నిందితులు వెన్నెల, విజి, చెన్నైలోని చిదంబరం నివాసం (ఇన్‌సెట్)
‘వామ్మో.. చోరీ జరిగింది.. కోట్లాది రూపాయల విలువైన సొత్తు ఎత్తుకెళ్లారని గగ్గోలు, పోలీసులకు ఫిర్యాదు. ఇంతలోనే తూచ్.. చోరీ లేదు గీరీ లేదు, వస్తువులన్నీ భద్రం.. కేసు వాపస్’. మొత్తం ఈ కేసు వ్యవహారాన్ని ప్రత్యక్షంగా నడిపించింది వేరెవరో కాదు తమిళనాడులో ప్రముఖ న్యాయవాది నళిని చిదంబరం. ఈమెమరెవరో కాదు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సతీమణి. చోరీ జరగలేదు.. కేసు నమోదు కాలేదు. అయితేనేం మంగళవారం రాత్రి ఇద్దరు మహిళా దొంగలను అరెస్ట్‌తోపాటు సొత్తు రికవరీ చేసేశారు. ‘చిదంబర’రహస్యం అనే విచిత్రమైన పరిస్థితికితెరదీశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై నుంగంబాక్కంలోని భారీ భవంతిలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన భార్య నళిని, కుమారుడు కార్తీ చిదంబరం, కోడలు శ్రీనిధి నివసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పనిలో ఎక్కువ కాలం ఢిల్లీలో గడపడం చిదంబరానికి అలవాటు. వరుసగా పదేళ్లపాటు యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మాజీ హోం, ఆర్థిక మంత్రి వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలకు ఆయన సారథ్యం వహించడంతో సహజంగానే ఆయన ఇంటికి 24 గంటల సాయుధ పోలీసులు బందోబస్తు ఏర్పాటైంది. ఈనెల 8వ తేదీన నళిని చిదంబరం ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు నగల బీరువా తెరచి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలో భద్రం చేసిన పురాతన కాలం నాటి మరకతాలు, మాణిక్యాలు, బంగారు ఆభరణాలు, విలువైన నగలు,అత్యంత ఖరీదైన ఆరు చీరలు, రూ.1.50 లక్షల నగదు చోరీకి గురైనట్లు సమాచారం.
భర్త, కుమారుని సలహా మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి మురళి ద్వారా నుంగంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోరెన్సిక్ నిపుణలతో కలిసి వచ్చి పోలీసులు రావడం, సీసీ టీవీ పుటేజీల్లో దృశ్యాల ఆధారంతో నెలరోజుల క్రితం ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడడం, వారిద్దరూ చిదంబరం ఇంటిలో గత పదేళ్లుగా పనిచేసే సొంత సోదరీలైన వెన్నెల, విజి అనే మహిళలని నిర్ధారించకోవడం చకచకా జరిగిపోయాయి. చెన్నై టీ.నగర్‌లోని ఒక ఇంటిలో చోరీసొత్తు దాచిపెట్టినట్లు ఫిర్యాదు అందిన రోజునే కనుగొన్నారు. ఇదిలా ఉండగా, తామిచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నాం, ఈ కేసుకు సంబంధించి ఇక ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చిదంబరం దంపతుల వ్యక్తిగత కార్యదర్శి మురళి పోలీసులకు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశాడు. ఈ చోరీ వ్యవహారంలో ఇక ఎలాంటి విచారణ చేపట్టబోమని పోలీసులు సైతం ఆయనకు హామీ ఇచ్చారు.
కేసు వెనక్కు..చారణ ముందుకు..
ఇంతలో ఏం జరిగిందో ఏమో.. బలమైన ఆధారలతో కూడిన ఫిర్యాదులనే అటకెక్కించే అలవాటున్న పోలీసులు వెనక్కు తీసుకున్న నళినిదంబరం ఫిర్యాదుపై మాత్రం ముందుకు సాగారు. దొంగతనానికి గురైన బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులను రికవరీ చేశారు. వెన్నెల, విజి అనే ఇంటి దొంగలను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. చోరీకి గురైన నగలను రికవరీ చేసి, నిందితులు దొంగతనాన్ని అంగీకరించిన తరువాత తదుపరి చర్యలపై ముందుకు సాగక తప్పదని న్యాయశాస్త్ర నిపుణులు చెప్పడం వల్లనే మహిళా దొంగల అరెస్ట్‌ను చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. పోలీసుల రికార్డు ప్రకారం పి.చిదంబరం ఇంటిలో దొంగతనం జరిగింది. అయితే బాధిత మహిళ నళిని చిదంబరం తరఫున ఇచ్చిన ఫిర్యాదు వాపస్ తీసుకున్నారు. ఇంతకూ చోరీ జరిగినట్లా లేనట్లా అనేది ‘చిదంబర’ రహస్యంగా మారింది.
చిదంబరంపై సుబ్రహ్మణ్య స్వామి చురకలు
కాగా, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై చురకలు వేశారు. అనేక అవినీతి కేసులను ఎదుర్కొంటున్న చిదంబరం, ఆయన కుటుంబ సభ్యులను అధికారులు ఆత్మాహుతి దళ సభ్యుల్లా ఆదుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసుల నుంచి తప్పించేందుకు అన్ని కోణాల్లో సహకరిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment