పుతిన్‌ పాచికకు ట్రంప్‌ చిత్తు...! | Trump Caved Spectacularly to Putin in Summit | Sakshi
Sakshi News home page

పుతిన్‌ పాచికకు ట్రంప్‌ చిత్తు...!

Published Tue, Jul 17 2018 9:14 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Trump Caved Spectacularly to Putin in Summit - Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో శిఖరాగ్ర భేటీ ద్వారా కొంత సానుకూల ఇమేజి పొందాలనుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలోచనలకు మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫిన్లాండ్‌లోని హెల్సెంకీలో జరిగిన భేటీలో పుతిన్‌ ముందు ట్రంప్‌ తేలిపోయారని, గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు కూడా ఈ స్థాయిలో అణిగిమణిగి, దిగజారిపోలేదంటూ కొందరు అమెరికన్‌ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు దుమ్మెత్తిపోసాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోలేదంటూ పుతిన్‌ ఇచ్చిన స్వయం దృవీకరణకు ట్రంప్‌ వంతపాడడాన్ని అమెరికన్‌ రాజకీయ నేతలు, మీడియా తూర్పారపడుతున్నాయి.  ట్రంప్‌ ఇష్టపడే ‘ఫాక్స్‌’ నెట్‌వర్క్‌ సైతం పుతిన్‌తో కలిసి ఆయన నిర్వహించిన వివాదాస్పద  మీడియా సమావేశాన్ని ఎండగట్టింది. అమెరికా నిఘా వ్యవస్థపై కంటే కూడా పుతిన్‌ చెప్పిన మాటలనే తాను నమ్ముతున్నానని ట్రంప్‌ పేర్కొనడాన్ని సీఎన్‌ఎన్, ఫాక్స్‌ ఇతర సంస్థలు తప్పుబట్టాయి. టీవీ చర్చలతో పాటు, ట్విటర్, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ట్రంప్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. 

రెండు పెద్ద దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశమంటే అంతర్జాతీయ సమాజంపై ప్రభావం చూపే నిర్ణయాలు ఏవైనా వెలువడతాయా అన్న భావనకు భిన్నంగా అమెరికా స్థానిక రాజకీయాలు అక్కడ చర్చనీయాంశం కావడాన్ని పరిశీలకులకు సైతం మింగుడుపడడం లేదు. గత ఎన్నికల్లో తాను హిల్లరీ క్లింటన్‌ను సులభంగా ఓడించానని, అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై స్పెషల్‌ ప్రాసిక్యూటర్‌  రాబర్ట్‌ మలర్‌ విచారణ అవమానకరమైనదిగా ట్రంప్‌ అభివర్ణించడాన్ని తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ అంశాలపై, రెండు దేశాల సంబంధాలపై కూలంకశంగా చర్చించాల్సిందిపోయి పుతిన్‌ పన్నిన రాజకీయ ఉచ్చులో ట్రంప్‌ సులభంగా పడిపోయారని వారి అభిప్రాయం.  అమెరికా ఎన్నికల్లో 12 మంది రష్యన్‌ మిలటరీ అధికారుల ప్రమేయం ఉందంటూ ఇటీవలే మల్లర్‌  నిగ్గుతేల్చారు. సెనేట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ, ఇతర సంస్థలు కూడా దీనిని నిర్థారించాయి. అయితే తమ నిఘా సంస్థల విచారణను తిరస్కరించేలా ట్రంప్‌ చేసిన ప్రకటన వల్ల అమెరికన్‌ ఆత్మగౌరవానికి దెబ్బ తగిలినట్టుగా మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు.

ట్రంప్‌ వేసిన తప్పటడుగు వల్ల పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సి రావచ్చునని పరిశీలకులు చెబుతున్నారు. రష్యా జోక్యంపై మల్లర్‌ నిర్థారణ నేపథ్యంలో అసలు పుతిన్‌తో శిఖరాగ్ర భేటీనే రద్దు చేసుకోవాలనే వత్తిడి ట్రంప్‌పై వచ్చింది. అయినా ఖాతరు చేయకుండా అమెరికా గత విధానాలను బహిరంగంగా విమర్శించారు. కొన్నేళ్ల అమెరికా మూర్ఖత్వం, అవివేకం కారణంగా రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ఆ దేశం ప్రభావితం చేసిందనే ఆరోపణలతో అవి మరింత దిగజారాయని ఈ భేటీకి ముందు ట్రంప్‌ చెప్పారు. అంతేకాకుండా రష్యా కంటే కూడా ఐరోపా సంఘం (ఈయూ)మే పెద్ద శత్రువు అన్న ఆయన మాటలూ అమెరికన్లకు రుచించడం లేదు.  

విభేదాలను మరిచిపోయారా ?
రష్యా వైఖరిపట్ల అమెరికాకు అనేక అంశాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆ దేశం క్రీమియాను కైవసం చేసుకోవడం, ఉక్రేయిన్‌పై ఆధిపత్యం చెలాయించడం, సిరియా విషయంలో రెండు దేశాలు పరస్పరభిన్నమైన వైఖరి తీసుకోవడం, అమెరికా వ్యతిరేకిస్తున్న ఇరాన్‌ ప్రభుత్వానికి రష్యా మద్దతు కొనసాగింపు, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ఉన్‌ను తనపావుగా అమెరికాపై పుతిన్‌ ప్రయోగిస్తున్నాడనే అనుమానాలు, నాటో దేశాల విస్తరణను రష్యా వ్యతిరేకించడం వంటివి కొంతకాలంగా ఈ రెండుదేశాల మధ్యనున్న వైరం కొనసాగడానికి కారణమవుతున్నాయి. శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాలపై చర్చించకుండా రష్యాకు వత్తాసు పలకడం ఎవరికీ కొరుకున పడడం లేదు. ఈ స్థాయిలో భేదాభిప్రాయాలున్నప్పటికీ పుతిన్‌ తానా అంటే ట్రంప్‌ తందానా అనడం అమెరికన్ల వ్యతిరేకతకు కారణమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement