సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ‘అనంత’ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే అది నిజమేననిపిస్తుంది. నిన్నా మొన్నటి వరకు సై అంటే సై అనుకున్న వారు నేడు స్నేహ హస్తం అందుకుంటున్నారు. ఎదుటి వారిని దెబ్బ తీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వర్గ విభేదాలు ఇప్పటికే ముదిరిపాకాన పడగా.. తాజాగా విప్ యామినీ బాల, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వార్ మొదలైంది.
రెండు వర్గాలుగా విడిపోయిన ‘అనంత’ నేతలు ఆధిపత్యం ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ప్రధానంగా పరిటాల వ్యతిరేక వర్గీయులను ఏకం చేసే బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే కేశవ్ భుజాన వేసుకున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీకి అధికారం దక్కడంతో పాటు జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా 12 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రతిఫలంగా జిల్లాకు రెండు మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, విప్ పదవులను కట్టబెట్టారు. తమకు దక్కిన పదవుల ద్వారా జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం పావులు కదుపుతూ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీలోని ఏ ఇద్దరి మధ్య కూడా సయోధ్య లేకుండా ఒకరిపై మరొకరు కత్తులు నూరుకునేలా పరిస్థితి మారిపోయింది. మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. 15 ఏళ్ల క్రితమే పరిటాల రవిని ప్రభాకర్ చౌదరి బాహాటంగానే విభేదించారు.
అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య అంతర్గతపోరు నడుస్తోంది. తాజాగా అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్వరూప విషయంలోనూ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం తలెత్తింది. స్వరూపకు మేయర్ పీఠం దక్కకుండా చివరి వరకూ ప్రభాకర్ చౌదరి యత్నించారు. ఇదే క్రమంలో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకవర్గాన్ని నడిపేందుకు మంత్రి సునీత స్వరూపకు అండగా నిలిచారు. దీంతో స్వరూప పూర్తిగా పరిటాల వర్గంలో చేరిపోయి చౌదరిని వ్యతిరేకి స్తున్నారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలో పరిటాల తనయుడు శ్రీరామ్, ప్రభాకర్ చౌదరిలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుని తమ మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశారు.
చేతులు కలిపిన వైరివర్గం
పరిటాల వర్గానికి చెక్‌పెట్టేందుకు వారి వ్యతిరేకవర్గం చేతులు కలిపింది. మొదట్నుంచి పరిటాల వర్గానికి బద్ధ శత్రువులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో పాటు వరదాపురం సూరి, బీకే పార్థసారథిలు పరిటాల వర్గంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరిటాల వ్యతిరేక వర్గాన్ని ఏకం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది.
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పయ్యావుల కేశవ్ బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్సీ దక్కిన తర్వాత మంత్రి పదవిని ఆశిస్తున్న కేశవ్ తన సామాజిక వర్గానికి చెందిన సునీతకు మంత్రి పదవి దూరం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. దాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రతీ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ పరిటాల వర్గం, వారి వ్యతిరేకుల వివాదాలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పరిటాల వర్గానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మొదట్నుంచి అండగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీటు శ్రీరామ్ ఆశిస్తున్నాడనే కారణంతో నిమ్మల కిష్టప్ప కూడా పరిటాల వ్యతిరేకవర్గం బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సునీత మంచి, చెడులతో పనిలేకుండా తాను అనుకున్నదారిలో నడుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
యామిని బాల, ప్రభాకర్‌రెడ్డి మధ్య విభేదాలు :
యల్లనూరులో ఓ మద్యం దుకాణం వ్యవహారంలో విప్ యామిని బాల, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మంగళవారం తుంపర డీప్‌కట్ వద్ద నీటి విడుదల సమయంలో యామినీబాలపై ప్రభాకర్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించినట్లు సంఘటన ప్రాంతంలో ఉన్న టీడీపీ నేతలు చెబుతున్నారు.
జేసీ బ్రదర్స్ నుంచి ఏదోఒక రోజు సమస్య తప్పదని ముందుగానే భావించిన యామిని బాల.. వారిని ఎదుర్కొనేందుకు పరిటాల వర్గంతో నడుస్తోంది. ఇలా టీడీపీలోని ప్రతీనేత ఆధిపత్యం కోసమే ఆరాటపడుతూ అవసరాన్ని బట్టి ఓ నాయకుని పంచ నుంచి మరో నేత దగ్గరికి చేరుతున్నారు. నేతల మధ్య విభేదాలు చూస్తున్న కార్యకర్తలు పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని తమతో పాటు జిల్లా అభివృద్ధికి పాటు పడకుండా పార్టీని, పార్టీలోని ఐక్యతను బలహీనపరుస్తున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఆధిపత్య లొల్లి
Published Thu, Oct 16 2014 1:44 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement