ఆధ్యాత్మి‘కథ’
తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి దగ్గరగా బంగాళాఖాతం సముద్ర తీరం వద్ద ఉన్న కుగ్రామం అది. అక్కడినుంచి ఓ యువకుడు స్వామి వారి దర్శనార్థం తిరుమల బయలుదేరాడు. ఏడు పదుల వయస్సు నిండిన తండ్రి కూడా తిరుమల వస్తానన్నాడు. అయితే, కూర్చుంటే లేవలేని, లేస్తే కూర్చోలేని ఆ వృద్ధుడి శరీరం ప్రయాణానికి సహకరించలేదు. కొండకు రాలేక పోతున్నందులకు తండ్రి చాలా బాధపడ్డాడు. ఇంటిలోని స్వామి వారి పటాన్ని చూస్తూ ‘‘మహిమలున్న స్వామివారి కొండనుంచి ఎన్నాళ్ళయినా చెడనిది, నీటిలో కరగనిది, ఎన్నటికీ వాడనిది ఏదైనా ఒకటి తీసుకుని రా! అయితే అది పవిత్రమైనదిగా ఉండాలి!!’’ అని చెప్పాడు.
‘‘అలాగే నాన్నా!’’ అని చెప్పి రైలు ఎక్కాడు ఆ యువకుడు. ఆ రోజు గురువారం కావడంతో అతి నిరాడంబర స్వరూపంతో నొసటన చాలా సన్నని నామం మాత్రమే కలిగి ఉన్నారు స్వామివారు. గురువారం మాత్రమే కనిపించే ‘నేత్ర దర్శనం’ తృప్తిగా చేసుకున్న ఆ యువకుడు ఆనంద నిలయం నుంచి బయటికి వచ్చాడు. లడ్డూ ప్రసాదాలూ, కలకండ, తులసి చెట్టు లాంటివి తీసుకున్నాడు. గబుక్కున తండ్రి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అయితే, తండ్రి చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది, ఏదై ఉంటుందా?’ అని ఆలోచించాడు. తను తీసుకున్న లడ్డూ ప్రసాదం వైపు చూశాడు. ‘ప్రసాదం ఎక్కువ కాలం నిల్వ ఉండదు కదా’ అనుకున్నాడు. కలకండ వైపు చూశాడు. ‘ఇది నీటిలో సులభంగా కరిగి΄ోతుంది కదా’ అని భావించాడు. తులసి చెట్టు వైపు చూశాడు. ‘కొన్నేళ్ళకైనా చెట్టు వాడినొతుంది కదా’ అని తలచాడు. ‘మరి తండ్రి చెప్పినట్లు వేరే ఏదైనా ఇక్కడ దొరుకుతుందా?’ అని మాడ వీధుల్లో వెదికాడు. ఆలాంటి వస్తువు ఏదీ అతడికి కనిపించలేదు.
‘నాన్నకి సులభంగా మాట అయితే ఇచ్చాను కానీ, అది నేరవేర్చలేకపోతున్నానే...’ అని బాధగా నడవటం ప్రారంభించాడు. రైల్లో వెళ్ళడానికి మరింత సమయం ఉండటంతో నామాల మిట్ట వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. ‘పరిష్కారం ఏమిటా?’ అని పరిపరి విధాలా ఆలోచించాడు. అయితే పరిష్కారం ఏదీ దొరకలేదు. అక్కడినుంచి శిలా తోరణం వద్దకు నడుచుకుంటూ వెళ్ళాడు. సహజసిద్ధమైన ఆ తోరణాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఓ కారు వచ్చి అక్కడ ఆగింది. అందులో హిందీ భాష మాట్లాడుతూ ఉన్న ఉత్తర భారత దేశీయులు ఉన్నారు.
వాళ్ళు కారులో నుంచి దిగిందే ‘గోవిందా గోవిందా’ అని నామస్మరణ చేస్తూ నేలకు నమస్కరించారు. అక్కడే ఉన్న చిన్న రాళ్ళకు కూడా దండాలు పెట్టారు. అప్పుడు అతడి మనసులో మెరుపులాంటి ఆలోచన వచ్చింది.తిరుమల కొండలోని చెట్టూ పుట్టా, రాయీ ర΄్పా... అన్నీ పవిత్రమైనవే! ఈ నేలంతా స్వామి వారి పాద స్పర్శతో పునీతమైనదే. కాబట్టి ఇక్కడి రాయిని తీసుకెళ్ళి నాన్నకి ఇస్తాను. నాన్న చెప్పినట్లు ‘చెడనిది, కరగనిది, వాడనిది... పవిత్రమైనదీ ఇదే’ అని భావించి ఒక గుండ్రటి రాయిని తీసుకుని సంచిలో వేసుకున్నాడు. గోవింద నామ స్మరణలు చేస్తూ ఊరికి ప్రయాణం కట్టాడు. కొడుకు తెచ్చిన రాయిని చేతిలోకి తీసుకున్న ఆ వృద్ధుడి కళ్ళు తన్మయత్వంతో తడి అయ్యాయి. ఆ రాయికి పాలతో, నీళ్ళతో అభిషేకం చేసి, నామాలు పెట్టి, తులసి మాల వేసి దేవుడి గదిలో ఉంచారు. ‘స్వామే మన ఇంటికి నడిచి వచ్చాడు!’’ అనుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజ చేసి, కొండ లడ్డును ఊరంతా పంచిపెట్టారు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment