చైనా ‘పొరుగు’ మిత్ర దేశమేది? శత్రువెవరు?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత లేదు. కానీ, ఆసియాలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ తన మాటను నెగ్గించుకోగలిగే స్థాయికి ఆ దేశం చేరింది. మంగోలియా, వియత్నాం, జపాన్, తైవాన్, భారత్‌లతో చైనాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి.
భారత్‌తో కాకుండా చైనా 13 దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. పాకిస్థాన్ మాత్రమే చైనాకు బలమైన మిత్రదేశం. ఆర్థిక అవసరాలు, అమెరికాతో విభేదాల కారణంగా రష్యా చైనాతో స్నేహాన్ని కొనసాగిస్తుందని భావించొచ్చు. చైనాతో కలిసి ముందుకు నడిస్తేనే.. తాను అమెరికాను నిలువరించగలనని రష్యా అనుకుంటోంది. అదే సమయంలో రష్యా మనకు మిత్ర దేశం.
ఇక అమెరికాతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే ఉత్తర కొరియా చైనాతో మైత్రిని కలిగివుంది. అందుకే కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చేపడుతున్న సైనిక విన్యాసాలు ఆపేయాలని చైనా కోరింది. మంగోలియాకు డ్రాగన్‌తో సంబంధాలు బాగోలేవు. ఇక కజకిస్థాన్, లావోస్, మయన్మార్ దేశాలు కూడా చైనాతో సఖ్యంగా ఉంటున్నవే.
కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఆప్ఘానిస్థాన్‌లు గోపీ.. గోడ మీద పిల్లి అన్న వైఖరితో ఉంటున్నాయి. నేపాల్, భూటాన్‌లు మనకు మిత్ర దేశాలు. దక్షిణ సముద్ర వివాదం నేపథ్యంలో వియత్నాంకు డ్రాగన్ అంటే గిట్టడం లేదు. మొదటి నుంచి జపాన్‌తో చైనా సంబంధాలు అంతంత మాత్రమే. తైవాన్, కంబోడియా, బ్రూనై దేశాలకు కూడా చైనా అంటే చిరాకే. సాగర జలాల్ని పంచుకుంటున్న దేశాల్లో ఒక్క మలేసియా మాత్రమే చైనా పట్ల తటస్థ వైఖరిని కనబరుస్తోంది.