ఆదిలోనే అంతరం!
► జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలవని సీఈఓ
► మర్యాదపూర్వకంగా కూడా కలవని వైనం
► చర్చనీయాంశమైన అధికారి తీరు
► పాలనపై ప్రభావం చూపే అవకాశం
సాక్షి, సంగారెడ్డి: ఇద్దరూ మహిళలే.. వాళ్లకు అహం అడ్డొచ్చింది. ఒకరు ఐఏఎస్‌కాగా, మరొకరు జిల్లా పరిషత్తు చైర్మన్. కానీ ఇప్పటి వరకు ఒకరికొకరు ఎదురు పడలేదు. పలకరించుకోలేదు. ఇద్దరి మధ్య ఏర్పడిన అంతరం అప్పుడే చర్చనీయాంశ మైంది. జెడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అధికారిణి వారం రోజులు అవుతున్నా ఇంత వరకు జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలవకపోవటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జెడ్పీ సీఈఓగా ఏ అధికారి బాధ్యతలు స్వీకరించినా ముందుగా చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా కలవటం ఆనవాయితీ.. కాగా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వర్షిణి ఇంత వరకు జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణిని కలవలేదని సమాచారం.
నూతన సీఈఓగా ఐఏఎస్ అధికారి రాకతో జిల్లా పరిషత్‌లో పాలన వ్యవహారాల్లో మార్పులు వస్తాయని అందరూ భావించారు. అయితే సీఈఓ తీరుపై జెడ్పీటీసీలు, రాజకీయ నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్వయంగా సీఈఓ తీరుపై కినుకువహించినట్లు సమాచారం. గతంలో సీఈఓగా పనిచేసిన మధు వ్యవహారశైలి నచ్చక జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి ఆయనను జిల్లా నుంచి బదిలీ చేయాల్సిందిగా మంత్రి హరీశ్‌రావును కోరింది. దీంతో ప్రభుత్వం మధును బదిలీ చేసి ఆయన స్థానంలో మహిళా ఐఎఎస్ అధికారి వర్షిణిని సీఈఓగా నియమించింది.
ఈనెల 11న వర్షిణి జెడ్పీ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులను కలిశారు. అయితే రాజమణితో మాత్రం భేటీ కాకపోవటం గమనార్హం. సీఈఓ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ను సమన్వయం పరుచుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తేనే జిల్లా పరిషత్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా అమలవుతాయని లేనిపక్షంలో పాలన దెబ్బతినే అవకాశం ఉంటుందని జెడ్పీటీసీలు, ప్రజలు అంటున్నారు.