నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో ఏ ఒక్కరూ మార్కెట్ల భారీ పతనాన్ని ఊహించలేదు. అలాగే మార్చిలో నమోదైన భారీ అమ్మకాల నుంచి వెనువెంటనే మార్కెట్లు(సెన్సెక్స్- నిఫ్టీ) 34,000- 10,000 పాయింట్ల స్థాయికి బౌన్స్ అవుతాయనీ అంచనా వేయలేదంటున్నారు మిరాయ్ అసెట్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కో సీఈవో రాహుల్ చద్దా. మార్కెట్ల గమనం, పెట్టుబడి వ్యూహాలు, లిక్విడిటీ తదితర అంశాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..
ఆటుపోట్లు తప్పవు
ఓవైపు కరోనా వైరస్ ముట్టడి.. మరోపక్క యూఎస్, యూరోజోన్ అమలు చేస్తున్న భారీ సహాయక ప్యాకేజీల కారణంగా మార్కెట్లు అనుకూల, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ఇందువల్లనే తొలుత పతనంలోసాగాక.. తిరిగి ర్యాలీ బాట పట్టాయి. ఇకపై మార్కెట్లు వాస్తవికపరిస్థితుల ఆధారంగా స్పందించవచ్చు. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, రంగాలపై విభిన్న ప్రభావాలు కనిపిస్తాయి. రానున్న ఆరు నుంచి 9 నెలల కాలంలో ఈ మార్పులకు అవకాశముంది. తాజాగా చైనాలోని బీజింగ్‌లో రెండో దశ కరోనా కేసులు తలెత్తడంతో ప్రాంతాలవారీగా లాక్‌డవున్ విధిస్తున్నారు. ఇలాంటి వార్తలు మార్కెట్లను దెబ్బతీసే వీలుంది. అయితే మెరుగైన ఆరోగ్య పరిరక్షణ సౌకర్యాల కారణంగా ప్రజలు కరోనాతో కలసి జీవించగలిగితే.. మార్కెటకు హుషారొస్తుంది.
దీర్ఘకాలానికి
సమీప కాలంలో అంటే రెండు మూడు త్రైమాసికాలలో మార్కెట్లు, వివిధ రంగాలు అనుకూల ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముంది. మూడు, నాలుగేళ్ల కాలానికి చూస్తే.. కంపెనీల ఫండమెంటల్స్‌పై మార్కెట్లు దృష్టిపెడతాయి. కంపెనీలు, స్టాక్స్‌పై దీర్ఘకాలంలో ఫండమెంటల్ అంశాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ప్రతీఒక్కరూ లిక్విడిటీ, చౌక వడ్డీ రేట్లను ప్రస్తావిస్తున్నారు. ఇందువల్లనే మార్కెట్లలో ర్యాలీ వచ్చినప్పటికీ.. ఎల్లవేళలా ఇది పనిచేయదు. 2000 మార్చి, 2007-2008 కాలంలో లిక్విడిటీ ఉన్నప్పటికీ మార్కెట్లు బుడగలా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లు లిక్విడిటీవల్లనే బలపడుతున్నప్పటికీ కంపెనీల పనితీరు సైతం మెరుగుపడనున్న అంచనాలు జత కలుస్తున్నాయి. ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి బయటపడితే.. కంపెనీల ఆర్జనలు, అంచనాలు ప్రభావం చూపగలుగుతాయి. తక్కువ వడ్డీ రేట్లు, చౌక నిధుల కారణంగా ఆర్థిక వ్యవస్థలు సాధారణ స్థితికి రావలసి ఉంది. అయితే కొన్ని దేశాల మార్కెట్లు, కంపెనీలు వ్యయభరిత స్థాయిలో ట్రేడవుతున్నాయి. రానున్న రెండు, మూడేళ్లలో కోవిడ్‌కు వ్యాక్సిన్లు వెలువడితే.. ప్రోత్సాహకర ఫలితాలు సాధించే రంగాలు, కంపెనీలు వెలుగులో నిలుస్తాయి.
బీమా గుడ్
దేశీయంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇది లాక్‌డవున్ పొడిగింపులకు కారణమవుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి పారిశ్రామిక ప్రాంతాలలో సమస్యలు సృష్టిస్తోంది. వెరసి కోవిడ్-19 ప్రభావం అధికంగా కనిపించనుంది. దీంతో బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు ఎదురయ్యే వీలుంది. బీమా రంగానికి మాత్రం అవకాశాలు పెరగనున్నాయి. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ఆర్థిక రికవరీ కనిపించింది. వెస్ట్‌లైఫ్ వంటి కంపెనీలు ఆకర్షణీయ అమ్మకాలు సాధించాయి. రియల్టీ సైతం కళకళలాడింది. ఫారెక్స్ నిల్వలు సైతం 18 శాతం పుంజుకున్నాయి. తగినంత లిక్విడిటీ నెలకొంది. అయితే కరోనా వైరస్ కట్టడికి లాక్‌డవున్ విధించినప్పటికీ ఢిల్లీ, ముంబై, తమిళనాడు వంటి ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడం ద్వారా ఈ సవాళ్లనుంచి బయటపడగలిగితే.. తిరిగి సానుకూల పరిస్థితులు ఏర్పడే వీలుంది.
రెండేళ్లలో
కరోనాను కట్టడి చేయగలిగితే.. ఏడాది, రెండేళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ సాధారణ పరిస్థితులకు చేరుకోగలదని భావిస్తున్నాం. ఫలితంగా పటిష్ట వృద్ధిని అందుకునే చాన్స్ ఉంది. గత దశాబ్ద కాలంలో దేశీ కంపెనీలలో ఎఫ్‌ఐఐల వాటా తక్కువగా నమోదవుతూ వస్తోంది. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే తక్కువ ప్రీమియంలో ఉంది. ఉత్పాదకత పుంజుకోవడం, మౌలిక సదుపాయాల కల్పన వంటి సానుకూల పరిస్థితుల కారణంగా గత మూడేళ్లలో అభివృద్ధి పథాన నడుస్తోంది. కోవిడ్-19కు కళ్లెం వేయగలిగితే.. ఇలాంటి సానుకూలతలు మార్కెట్లకు జోష్‌నివ్వవచ్చు. అయితే ముంబై, ఢిల్లీ, తమిళనాడు వంటి పరిస్థితులు పెట్టుబడులకు విఘాతం కలిగించవచ్చు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా కృష్టి చేయవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment