
చెన్నై ,పెరంబూరు: నటుడు విశాల్ బుధవారం చెన్నై, ఎగ్మూర్ కోర్టులో లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే నటుడు విశాల్ తనపేరుతో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. అందుకోసం స్థానిక వడపళనిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే వారికి చెల్లించే వేతనాలకు సంబంధించి టీటీఎస్‌ను ఆదాయశాఖకు కట్టడం లేదు. అలా సుమారు రూ.4 కోట్ల వరకూ బాకీ ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై ఆదాయ పన్ను శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినా విశాల్ స్పందించలేదు. దీంతో ఆదాయపన్ను శాఖాధికారులు విశాల్‌పై స్థానిక ఎగ్మూర్ న్యాయస్తానంలో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు విశాల్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి వలర్మతి విశాల్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేశారు. అయినా విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరయ్యారు. దీంతో మంగళవారం మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ సారి కూడా విశాల్ హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంటును జారీ చేశారు. దీంతో బుధవారం ఉదయం నటుడు విశాల్ కోర్టులో లొంగిపోయారు. అయితే ఆయన్ని సుమారు రెండుగంటలకు పైగా అంటే మధ్యాహ్నం వరకూ వేచి ఉంచారు. అనంతరం కేసుపై విచారణ జరిపా రు. ఆయనపై అరెస్ట్ వారెంట్‌ను వెనక్కి తీసుకునేలా న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అయితే కేసు మాత్రం విచారణలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment