట తన వాదన వినిపించారు. ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి ప్రశ్నించారు. సాక్షులను ప్రవేశ పెట్టాలని సూచించారు. అయితే, ప్రస్తుతం సాక్షులు రాలేదని, సమయం కేటాయించాలని కోరారు. దీంతో ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల వద్ద విచారణ సాగుతుందంటూ తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. కోవైకు సుఖేష్: టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులకు అడ్డంగా బుక్ చేసిన బ్రోకర్ సుఖేష్ చంద్ర శేఖర్‌ను గురువారం కోయంబత్తూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోయంబత్తూరు గణపతి శివశక్తి కాలనికి చెందిన బాలకృష్ణ కుమారుడు రాజవేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుఖేష్ చంద్ర శేఖర్, అతడి తండ్రి చంద్రశేఖర్‌ల మీద మోసం కేసు నమోదై ఉంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన ఈ ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చారు. చంద్ర శేఖర్ విచారణకు హాజరవుతుండగా, సుఖేష్ పత్తా లేకుండా పోయాడు. ఢిల్లీ పోలీసులు రెండాకుల చిహ్నం కేసులో అతడ్ని అరెస్టు చేయడంతో కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి రాజ్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. సుఖేష్‌ను ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో గట్టి భద్రత నడుమ సుకేష్‌ను ఢిల్లీకి రైల్లో తరలించారు. -
జయలలిత ఫ్రెండ్ కి కోర్టు నోటీసులు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు గీతకు ఎగ్మూరు నేరవిభాగ కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నెల 11వ తేదీలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. జయలలిత మరణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని కోరుతూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో నోటీసులిచ్చింది. జయలలిత గతేడాది సెప్టెంబర్ 22న అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆమె మృతిపై పలు వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయ మరణంపై తనకు సందేహం ఉందని, ఆమెను హత్య చేశారనే అనుమానాలున్నట్లు గీత పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత చికిత్స గురించి ఢిల్లీలో సమర్పించిన నివేదిక అబద్దపు నివేదిక అని, అసలైన నివేదిక తన వద్ద ఉందని గీత చెబుతున్నారు. -
కటకటాల్లో.. వైగో
దేశద్రోహం కేసులో అరెస్టు 5 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ ఎగ్మూరు కోర్టు ఆదేశం సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగో మళ్లీ కట కటాల్లోకి వెళ్లారు. దేశద్రోహం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలతో ఆయన్ను పుళల్ జైలుకు తరలించారు. బెయిల్‌కు అవకాశం కల్పించినా, వైగో తిరస్కరించారు. ఒకప్పుడు డీఎంకే ప్రచార ఫిరంగిగా తన వాక్‌ధాటితో తమిళ రాజకీయాల్లో వైగో ఓ వెలుగు వెలి గారు. డీఎంకే నుంచి బయటకు వచ్చి ఎండీఎంకే ఆవిర్భావంతో కష్టాలు తప్పలేదు. తొలి నాళ్లల్లో ఆదరణ లభిం చినా, క్రమంగా కేడర్ మళ్లీ మాతృగూటికి చేరడంతో తంటాలు ఎదుర్కొంటూ, పార్టీని నెట్టుకు వస్తున్నారు. అయితే, ఎల్‌టీటీఈలకు వీరవిధేయుడిగా వ్యవహరిస్తూ, తరచూ వివాదాల్ని కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల్లో ముందుండే వైగో తరచూ జైలు జీవి తాన్ని గడపక తప్పలేదు. 2001లో ఎల్‌టీటీఈలకు మద్దతుగా వివా దాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు. 2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు. సోమవారం న్యాయమూర్తి గోపీనాథ్ ముందు జరిగిన విచారణలో వైగో తన వాదనలో ఎల్టీటీఈకి మద్దతును సమర్థించుకున్నారు. గతంలో వైగో వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నట్టు ఈసందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సమయంలో వైగో స్పందిస్తూ, నాడు, నేడు, రేపు ఎల్లప్పుడు ఎల్‌టీటీఈలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాననని, తన ధో?రణిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. దీంతో ధోరణి మారని పక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఇందుకు తాను సిద్ధం అని వైగో వ్యాఖ్యానించడంతో 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, వైగోకు బెయిల్ అవకాశాన్ని కోర్టు కల్పించింది. తనకు బెయిల్ వద్దు అని, జైలు శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైగో స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు పదిహేను రోజుల జుడీషియల్ కస్టడీ నిమిత్తం పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. -
నటుడు ధనుష్‌కు కోర్టు సమన్లు
చెన్నై : నటుడు ధనుష్‌కు చెన్నై ఎగ్మూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.వివరాల్లోకెళితే నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ సూడిమోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రంలో న్యాయవాదులను కించపరచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ అఖలభారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం మెజిస్ట్రేట్ మురుగన్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తర పున న్యాయవాది నమోనారాయణ హాజరయ్యి తన వాదనలను వినిపించి భారతశిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆయన వాదనలను విన్న న్యాయమూర్తి నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీ చేశారు. -
జయకు ఊరట!
ఆదాయపు పన్ను దాఖలు కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఊరట లభించనుంది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ నిర్ణరుుంచింది. సుమారు 18 ఏళ్లుగా జయలలిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసు మరో వారంలో కొలిక్కి రానుంది. సాక్షి, చెన్నై: జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ పై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన కేసు విచారణ ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ పలు మార్లు ఆ ఇద్దరికి సమన్లు జారీ అయ్యూరుు. అరుుతే ఏదో ఒక కారణంతో వాయిదాలతో డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ కేసు విచారణ ముగింపునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సైతం ముగిసింది. దీంతో విచారణను త్వరితగతిన ముగించే విధంగా న్యాయమూర్తి దక్షిణామూర్తి కార్యచరణ సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో జయలలితకు జైలు శిక్ష పడడంతో కేసు మళ్లీ వాయిదాలతో సాగుతోంది. తదుపరి విచారణ మరో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు జయలలిత తరపు న్యాయవాదులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. ఇది వరకే ఆదాయపన్ను శాఖ కేంద్ర కమిషన్ వద్ద జయలలిత తరుపున విజ్ఞాపన పెండింగ్‌లో ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఆ కమిషన్ సామరస్య పూర్వక పరిష్కారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జరిమానా కట్టేందుకు సిద్ధం ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని జయలలిత తరపున ఆదాయపన్ను శాఖకు స్పష్టమైన సంకేతం వెళ్లింది. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జయలలిత తరపు విజ్ఞప్తిని అంగీకరించిన ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కమిషన్ సానుకూలత వ్యక్తం చేసింది. చెల్లించాల్సిన మొత్తాన్ని చెన్నైలోని ఆదాయపు పన్ను శాఖ ప్రకటిస్తుందని పేర్కొంది. ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు జయలలిత తరపు ప్రతినిధులు సిద్ధమయ్యారు. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారం కావడంతో ఇక ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ఆదాయపన్ను శాఖ తేనుంది. మరో వారంలో ఎగ్మూర్ కోర్టు ముందు తమ వాదన వినిపించనుంది. తర్వాత జయలలితకు ఊరట కలిగించే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. -
మినహాయించండి
సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసులో విచారణకు స్వయంగా హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఎగ్మూర్ కోర్టులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ వేర్వేరుగా గురువారం పిటిషన్లను దాఖలు చేశారు. తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలపై ఆదాయపు పన్ను దాఖలు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టులో ఏళ్ల తరబడి సాగుతోంది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ వేగం పెరిగింది. అయినా, వాయిదాల మీద వాయిదాలతో కాలయాపన సాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడవు ముగిసినా, మళ్లీ పొడిగించుకోవాల్సిన పరిస్థితి ఎగ్మూర్ కోర్టుకు ఏర్పడింది. ఈ కేసు విచారణ ముగింపు లక్ష్యంగా న్యాయమూర్తి దక్షిణా మూర్తి చర్యలు చేపట్టిన సమయంలో జయలలిత, శశికళ అండ్ బృందానికి బెంగళూరు కోర్టు శిక్ష విధించింది. ఆ ఇద్దరు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో కేసును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు జయలలిత, శశికళ బెయిల్ మీద బయటకు రావడంతో ఆ ఇద్దర్నీ కోర్టుకు రప్పించేందుకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు. సమన్లు జారీ : విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ కావడంతో జయలలిత, శశికళ తరపు న్యాయవాదులు మేల్కొన్నారు. ఇప్పటికే జైలు శిక్ష నేపథ్యంలో పడుతున్న తంటాలకు ఆదాయపు పన్ను దాఖలు కేసు ఎక్కడ ఇరకాటంలో పడేస్తుందోనన్న బెంగ తప్పలేదు. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయపు పన్ను శాఖతో సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యల్లో ఉన్నామని, ఇందుకు కాస్త సమయం పట్టొచ్చంటూ హైకోర్టుకు వివరించారు. అంత వరకు స్వయంగా ఎగ్మూర్కోర్టుకు జయలలిత, శశికళ హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో నవంబర్ 28 వరకు మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆ ఇద్దరికీ కాస్త ఊరట నిచ్చింది. ఒకటికి వాయిదా : గురువారం నాటి విచారణకు జయలలిత, శశికళ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, హైకోర్టు కల్పించిన ఊరటను ఎత్తి చూపుతూ ఆ ఇద్దరి తరపు న్యాయవాదులు ఎగ్మూర్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈనెల 28 వరకు జయలలిత, శశికళ ఎలాంటి విచారణలకు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఇద్దరి తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. చివరకు తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.