మినహాయించండి
సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను దాఖలు కేసులో విచారణకు స్వయంగా హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఎగ్మూర్ కోర్టులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ వేర్వేరుగా గురువారం పిటిషన్లను దాఖలు చేశారు. తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి న్యాయమూర్తి దక్షిణామూర్తి వాయిదా వేశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళలపై ఆదాయపు పన్ను దాఖలు కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ఎగ్మూర్ ఆర్థిక నేరాల కోర్టులో ఏళ్ల తరబడి సాగుతోంది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో విచారణ వేగం పెరిగింది. అయినా, వాయిదాల మీద వాయిదాలతో కాలయాపన సాగుతూనే ఉంది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడవు ముగిసినా, మళ్లీ పొడిగించుకోవాల్సిన పరిస్థితి ఎగ్మూర్ కోర్టుకు ఏర్పడింది. ఈ కేసు విచారణ ముగింపు లక్ష్యంగా న్యాయమూర్తి దక్షిణా మూర్తి చర్యలు చేపట్టిన సమయంలో జయలలిత, శశికళ అండ్ బృందానికి బెంగళూరు కోర్టు శిక్ష విధించింది. ఆ ఇద్దరు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉండడంతో కేసును వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు జయలలిత, శశికళ బెయిల్ మీద బయటకు రావడంతో ఆ ఇద్దర్నీ కోర్టుకు రప్పించేందుకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు.
సమన్లు జారీ : విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ సమన్లు జారీ కావడంతో జయలలిత, శశికళ తరపు న్యాయవాదులు మేల్కొన్నారు. ఇప్పటికే జైలు శిక్ష నేపథ్యంలో పడుతున్న తంటాలకు ఆదాయపు పన్ను దాఖలు కేసు ఎక్కడ ఇరకాటంలో పడేస్తుందోనన్న బెంగ తప్పలేదు. దీంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆదాయపు పన్ను శాఖతో సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యల్లో ఉన్నామని, ఇందుకు కాస్త సమయం పట్టొచ్చంటూ హైకోర్టుకు వివరించారు. అంత వరకు స్వయంగా ఎగ్మూర్‌కోర్టుకు జయలలిత, శశికళ హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీంతో నవంబర్ 28 వరకు మినహాయింపు ఇస్తూ హైకోర్టు ఆ ఇద్దరికీ కాస్త ఊరట నిచ్చింది.
ఒకటికి వాయిదా : గురువారం నాటి విచారణకు జయలలిత, శశికళ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, హైకోర్టు కల్పించిన ఊరటను ఎత్తి చూపుతూ ఆ ఇద్దరి తరపు న్యాయవాదులు ఎగ్మూర్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈనెల 28 వరకు జయలలిత, శశికళ ఎలాంటి విచారణలకు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దీనిని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఇద్దరి తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. చివరకు తదుపరి విచారణను డిసెంబరు ఒకటో తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.