'స్మృతి ఇరానీ... ఈగో పక్కనపెట్టు'
న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ కారణమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. స్మృతి అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ధ్వజమెత్తారు. అహం తగ్గించుకుని, తన శాఖపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు.
'అధికారంలో ఉన్నవారికి అహం పనికిరాదు. పాలకులకు ఈగో పెద్ద శత్రువు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకోవడం మానేసి తన శాఖపై దృష్టి పెట్టాలని స్మృతి ఇరానీని సవియనంగా కోరుతున్నామ'ని రణదీప్ సూర్జివాలా పేర్కొన్నారు. ఇరాని బాగా చదువుకున్నారని, అయితే అన్ని యూనివర్సిటీల నుంచి ఆమె పట్టాలు ఎలా సాధించారో తెలియడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది, స్మృతి ఇరానీ మధ్య ట్విటర్ లో మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.