మరో శిఖరాగ్ర భేటీకి సిద్ధమైన ట్రంప్‌ | Donald Trump, Vladimir Putin Finland summit | Sakshi
Sakshi News home page

ఈసారి పుతిన్‌తో..

Published Mon, Jul 16 2018 3:38 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM

Donald Trump, Vladimir Putin Finland summit - Sakshi

ట్రంప్‌–పుతిన్‌ల భేటీకి వ్యతిరేకంగా హెల్సింకిలో నిరసనలు

హెల్సింకి: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి మరో సమావేశానికి సిద్ధమయ్యారు. అమెరికాతో అత్యంత బలహీన సంబంధాలు ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ట్రంప్‌ సోమవారం ఫిన్లాండ్‌లో భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్‌ ఏకాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోనుండటం (వన్‌ టు వన్‌) ఇదే తొలిసారి. వీరు భేటీ అయ్యే గదిలో అనువాదకులు తప్ప మరెవరూ ఉండరు. ఫిన్లాండ్‌ అధ్యక్ష భవనంలోని గోథిక్‌ హాల్‌లో ట్రంప్, పుతిన్‌లు సమావేశమవుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఏ మాత్రం బాగా లేవనీ, బలమైన బంధం కోసం ప్రయత్నం ప్రారంభిస్తున్నామని రష్యా ప్రభుత్వ సలహాదారు యూరీ ఉషకోవ్‌ వెల్లడించారు.

ట్రంప్‌ను ‘సంప్రదింపులు జరిపే నేత’గా తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు గతంలో రష్యా కోసమే పనిచేసిన ఓ గూఢచారిపై రష్యానే బ్రిటన్‌లో విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు, సిరియా అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి రష్యా మద్దతు, క్రిమియాను ఆక్రమించుకోవడం, రష్యాతో ట్రంప్‌ కఠినంగా వ్యవహరించట్లేదంటూ నాటో సభ్య దేశాల భయాలు తదితర అంశాల నేపథ్యంలో ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీపై ఉత్కంఠ నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌లతో ఘర్షణాత్మక వాతావరణం నుంచి స్నేహం వైపు మళ్లిన ట్రంప్, ఇప్పుడు పుతిన్‌తో కూడా అదే రీతిలో వ్యవహరిస్తారో లేదోనని అమెరికా, రష్యాల మిత్రదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్‌తో సన్నిహిత బంధానికే పుతిన్‌ మొగ్గు చూపొచ్చనీ, ట్రంప్‌ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు.   

భారీ అంచనాలేమీ లేవు: ట్రంప్‌
పుతిన్‌తో భేటీపై ట్రంప్‌ శుక్రవారం మాట్లాడుతూ ‘నేనేమీ భారీ అంచనాలతో ఈ సమావేశానికి వెళ్లడం లేదు. కానీ ఈ భేటీ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు తప్ప చెడు జరగదు’ అని అన్నారు. తాను రష్యాతో తొలి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశాన్ని కూడా పుతిన్‌తో చర్చల్లో కచ్చితంగా ప్రస్తావనకు తెస్తానని ట్రంప్‌ చెప్పారు.

12 మంది రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల అకౌంట్లను హ్యాక్‌ చేశారంటూ వారిపై ఇటీవలే అమెరికా నేరాభియోగాలు మోపింది. ఆ 12 మందిని తమకు అప్పగించాలని కూడా తాను పుతిన్‌ను కోరే అవకాశం ఉందని ట్రంప్‌ చెప్పారు. నేరాభియోగాలు నమోదైన నేపథ్యంలో పుతిన్‌తో భేటీని రద్దు చేసుకోవాలని డెమొక్రాట్లు నాలుగు రోజుల క్రితం ట్రంప్‌ను కోరినా, శ్వేతసౌధం తిరస్కరించింది. కాగా, రష్యాను తిరిగి జీ–7 కూటమిలో చేర్చి, మళ్లీ జీ–8గా మార్చాలని కూడా ట్రంప్‌ గతంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పుడు వారు చర్చిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి.  

శత్రువులే కానీ..: రష్యాతోపాటు చైనా, యూరోపియన్‌ యూని యన్‌ (ఈయూ) అమెరికాకు శత్రువులని ట్రం ప్‌ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మాకు చాలా మంది శత్రువులున్నారని నేననుకుంటాను. ఈయూ ఒక శత్రువు. వాణిజ్యంలో వారు మాకు ఏం చేస్తున్నారు? కొన్ని అంశాల్లో రష్యా కూడా శత్రువే. ఆర్థికాంశం పరంగా చైనా మాకు కచ్చితంగా శత్రువే. అయితే వీళ్లంతా చెడ్డవాళ్లని కాదు. పోటీ తత్వం ఉన్నవారు మాత్రమే’ అని ట్రంప్‌  చెప్పారు.  కాగా, బ్రిట న్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. ఫిన్లాండ్‌లోనూ ట్రంప్‌ అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement