జయలలిత ఫ్రెండ్ కి కోర్టు నోటీసులు
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు గీతకు ఎగ్మూరు నేరవిభాగ కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నెల 11వ తేదీలోగా తమ ఎదుట హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. జయలలిత మరణం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించాలని కోరుతూ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేయడంతో నోటీసులిచ్చింది.
జయలలిత గతేడాది సెప్టెంబర్ 22న అనారోగ్యం కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరి డిసెంబర్ 5న కన్నుమూశారు. ఆమె మృతిపై పలు వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జయ మరణంపై తనకు సందేహం ఉందని, ఆమెను హత్య చేశారనే అనుమానాలున్నట్లు గీత పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత చికిత్స గురించి ఢిల్లీలో సమర్పించిన నివేదిక అబద్దపు నివేదిక అని, అసలైన నివేదిక తన వద్ద ఉందని గీత చెబుతున్నారు.