కోర్టుకు దినకరన్
► చార్జ్‌షీట్ దాఖలు
► ఇక, సాక్షుల వద్ద విచారణ
► సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారు
► టీటీవీ వ్యాఖ్య
సాక్షి, చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనపై అభియోగం మోపుతూ ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల్ని విచారించేందుకు కోర్టు నిర్ణయించింది. అయితే, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించినట్టుగా కోర్టు ముందు దినకరన్ వాదన వినిపించారు.
టీటీవీ దినకరన్‌పై విదేశీ మారక ద్రవ్యం కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టులో సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో తాజాగా, కేసు విచారణ వేగాన్ని న్యాయమూర్తి మలర్మతి పెంచారు. విచారణకు దినకరన్ తొలుత హాజరైనా తదుపరి గైర్హాజరయ్యారు. ఇందుకు కారణం రెండాకుల కోసం ఈసీకి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీహార్ జైలుకు పరిమితం చేయడమే. ప్రస్తుతం ఆయన బెయిల్ మీద బయటకు రావడంతో గురువారం విచారణ నిమిత్తం ఎగ్మూర్ కోర్టుకు హాజరయ్యారు.
కోర్టుకు దినకరన్..
ఉదయం న్యాయమూర్తి మలర్మతి ఎదుట విచారణకు దినకరన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ వర్గాలు ఆయన మీద అభియోగం మోపుతూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని వ్యవహారంలో ఇరికించారని, తనపై అభియోగాలు మోపుతున్నారని పేర్కొంటూ దినకరన్ న్యాయమూర్తి ఎదుట తన వాదన వినిపించారు. ఈసందర్భంగా ఈడీ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి ప్రశ్నించారు. సాక్షులను ప్రవేశ పెట్టాలని సూచించారు. అయితే, ప్రస్తుతం సాక్షులు రాలేదని, సమయం కేటాయించాలని కోరారు. దీంతో ఇక, ప్రభుత్వం తరఫు సాక్షుల వద్ద విచారణ సాగుతుందంటూ తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు.
కోవైకు సుఖేష్:
టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులకు అడ్డంగా బుక్ చేసిన బ్రోకర్ సుఖేష్ చంద్ర శేఖర్‌ను గురువారం కోయంబత్తూరు కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. కోయంబత్తూరు గణపతి శివశక్తి కాలనికి చెందిన బాలకృష్ణ కుమారుడు రాజవేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుఖేష్ చంద్ర శేఖర్, అతడి తండ్రి చంద్రశేఖర్‌ల మీద మోసం కేసు నమోదై ఉంది. ఈ కేసులో గతంలో అరెస్టయిన ఈ ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చారు.
చంద్ర శేఖర్ విచారణకు హాజరవుతుండగా, సుఖేష్ పత్తా లేకుండా పోయాడు. ఢిల్లీ పోలీసులు రెండాకుల చిహ్నం కేసులో అతడ్ని అరెస్టు చేయడంతో కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు తీసుకొచ్చిన పోలీసులు న్యాయమూర్తి రాజ్‌కుమార్ ఎదుట హాజరు పరిచారు. సుఖేష్‌ను ఈనెల 22వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో గట్టి భద్రత నడుమ సుకేష్‌ను ఢిల్లీకి రైల్లో తరలించారు.